వైజాగ్ కి జగన్...ఎందుకంటే... ?

జగన్ కి విశాఖ ఇష్టమన్నది తెలిసిందే. అది ఆయన ఎక్కడా మనసులో ఉంచుకోలేదు. విశాఖనే ఏపీకి రాజధానిగా చేసి ఉంటే ఈ పాటికి పొరుగు రాష్ట్రాలతో పోటీ పడే సీన్ ఉండేదని కూడా అసెంబ్లీలోనే ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. 

విశాఖ రెడీ మేడ్ రాజధాని అని కూడా ఆయన ఇప్పటికే  కితాబు ఇచ్చారు. విశాఖను పాలనారాజధానిగా చేస్తున్నట్లుగా ప్రకటించారు. మూడు రాజధానుల మీద చట్టాన్ని చేశారు. ఇదిలా ఉంటే మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన తరువాత జగన్ తొలిసారిగా విశాఖ వస్తున్నారు.

జగన్ ఈ నెల 17న విశాఖ పర్యటన చేపట్టబోతున్నట్లుగా అధికార వర్గాల సమాచారం. షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కావాల్సి ఉంది, చివరి నిముషంలో మార్పులు లేకపోతే ఆయన విశాఖ రావడం మాత్రం తధ్యమని అంటున్నారు.

విశాఖలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అదే సమయంలో ఆయన విశాఖలో ఒక బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. మరి విశాఖ రాజధాని గురించి ఆయన ఈ సభలో ఏం చెబుతారు అన్న ఆసక్తి కూడా అందరిలో ఉంది.

మొత్తానికి జగన్ చాలా కాలానికి విశాఖ వస్తున్నారు. అది కూడా భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు విశాఖ భవిష్యత్తు మీద కూడా కొత్త ఆశలను కల్పించనున్నారు.

జగన్ పర్యటనకు సంబంధించి అధికారిక వర్గాలు మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్రాకు చెందిన మంత్రులతో విశాఖ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున జగన్ టూర్ లో పాల్గొనబోతున్నరు. మొత్తానికి జగన్ విశాఖ టూర్ అంటే అటు అధికార పక్షంతో పాటు ఇటు విపక్షం, మరో వైపు నగర వాసులు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది.

Show comments