సిటీ బస్సుల్లో సోషల్ డిస్టెన్సింగ్ సాధ్యమేనా!

సరిగ్గా ఇంకో వారం రోజులు.. 7 రోజుల్లో లాక్ డౌన్-4 ముగుస్తోంది. మరోసారి లాక్ డౌన్ పడే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ఇవ్వాల్సిన మినహాయింపులన్నీ దాదాపుగా ఇప్పటికే ఇచ్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బస్సులు కూడా తిరుగుతున్నాయి. అయితే హైదరాబాద్ లో సిటీ బస్సుల పరిస్థితేంటి? మరో వారం రోజుల్లో భాగ్యనగర రోడ్లపైకి సిటీ బస్సులు వస్తే సోషల్ డిస్టెన్సింగ్ సాధ్యమేనా? ఇదే ఇప్పుడు అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అసలే రెడ్ జోన్. తెలంగాణలో అత్యథిక కేసులు నమోదవుతున్న ప్రాంతం. కంటైన్మెంట్ జోన్లు ఎక్కువగా ఉన్న సిటీ. హైదరాబాద్ లో సిటీ బస్సుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫుడ్ బోర్డ్ కూడా కనిపించకుండా జానాలు ప్రయాణిస్తుంటారు. మహిళలు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో బస్సుల్లో వేలాడుతూ ప్రయాణాలు చేస్తుంటారు. నగరంలో ఏ మార్గంలో, ఏ సిటీ బస్సు చూసినా ఇదే పరిస్థితి. ఇలాంటి బస్సుల్లో సోషల్ డిస్టెన్సింగ్ ఎలా?

హైదరాబాద్ కు మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఎంఎంటీఎస్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా ఎక్కువే. ఇన్ని ఉన్నప్పటికి సిటీ బస్సులకు డిమాండ్ తగ్గలేదు. ప్రజలంతా సిటీబస్సుల్నే ఆశ్రయిస్తున్నారు. ప్రతి స్టాప్ లో, ప్రతి బస్సులో సగటున 10 మంది ఎక్కుతారు. ఇలాంటి బస్సుల్లో భౌతిక దూరం దాదాపు అసాధ్యం అంటున్నారు అధికారులు.

కోఠి, దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి, జేఎన్టీయూ, అమీర్ పేట్, హైటెక్ సిటీ, లక్డీకపూల్, చార్మినార్ మార్గాల్లో తిరిగే బస్సుల్లో ఉదయం 8 గంటల నుంచే రద్దీ ఉంటుంది. రాత్రి 9 గంటలైనా బస్సుల్లో ఆ రద్దీ తగ్గదు. ఇలాంటి రూట్లలో సీటు వదిలేసి కూర్చోమంటే సాధ్యమా? బస్సు నిండింది ఎక్కొద్దని చెబితే ప్రయాణికులు వింటారా?

ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిన్నట్నుంచి పరిమిత సంఖ్యలో నగరంలో సిటీ బస్సులు తిప్పుతున్నారు. ఉద్యోగులు తమ ఐడీ కార్డు చూపించి బస్సు ఎక్కాలి. ఎక్కిన తర్వాత కూడా భౌతిక దూరం పాటిస్తూ కూర్చోవాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన ఈ బస్సులే కిటకిటలాడుతూ కనిపించాయి. ఇక సామాన్య పౌరుల కోసం సిటీ బస్సులు ఓపెన్ చేస్తే పరిస్థితేంటనేది ఈజీగా అర్థంచేసుకోవచ్చు.

అసలే హైదరాబాద్ లో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఇంకా చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణ మొత్తం సేఫ్ జోన్ లోనే ఉంది. మరోవైపు గ్రేటర్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అంతెందుకు..నిన్న ఒక్క రోజే గ్రేటర్ లో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు (మొత్తం కేసులు 52) నమోదయ్యాయి. మొన్న ఏకంగా 42 కేసులు నమోదయ్యాయి.

ఓవైపు ఇలా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ.. నగరంలో సిటీ బస్సులు తిప్పితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వారం రోజుల్లో లాక్ డౌన్ ముగుస్తున్న వేళ.. హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను కొన్ని రోజుల పాటు అనుమతించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మద్యం దుకాణాలు తెరవడంలో చూపించిన అత్యుత్సాహాన్ని, సిటీ బస్సులు తిప్పడంలో కూడా చూపిస్తే కరోనా కేసులు రెట్టింపయ్యే ప్రమాదముంది.

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు

Show comments