వైఎస్సార్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌: బాబూ.. ఏం సెప్తిరి.!

బెస్ట్‌ ఫ్రెండ్‌ని ఎవరైనా తిట్టగలరా.? చంద్రబాబు తిట్టగలరు. ఏమన్నా అంటే, అది రాజకీయం అంటారాయన.! 'మేమిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌..' అంటూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో ఒకప్పటి స్నేహాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సాక్షిగా తలచుకున్నారు. ఇలాంటి ఒకరోజు వస్తుందని బహుశా తాను జీవించి వున్నప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఊహించి వుండరేమో. ఎందుకంటే, చంద్రబాబుకి 'సాయం, స్నేహం' గుర్తుపెట్టుకోవడం చేతకాదు కదా.!

చాలా సందర్భాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబుతో తనకున్న స్నేహం గురించి చెప్పడం చూశాం. రాజకీయాలన్నాక విమర్శలు తప్పవు. ఇద్దరూ చెరో పార్టీలో వున్నారు గనుక, రాజకీయ ప్రత్యర్థులయ్యారు గనుక.. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం మామూలే. కానీ, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం కూడా ఆయనపై విమర్శలు చేస్తూనే వచ్చారు చంద్రబాబు. ఇంకా ఆ విమర్శల ధాటి కొనసాగుతూనే వుంది. 
అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు, చంద్రబాబు తెలివిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాల ప్రస్తావన తీసుకొచ్చారు.

ఓ ముఖ్యమంత్రి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిన ఓ భవనంలో వుండడమే తప్పు. కానీ, చంద్రబాబుకి అది తప్పని అనిపించడంలేదు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంటే, చిత్ర విచిత్రంగా చంద్రబాబు, వైఎస్‌ విగ్రహాల పేరు ప్రస్తావించారు.

'వైఎస్‌ విగ్రహాల మీద అంత అసూయా.?' అని వైసీపీ ప్రశ్నిస్తే, 'నాకెందుకు అక్కసు.? ఆయన నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌.. మీకు తెలుసో లేదో..' అంటూ జగన్‌ని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నవ్వుల పాలవుతున్నాయిప్పుడు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపైనే కాదు, ఆయన తండ్రి మీదా చంద్రబాబు గడచిన పదిహేనేళ్ళుగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూనే వున్నారాయన. అలాంటి చంద్రబాబుకి, వైఎస్‌తో ఒకప్పటి స్నేహం గుర్తుకొచ్చిందంటే.. ఆశ్చర్యకరమైన విషయమే మరి.

బహుశా ఇటీవలి ఎన్నికల్లో తగిలిన ఘోరమైన దెబ్బతో చంద్రబాబు ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చి వుండాలి.. అలా గతం గుర్తుకొచ్చి, వైఎస్‌తో స్నేహాన్ని తలచుకున్నారేమో.! అయినా, చంద్రబాబు అంత తొందరగా ఎలా మారిపోతారు.? మారిపోతే ఆయన చంద్రబాబు ఎలా అవుతారు.? ఇప్పటికి, ఇలా తప్పించుకోవాలి గనుక.. వైఎస్‌తో స్నేహాన్ని చంద్రబాబు ప్రస్తావించారన్నమాట.

బ్యూటిఫుల్ హీరోయిన్ తో క్యూట్ యాంకర్ ఇంటర్వ్యూ

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి

Show comments