జగన్ రిలాక్సేషన్.. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్!

పోలింగ్ ముగిసిన తర్వాత మళ్లీ మీడియా ముందుకు కూడా పెద్దగా రాలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అంబేద్కర్ కు నివాళి ఘటించే కార్యక్రమం ఒకటీ చేపట్టారు. ఇక మీడియాతో కూడా పెద్దగా మాట్లాడలేదు. పోలింగ్ ముగిసిన తర్వాత 'గెలుస్తాం.. ఇక అంతా దేవుడి దయ..' అనేసి  వెళ్లిపోయారాయాన. 

పోలింగ్ కు ముందు జగన్ బ్రహ్మాండంగా కష్టపడ్డారు. బహుశా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవ్వరూ పడనంత స్థాయిలో కష్టపడ్డారాయన. సుదీర్ఘ పాదయాత్రతో దాదాపు ఏడాది కన్నా ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడిపారు. ఎండకూ, వానకూ, గాలికి జగన్ పాదయాత్ర కొనసాగింది. ఇక పాదయాత్ర అలా ముగుస్తున్నంతలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 

పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా ఏదో ఒక కార్యక్రమంతో జనం మధ్యనే ఉండిన జగన్.. నెలరోజుల ఎన్నికల ప్రచారంలోనూ కష్టపడ్డారు. ప్రచార పర్వం ముగిసేవరకూ మండుటెండలోనే జగన్ కష్టపడ్డారు. మరి అలా కష్టపడటం వల్లనేమో జగన్ కు విజయం మీద నమ్మకం కలిగినట్టుగా ఉంది. అందుకే జగన్ కూల్ గా కనిపిస్తూ ఉన్నారు.

ఇక చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ మాత్రం పీక్స్ కు వెళ్లిపోయింది. పోలింగ్ పూర్తి అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఎంత అసహనంతో రగిలిపోతున్నారో అర్థం చేసుకోవడం కష్టం ఏమీకాదు. ఇప్పటివరకూ అరడజను ప్రెస్ మీట్లు పెట్టినట్టుగా ఉన్నారు. అన్నింటా ఒకటే మాటలు. చెప్పిందే చెప్పి.. తన అసహనాన్ని అంతా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు.

ఇంతచేసినా బాబు ఇప్పుడు చేయగలిగింది ఏమీలేదు. అన్నీపోయి ఇప్పుడు వీవీ ప్యాట్ లను యాభైశాతం వరకూ లెక్కించాలనే దగ్గర ఆగారు. ఆల్రెడీ దానిపై సుప్రీంకోర్టు స్థాయిలో వాదనలు జరిగాయి. ర్యాండమ్ గా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ లను లెక్కించాలని కోర్టు అర్థవంతమైన తీర్పునే ఇచ్చింది. 

అయితే చంద్రబాబు మాత్రం మళ్లీ యాభైశాతం అంటూ మంకు పట్టుపడుతూ ఉన్నారు. బహుశా ఇలా మీడియా ముందు ఎంత గలాభా చేసినా చంద్రబాబుకు అనుకూల మీడియా లో కవరేజ్ వస్తుందే తప్ప.. ఆయన వినిపిస్తున్న అర్థ రహిత వాదనను ఎవరూ పెద్దగా సమర్థించేలా లేరు!

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది

Show comments