జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌ చెబుతాడా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎట్ట‌కేల‌కు త‌న త‌ప్పు తెలుసుకున్నారు. భేష‌జాల‌కు వెళ్ల‌కుండా భువ‌నేశ్వ‌రికి ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 

టీడీపీలో అంద‌రికంటే త‌న‌కు భువ‌నేశ్వ‌రితో స‌న్నిహితం ఉంద‌న్నారు. ఆమెని అభిమానంతో అక్కా అని పిలుస్తాన‌న్నారు. పొర‌పాటున మాట దొర్లింద‌ని, ఇందుకు చింతిస్తున్న‌ట్టు వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌క‌టించి ఓ స‌మ‌స్య‌కు ముగింపు ప‌లికారు.

వంశీ మాదిరిగానే టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి త‌న త‌ప్పున‌కు ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేస్తారా? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌ప్పులు చేయ‌డం మాన‌వ స్వ‌భావ‌మ‌ని, వాటిని స‌రిదిద్దుకోవ‌డ‌మే సంస్కార‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. 

మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఆవేశ‌కావేశాల‌కు వెళుతూ... ఒక్కోసారి మాట తూలుతుంటార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను తాను పొర‌పాటున దూషించాన‌ని ప‌ట్టాభి విచారం వ్య‌క్తం చేస్తే హూందాగా వుంటుంద‌నే అభిప్రాయాలు వ‌స్తున్నాయి.  

భువ‌నేశ్వ‌రికి వంశీ క్ష‌మాప‌ణ చెప్పిన త‌ర్వాత కూడా ప‌ట్టాభిలో ప‌శ్చాత్తాపం క‌ల‌గ‌క‌పోతే మాత్రం క్ష‌మార్హుడు కాద‌ని అంటున్నారు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ పెద్ద‌లు ఈ విష‌యంలో జోక్యం చేసుకుని ప‌ట్టాభితో క్ష‌మాప‌ణ చెప్పించాల్సిన బాధ్య‌త ఉంద‌నే వాళ్లే ఎక్కువ‌. 

ఆల‌స్యంగానైనా ప‌ట్టాభితో క్ష‌మాప‌ణ చెప్పించ‌డంతో పాటు మున్ముందు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.