పవన్ నిర్వహించే దర్బారా? మజాకా?

‘బాధితులతో మాట్లాడుతున్నా..’ అని జనసేనాని అంటారు. జనంలో ఒకడిగా కలిసిపోతుంటారు. నిరుపేదలు, రైతులు, మరణించిన వారి ఇళ్లకు వెళ్లేప్పుడు వారితో పాటు కలిసి నేలమీదే కూర్చుని దిగిన ఫోటోలను మీడియాకు విడుదల చేస్తుంటారు. ఇంతగా సామాన్యులతో కలిసిపోయే నాయకుడు మరొకరు ఉంటారా? మిగిలిన వారికైతే ఎంతటి ప్రోటోకాల్ అహంకారాలు ఉంటాయో కదా అని అందరికీ అనిపిస్తుంది. కానీ పవన్ కల్యాణ్ తీరు దొరగారు దర్బార్ నిర్వహిస్తున్న తీరుగా ఉంటుందని కొందరు అంటుంటారు. ఆ విషయమే నిజమని ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. 

పెడనలో చీకటి పనులు చేస్తున్న తన అనుచరులను అరెస్టు చేసిన పోలీసుల వైఖరిపై జనసేన అధినేత మంగళగిరి కార్యాలయంలో దర్బార్ నిర్వహించారు. పెడన బాధితులను పిలిపించి మాట్లాడారు. డిటోడిటోగా.. ఎమ్మెల్యే అరాచకాలు, ప్రభుత్వం దుర్మార్గాలూ, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తెన్నుల మీద సుదీర్ఘంగా తన రికార్డు వినిపించారు. 

విషయం ఏంటంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ పోస్టర్లు ముద్రించడం తప్పు కాదు. ఎన్నయినా ముద్రించవచ్చు. కానీ.. ఆ పోస్టరుకు అనుమతి ఉండాలి. కనీసం అనుమతి కోసం ప్రయత్నించి.. రాకపోయినప్పుడు ప్రభుత్వాన్ని నిందించినా బాగుండేది. కానీ జనసైనికులు.. తమకు తోచిన తిట్లతో పోస్టర్లు వేసేసి.. అర్ధరాత్రి వాటిని అంటించే చీకటి ప్రయత్నాలకు పాల్పడ్డారు. తమ పనిలో నిజాయితీ ఉంటే పట్టపగలే పోస్టర్లు అంటించే ప్రయత్నం చేసి.. తద్వారా ఏర్పడగల రచ్చకు సిద్ధమేనని ప్రకటించవచ్చు కదా! చీకటి పనులుచేసే అనుచరులకు బుద్ధి చెప్పలేని పవన్ కల్యాణ్, వారి కులాలను తెరమీదికి తెచ్చి చీప్ గా మాట్లాడుతున్నారు. 

ఇదంతా పక్కన పెడితే.. ఈ ఫోటోలో గమనించండి. పవన్ పెడన బాధితులతో నిర్వహిస్తున్న దర్బార్ తీరు తెన్నులు అర్థమవుతున్నాయి. పెడన నుంచి వచ్చిన వాళ్లు ఆ పూటకు అతిథులు గనుక.. ఎంచక్కా కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. పవన్ పెదరాయుడులాగా మరోవైపు కొలువు తీరారు. ఆయన అనుచరులు, వందిమాగధులు, బృందగణాలు అందరూ పక్కనే దడికట్టి నిల్చుని ఉన్నారు. 

ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినది ఏంటే.. ఆ పక్కన నిల్చున్న నాయకుల్లో కనీసం ఒక్కడైనా పవన్ పక్కన కుర్చీలో కూర్చోడానికి అర్హత ఉన్నవాడు లేడా? తన పక్కన ఎవడైనా కూర్చుంటే.. పవన్ అహం దెబ్బతింటుందా? పైగా ఫోటోలో గమనించండి.. పక్కన ఉన్న ప్రమథగణాలందరూ చేతులు కట్టుకుని నిల్చుని ఉన్నారు. హెడ్మాస్టరు పిల్లల్ని పిలిచి పంచాయితీ చేస్తోంటే.. అతివినయం ప్రదర్శించే పిల్లలందరూ చేతులు కట్టుకుని నిల్చున్నట్టుగా ఉంది. ఇది వారి వైఖరి కాదు. పవన్ ఆశించే వైఖరి అనిపించేలా ఉంది. 

తన ముందు ఎవ్వరైనా సరే.. చేతులు కట్టుకుని అతివినయంగా ఉండాలని మాత్రమే జనసేనాని ఆశిస్తుంటారా? అనే అభిప్రాయం కలిగించేలా ఉంది. జనసేన పార్టీలో కాస్త జనస్వామ్యం ఉండేలా, మనుషులకు విలువ గౌరవం ఉండేలా పవన్ చర్యలు తీసుకుంటే..తన అహంకారాన్ని తగ్గించుకుని, ఇతరులకు కూడా విలువ ఇచ్చి చూస్తే తర్వాత రాష్ట్రాన్నంతా ఏలడం గురించి ఆలోచించొచ్చు అని ప్రజలు అనుకుంటున్నారు.

Show comments