బాబు విశాఖ టూర్ పై అంతా గప్ చుప్

తెలుగుదేశం నాయకుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విశాఖ వస్తున్నారు అన్న వార్త ఒక్కసారిగా హడావుడి సృష్టించింది. కరోనా లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఆయన హైదరాబాద్ దాటి రాలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా జవాబివ్వలేదు. లేఖలు రాసుకుంటూ కూర్చున్నారు. అలాంటిది విశాఖలో ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ నేపథ్యంలో ఆయన విశాఖకు ప్రత్యేక విమానంలో వస్తున్నారన్న వార్త కాస్త హఢావుడిని సృష్టించింది. 

కానీ సాయంత్రం అయినా ఈ విషయంలో అప్ డేట్ లేదు. పైగా విశాఖలో ఈ సమస్య సగానికి పైగా సద్దుమణిగింది. ప్రభుత్వం జాగ్రత్త చర్యలు, నివారణ చర్యలు, సహాయక చర్యలు మూడూ పద్దతిగా టేకప్ చేసింది. పైగా కోటి రూపాయల వంతున మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించి, జగన్ ప్రతిపక్షాలను నోరు ఎత్తకుండా చేసారు. ఇంక బాబుగారు రావాల్సిన అవసరం అయితే లేదు.

కానీ అసలు బాబు రాకుండానే సోషల్ మీడియాలో తేదేపా మద్దతుదారులు పాత ఫొటొలు వేసి, బయల్దేరిపోయారు, వచ్చేసారు అంటూ హడావుడి చేసేసారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే అస్సలు ఈ విషయమే పట్టించుకోలేదు. అసలు ఆ ప్రస్తావనే తెలియనట్లు మౌనంగా వుండిపోయింది.

అసలు విషయం ఏమిటంటే, కేంధ్రం చంద్రబాబు టూర్ కు అనుమతి ఇవ్వకపోవడమే అని తెలుస్తోంది. బాబు ఫోన్ చేస్తే చాలు కేంద్రం ఫోన్ ఎత్తితే దాన్నే అద్భుతమైన వార్తగా మలిచే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావాలనే ఈవిషయాన్ని పక్కన పెట్టింది. బాబుకు కేంద్రం నో అన్నది అన్నది తెలిస్తే, భాజపాతో ఇంకా బాబుగారి సంబంధాలు రిపేర్ కాలేదన్న విషయం బయటకు వెళ్లిపోతుంది.

ఆంధ్రకు కారులో వెళ్లడానికి నిజానికి ఇరు రాష్ట్రాలు అనుమతి ఇస్తే చాలు. బోలెడు మంది కార్పొరేట్ సంస్థలకు, బడా బాబులకు స్వంత విమానాలు హైదరాబాద్ లో వున్నాయి. కానీ బాబుగారు తెలంగాణ ప్లస్ ఆంధ్రలను సంప్రదించకుండా నేరుగా కేంద్రాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ముంబాయిలో వున్న విమానాన్ని హైదరాబాద్ రప్పించుకునేందుకు, అలాగే హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లేందుకు అనుమతి కావాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరినట్లు తెలుస్తోంది.

కానీ కేంద్రం ఈ విషయంలో మౌనం వహించినట్లు బోగట్టా. ఎందుకంటే రాష్ట్రాల వ్యవహారాల్లో కేంధ్రం ఎప్పుడూ అంత సులువుగా జోక్యం చేసుకోదు. పైగా నిబంధనల ప్రకారం ఆంధ్రకు వెళ్లాక చెకప్, ఐసోలేషన్, క్వారంటైన్ అంటే? అదో పెద్ద సమస్య. అలాగే హైదరాబాద్ ఇంటి నుంచి ఎయిర్ పోర్టుకు వచ్చాక ఇవే సమస్యలు. ఇవన్నీ దృష్టిలో వుంచుకునో, మరెందువల్లనో కేంద్రం నో రిప్లయ్ అని ఊరుకున్నట్లు బోగట్టా.

దీంతో బాబుగారు, ఆయన అనుకూల మీడియా కూడా గప్ చుప్ అయిపోయింది. అదే వచ్చి వుంటే ఇదే మీడియాలో  హడావుడి ఏ రేంజ్ లో వుండి వుండేదో ఊహించుకోవచ్చు. బాబుగారు మాత్రం విశాఖ పార్టీ ఎమ్మెల్యేతో టచ్ లో వున్నా, అలాగే కేంద్రానికి చర్యల మీద లేఖరాసా అంటూ ట్వీట్ లు వేసి ఊరుకున్నారు. నిజానికి ఆ లేఖ రాష్ట్రానికే రాయొచ్చుగా. ఆయన రాష్ట్రానికి ప్రతిపక్షనాయకుడిని అనుకుంటున్నారో? దేశానికి అనుకుంటున్నారో? చిన్న అనుమానం.

మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం

Show comments