వైఎస్‌ జగన్‌పై ఎటాక్‌: బీజేపీకి పోల'వరం' అయ్యేనా.!

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏమనుకున్నా, తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముందడుగు వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏటీఎంగా మార్చుకున్నట్లు గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం విదితమే. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి నుంచి వైసీపీ వాదన కూడా ఇలానే సాగింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఆ అవినీతి మకిలిని వదిలించడానికి, రివర్స్‌ టెండరింగ్‌ ప్రాసెస్‌ని చేపట్టిన విషయం విదితమే. 

ఇక్కడే, బీజేపీకి కోపమొచ్చింది. 'ఏదో రాజకీయ విమర్శలు చేస్తాంగానీ.. రివర్స్‌ టెండరింగ్‌కి ఒప్పుకుంటామా.?' అంటూ గుస్సా అవుతోంది బీజేపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వమ్మీద. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ తాజాగా ఈ రివర్స్‌ టెండరింగ్‌ వ్యవహారంపై వాస్తవ పరిస్థితిని నివేదిక రూపంలో అందించాలంటూ పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీని ఆదేశించారు. ఇప్పటికే, రివర్స్‌ టెండరింగ్‌ కారణంగా పోలవరం ప్రాజెక్టుపై అదనపు ఆర్థిక భారం పడుతుందనీ, పనులు కూడా ఆలస్యమవుతాయని కేంద్రం గగ్గోలు పెడుతున్న విషయం విదితమే. 

చంద్రబాబు పాలన.. అంటే, అందులో నాలుగేళ్ళ పాలన బీజేపీ - టీడీపీ 'స్నేహం' నేపథ్యంలో సాగిందే. దాంతో, టీడీపీ అవినీతి.. అంటే, అందులో ఖచ్చితంగా బీజేపీ కూడా వాటా తీసుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు మాయమాటలకి అప్పట్లో బీజేపీ గుడ్డిగా తల ఊపినందుకు.. ఇప్పుడు 'ఖర్మ' అనుభవించాల్సి రావొచ్చు. అదే భయంతోనే, కేంద్రంలోని మోడీ సర్కార్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ప్రయత్నాలకు మోకాలడ్డుతోందని అనుకోవచ్చు. 

పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలోనే కాదు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల విషయంలోనూ కేంద్రం, వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మోకాలడ్డే ప్రయత్నం చేసింది. అయినా, కేంద్రాన్ని వైఎస్‌ జగన్‌ లెక్క చేయడంలేదాయె. మరి, పోలవరం పేరు చెప్పి, జగన్‌ విషయంలో కేంద్రం ఎలాంటి 'ఎటాక్‌' చేయబోతోంది.? దాన్ని జగన్‌ ఎలా నిలువరించగలుగుతారు.? అన్నది వేచి చూడాల్సిందే. మొత్తమ్మీద బీజేపీ - వైసీపీల మధ్య ఈ 'మంట'లో చంద్రబాబు చలి కాచుకోవడానికి అవకాశమైతే దొరికిందన్నది నిర్వివాదాంశం. 

Show comments