హీరోయిన్ పై గాసిప్స్ ప్రచారం చేస్తున్న మేనేజర్!

అప్పుడెప్పుడో సల్మాన్ ఖాన్ వీర్ సినిమాతో పరిచయం అయిన జరీన్ ఖాన్ తన మాజీ మేనేజర్ మీద పోలిస్ కేసు పెట్టింది. అంజలి అనే తన మాజీ మేనేజర్ తన విషయంలో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని, తన గురించి గాసిప్స్ ను క్రియేట్ చేసి ప్రచారం చేస్తోందని జరీన్ అంటోంది. ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేసింది. అంతేకాదట ఇప్పుడు కూడా తన తరఫున ఆమె నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు ఇప్పించుకుంటోందని కూడా జరీన్ తన ఫిర్యాదులో పేర్కొంది.

అంజలి అనే ఆ మేనేజర్ కొంతకాలం కిందట తనదగ్గర పనిచేయడం మానేసిందని, అయితే ఇప్పుడు కూడా ఆమె పాత నేపథ్యాన్ని ఉపయోగించుకుని.. తన పేరు చెప్పి అడ్వాన్స్ లు తీసుకుంటోందని జరీన్ వాపోతోంది. తనపై లేనిపోని గాసిప్ లు ప్రచారం చేస్తుండటం పట్ల జరీన్ ఆవేదన వ్యక్తంచేసింది.

తన వ్యక్తిత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని అంజలి మీద జరీన్ మండి పడుతోంది. అంజలి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. జరీన్ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద అంజలి మీద కేసులు నమోదు చేసినట్టుగా సమాచారం.

Show comments