జీరో బడ్జెట్ సేద్యం కాదు.. 16వేల కోట్ల కుంభకోణం

పెరిగిపోతున్న ఎరువుల వాడకాన్ని నియంత్రిస్తానన్నారు. ప్రజల ఆయుష్షు పెంచుతానన్నారు. జీవన ప్రమాణ స్థాయి రెట్టింపు చేస్తానన్నారు. ఇవన్నీ జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యంతోనే సాధ్యం అని గొప్పలు చెప్పారు చంద్రబాబు. దీనికి సంబంధించి న్యూయార్క్ వెళ్లి మరీ ప్రసంగించారు. అయితే బాబు చేసిన ఈ పనివెనక ఓ పెద్ద కుంభకోణం దాగుందంటున్నారు ఉండవల్లి.

"జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కోసం 16వేల 6వందల కోట్ల రూపాయలకు చంద్రబాబు ఎంవోయూ చేసుకున్నారు. ఇది ఎలా ఉందంటే, ఉచిత విద్య అందిస్తామని చెప్పి స్టూడెంట్ నుంచి 10వేల రూపాయలు వసూలు చేసినట్టు ఉంది. ఆవు పేడ, మూత్రంతో జీరో బడ్జెట్ వ్యవసాయం చేయొచ్చు. 30 ఎకరాలకు ఒక ఆవు చాలు. పాలేకర్ స్వయంగా చెప్పిన మాటలివి."

అలా ఖర్చు లేకుండా చేసే వ్యవసాయానికి 16వేల 600కోట్ల రూపాయల ఎంవోయూ ఎందుకు చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఉండవల్లి. పైగా న్యూయార్క్ లో చంద్రబాబు చెప్పిన 12వేల ఎకరాల్లో ప్రకృతి సేద్యం అనేది ఏపీలో ఎక్కడా లేదని, కొన్ని చోట్ల జరుగుతున్న ఆ తరహా సేద్యాన్ని రైతులే సొంతంగా చేసుకుంటున్నారని అన్నారు ఉండవల్లి. అలాంటి కొన్ని వ్యవసాయ క్షేత్రాల్ని స్వయంగా వెళ్లి పరిశీలించానని చెప్పుకొచ్చారు.

"ఐదేళ్లలో జీరో బడ్జెట్ కింద రాష్ట్రం మొత్తం వ్యవసాయభూమిని ప్రకృతి సేద్యం కింద మార్చేస్తానని బాబు అంటున్నారు. బాగానే ఉంది. కానీ దాని కోసం 16,600 కోట్లరూపాయల ఎంవోయూ ఎందుకు చేసుకున్నారు. న్యూయార్క్ లో రోడ్డుపై నడిచిన ఫొటోల్ని కూడా పబ్లిసిటీకి వాడుకున్న మీరు, వేల కోట్ల రూపాయల ఎంవోయూను ఎందుకు బయటపెట్టలేదు."

చిన్నాచితక సంస్థలు వచ్చి రాష్ట్రంలో కంపెనీలు పెడతామంటే, వాళ్లతో ఎంవోయూ చేసుకొని గొప్పగా పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు, ఈ డీల్ ను ఎందుకు దాస్తున్నారో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. పైగా ఈ ఎంవోయూ కోసం అప్పటికప్పుడు ఓ సంస్థ క్రియేట్ అయిందని, ఓ విదేశీ బ్యాంక్ కూడా రంగంలోకి దిగిందని ఆరోపించారు.

"SIF అనే కంపెనీ ఈ అగ్రిమెంట్ చేసుకుంది. సిఫ్ అంటే సస్టెయినబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ అనే సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఈ ఎంవోయూ చేసుకుంది. వాళ్లు మరో విదేశీ బ్యాంక్ తో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఈ 16వేల కోట్లతో రాష్ట్రంలో ఏదో మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ విషయాల్ని సీక్రెట్ గా ఎందుకు ఉంచుతున్నారు."

ఇలా జీరో బడ్జెట్ ప్రకృతిసేద్యం గుట్టును రట్టుచేశారు ఉండవల్లి. ఇదే విషయంపై చంద్రబాబును సంప్రదించడానికి ప్రయత్నిస్తే, తన కాల్స్ కట్ చేస్తున్నారని తెలిపిన ఉండవల్లి.. ఎన్నికలకు ముందు హుటాహుటిన ఈ ఎంవోయూ ఎందుకు చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బెంగళూరుకు చెందిన ఓ స్వచ్ఛంధ సంస్థ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకొని ఈ వివరాల్ని రాబట్టింది. స్వయంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరాల ఆధారంగా 40 పేజీల నివేదికను అది తయారుచేసింది. ప్రకృతి సేద్యంపై రైతులకు అవగాహన కల్పిస్తే సరిపోతుంది.

కనీస మొత్తానికి దేశవాళీ ఆవులు, డ్రమ్ములు లాంటివి అందిస్తే సరిపోతుంది. అలాంటి దానికోసం ఓ కంపెనీతో 16,600 కోట్ల రూపాయలకు చంద్రబాబు రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
 

Show comments