వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యే..

ముందుగా గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చినా, ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి మరణం విషయంలో హత్యకోణం తెరమీదకు వస్తోంది.  వివేకానందరెడ్డి ది హత్యేనని పోస్టు మార్టం రిపోర్టులో ప్రాథమికంగా ధ్రువీకరణ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. వివేకానందరెడ్డి శరీరంపై కత్తితో పొడిచిన దాఖలాలు ఉన్నాయనే మాట వినిపిస్తూ ఉంది.

వివేకానందరెడ్డి మరణించిన పరిస్థితులను గమనిస్తే గుండెపోటు  అని ఎవ్వరూ అనుకోలేదు. ఎంత హఠాత్తుగా గుండెపోటు వచ్చినా మరీ అంతలా రక్తపు మడుగులో మరణించకపోవచ్చు ఏ వ్యక్తి కూడా. అందుకు సంబంధించిన ఫొటోలే ఏదో జరిగిందనే భావనను కలిగించాయి.

ఇలాంటి నేపథ్యంలో పోస్టు మార్టం నివేదిక ద్వారా ప్రాథమికంగా ఇదే తేలినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా ఏదీ రాలేదు. వివేకానందరెడ్డిని జమ్మలమడుగు ఇన్ చార్జిగా నియమించారు జగన్ మోహన్ రెడ్డి. సుధీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాకా.. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక్కో మండలం బాధ్యతను ఒక్కోరికి అప్పగించారు జగన్. 

అసలే హత్యారాజకీయాలకు కేరాఫ్ అయ్యింది జమ్మలమడుగు రాజకీయం. ఇలాంటి నేపథ్యంలో సుధీర్ రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి మరణించడం అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. వివేకానందరెడ్డికి ప్రాణభయం ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ఆయన ఒంటరిగా ఇంట్లో ఉండే పరిస్థితి ఉందంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. 

జగన్ పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా… వివేకానందరెడ్డే అక్కడ అన్ని వ్యవహారాలనూ సమీక్షిస్తూ ఉంటారు. పులివెందుల్లో అయినా, కడప జిల్లాలో అయినా.. వివేకానందరెడ్డి ప్రచారం విషయంలో ముందుంటారు. జిల్లా వ్యాప్తంగా పరిచయాలు, ప్రచారం చేయగల సత్తా ఉన్న మనిషిని భౌతికంగా దెబ్బ తీసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం కూడా జరిగి ఉండవచ్చునేమో!

Show comments