వైఎస్సార్సీపీకి రామచంద్రయ్యతో ఆ ఉపయోగం!

రామచంద్రయ్య మాస్‌ లీడర్‌ కాదు. ఎప్పుడో దశాబ్దాల కిందట ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత నామినేటెడ్‌ పదవులతోనే సంతృప్తి పడుతూ వచ్చాడు. ఎన్టీఆర్‌ హయాం నుంచి రాజకీయంలో ఉన్నాడు. చంద్రబాబు చేత రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయ్యాడు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం వెళ్లినప్పుడు అటు వెళ్లాడు. విలీనం ప్యాకేజీలో భాగంగా రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇదీ ఆయన నేపథ్యం.

గమనించాల్సిన అంశాలు ఏమిటంటే.. రామచంద్రయ్య మాస్‌ లీడర్‌ కాకపోయినా, భారీగా ఆర్థిక సంపన్నుడు కాకపోయినా.. చంద్రబాబు లాంటి వ్యక్తి ఆయనను రెండుసార్లు రాజ్యసభకు నామినేట్‌ చేశాడు. రాజ్యసభ సీట్ల విషయంలో చంద్రబాబు ఎలాంటి వాళ్లకు ప్రాధాన్యతను ఇస్తాడో అందరికీ తెలిసిందే. అయినా రామచంద్రయ్యకు అవకాశం లభించింది. దీనికి కారణం.. ఆయన పార్టీకి ఏదోరకంగా ఉపయోగపతాడు అని చంద్రబాబు భావించడమే.

రామచంద్రయ్యకు భారీ స్థాయిలో ప్రజాబలం లేకపోవచ్చు గాక.. కానీ.. చక్కగా మాట్లాడగలడు. పద్ధతిగా సమాధానం ఇవ్వగలడు. ఏదైనా సబ్జెక్ట్‌ మీద ప్రసంగించగలడు. మీడియా సమావేశాలకు చక్కగా సెట్‌ అవుతాడు. వైసీపీలో ఈ తరహా నేతల అవసరం ఎంతైనా ఉంది. ఏ రాజకీయ అంశం మీద అయినా రామచంద్రయ్య పార్టీ తరఫున వాయిస్‌ వినిపించడానికి కచ్చితంగా ప్లస్‌ పాయింటే అవుతాడు.

మొన్నటివరకూ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు కూడా రామచంద్రయ్య ఖాళీగా కూర్చోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని తేటతెల్లం అయ్యాకా కూడా.. తనవంతుగా బాబు విధానాలను దుయ్యబడుతూ వచ్చాడు. పత్రికలకు వ్యాసాలు.. వీలైనన్ని ప్రెస్‌మీట్లు.. ఎలా ఎలాగో తన ఉనికిని చాటుతూ వచ్చాడు. కాంగ్రెస్‌ పార్టీలో మిగిలిన నేతగా గుర్తింపు పొందాడు.

ఈ రకమైన నైపుణ్యాన్ని, అనుభవాన్ని కలిగి ఉన్న రామచంద్రయ్యను పార్టీలోకి తీసుకుని జగన్‌ మంచి పనేచేశాడు. కడపజిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏనాడూ బలంగా లేదు కాబట్టి.. రామచంద్రయ్య ఆ పార్టీ తరఫున రాణించలేపోయాడు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. రామచంద్రయ్యకు నామినేటెడ్‌ పదవిని ఇవ్వడానికి కూడా జగన్‌ అంగీకారం తెలిపాడని సమాచారం.

కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments