టాలీవుడ్ కు పాకిన ఫోన్ ట్యాపింగ్?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, టాలీవుడ్ కు కూడా పాకిందా? అవుననే అంటున్నారు చాలామంది. అనధికారికంగా రికార్డ్ చేసిన చాలా కాల్స్ లో టాలీవుడ్ ప్రముఖుల కాల్ డేటా ఉందనే ప్రచారం ఊపందుకుంది.

గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో కొంతమంది పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వంలో కొందరు ప్రముఖులకు అంతర్గతంగా వచ్చే బెదిరింపుల్ని గుర్తించడంతో పాటు, ప్రత్యేక భద్రత కింద స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వానికి ఈ అధికారం ఉంది. కాకపోతే దాన్ని దుర్వినియోగం చేశారనేది తాజా ఆరోపణ. ఒక దశలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కాల్స్ ను కూడా ట్యాపింగ్ చేశారనే విషయం బయటకొచ్చింది. ఈ క్రమంలో కొంతమంది పోలీసు అధికారులపై విచారణ కొనసాగుతోంది. ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు, ఫైల్స్ ను కూడా తిరిగి రీస్టోర్ చేసే ప్రక్రియ మొదలైంది.

ఈ నేపథ్యంలో.. రీస్టోర్ చేసిన డేటాలో కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు, హీరోయిన్ల కాల్ డేట్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఫోన్లు ట్యాప్ చేసి కొంతమంది సెలబ్రిటీల్ని తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని, మరికొంతమంది నుంచి భారీగా డబ్బు గుంజారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొంతమంది సెలబ్రిటీలు, గత ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు భారీగా డబ్బులిచ్చినట్టు ఫోన్ కాల్స్ లో బయటపడింది. ఇక కొంతమంది సెలబ్రిటీల్ని వ్యక్తిగత అవసరాల కోసం కూడా వాడుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. టాలీవుడ్ లో ఓ స్టార్ కపుల్ విడిపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అసలు కారణమంట. ఇలా ఫోన్ ట్యాపింగ్ చుట్టూ చాలా రకాల కథనాలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ అయితే దాదాపు నిండిపోయింది. ఇందులో ఎంత శాతం నిజం ఉందనే విషయాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం త్వరలోనే వెల్లడించనుంది.