దమ్ముగా చెబుతున్న మాట ప్రోగ్రెస్ రిపోర్ట్ !

తాను చేపట్టిన సంక్షేమ పథకాల మీద, పూర్తిగా తన ముద్ర ఉన్న ప్రజాహిత పథకాల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న విశ్వాసం అపారమైనది. ఎన్నికల పర్వం మొదలు కావడానికి ముందు నుంచి కూడా ఆయన చెబుతున్న రెండు అంశాలను మనం సీరియస్ గా పరిగణించాలి.

ఒకటి- నేను చేపట్టిన అభివృద్ధి పథకాల ఫలాలు మీ ఇంటి దాకా చేరి ఉంటే మాత్రమే మీరు నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయవద్దు అనేది. ఈ మాట చెప్పగల దమ్ము, ధైర్యం వర్తమాన రాజకీయ నాయకుల్లో దేశంలోనే మరెవ్వరికీ ఉంటుందని అనుకోవడం కష్టం. మేనిఫెస్టో విడుదల తర్వాత కూడా జగన్ ఇంచుమించుగా అదే మాటకు కట్టుబడ్డారు. నేను చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ‘నేను చేయగలను’ అనే విశ్వాసం ఉంటే మాత్రమే నాకు ఓటు వేయండి- అనే ప్రతిపాదనే ఆ 6 పేజీల మేనిఫెస్టోలో మనకు అంతర్లీనంగా కనిపిస్తుంది.

ఆయన చెప్పే రెండో సంగతి ఏంటంటే- చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశానని సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ఐదేళ్లు అవకాశం వచ్చినందుకే నేను ఇన్ని కొత్త పథకాలను తీసుకువచ్చి ప్రజా సంక్షేమం అంటే ఏమిటో నిరూపించాను. ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రి పూర్తిగా తన ముద్ర ఉన్న ఒక్క పథకమైనా ఉన్నదని చెప్పగలరా అలాంటిది ఉందా అనే ప్రశ్న కూడా జగన్ నుంచి తరచూ మనం వింటూ ఉంటాం. అలాంటి ప్రశ్నకు ఇప్పటిదాకా చంద్రబాబు నుంచి గాని, ఆయన తైనాతీల నుంచి గాని, తెలుగుదేశం పార్టీ వారి నుంచి గాని సమాధానం ఇప్పటిదాకా రాలేదు. వచ్చే అవకాశం కూడా లేదు.

ఈ రెండు మాటల తరహాలోనే తాజాగా ఎన్నికల ప్రచార సభల్లో జగన్మోహన్ రెడ్డి మరొక దమ్ముగల మాటను ప్రజల ఎదుటకు నివేదిస్తున్నారు. ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు పెడుతున్న మార్కులు మీరే వేయండి అనేది జగన్ మాటగా ఉంది.

తాను చేపడుతున్న పథకాల మీద ఆయనకు ఎంతటి అసంచలమైన విశ్వాసం ఉన్నదంటే.. ప్రజలు తాను చేసిన పనిని తూకం వేసి ఆదరించాలని కోరుకుంటున్నారు తప్ప, చేస్తానని చెబుతున్న మాయ మాటలను బట్టి తనకు విలువ ఇవ్వాలని ఆయన ఆశించడం లేదు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే మాట ప్రజలను ఆకట్టుకుంటున్నది. పోయిన ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో కాపీ తో సహా కొత్త మేనిఫెస్టో కాపీని ప్రజల ముందు పెట్టడం జగన్ మాత్రమే చేయగలిగినటువంటి పని.

తాను చెప్పిన ప్రతి మాటను చేతల్లో చేసి చూపించానని జగన్ అంటున్నారు. ఆమేరకు తన ముద్ర గల పథకాలను అన్నింటినీ ప్రజలకు నివేదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు అన్నీ కూడా జగన్ చేస్తున్న పథకాలకు కొనసాగింపుగా వేలం పాట లాగా రేటు పెంచి చేస్తున్న మాయ ప్రకటనలే అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి అంతిమంగా ఎన్నికల సమరాంగణంలో ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి.

Show comments