వాళ్ళది రాజకీయం.. మాది సంక్షేమం: వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మీడియంని రద్దు చేసి, ఇంగ్లీషు మీడియంని అమల్లోకి తెస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వెల్లువెత్తడం సహజమే. అయితే, ఆ అభ్యంతరాల మాటున రాజకీయం.. మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన తెరపైకి తెస్తోన్న మత రాజకీయంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆచి తూచి స్పందించారు. పరోక్షంగానే విపక్షాలకు చురకలంటించారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా వైఎస్‌ జగన్‌, ఇంగ్లీషు మీడియం అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంపై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని తేల్చి చెప్పేశారు. 'ఇంగ్లీషు మీడియంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవారు తమ పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలని ప్రజలే వారిని నిలదీయాలి' అంటూ ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు వైఎస్‌ జగన్‌.

'వారిది రాజకీయం.. మాది సంక్షేమం.. ఎవరేమనుకున్నాసరే, దేవుడి దయతో ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతోనే ముందడుగు వేస్తున్నాం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అతి తక్కువ సమయంలోనే పూర్తిగా నిలబెట్టుకునే దిశగా పనిచేస్తున్నాం.. విపక్షాల విమర్శల్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..' అని వైఎస్‌ జగన్‌, తూర్పుగోదావరి జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు.

మత్సకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం పెంపు, కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం.. ఇలా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రోజు వైఎస్‌ జగన్‌ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రారంభించిన విషయం విదితమే.

Show comments