ఆ ప్రశ్నలను బాబుకే వేయండి: వైఎస్ జగన్

'గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గింది ఈవీఎంలతో జరిగిన ఎన్నికలతోనే. అప్పుడు కనీసం వీవీ ప్యాట్స్ కూడా లేదు. మనం వేసిన ఓటు ఎవరికి పడిందో క్లియర్ గా తెలుసుకోవడానికి అప్పుడు అవకాశం లేదు. ఈ సారి కనీసం వీవీ ప్యాట్స్ అయినా ఉన్నాయి. ఎవరికి ఓటు వేశామో  ఎవరికి వారే తెలుసుకున్నాం. 

తేడా వస్తే అక్కడే అడగడానికి అవకాశం ఉంది. అయినా చంద్రబాబు నాయుడు ఎందుకు యాగీ చేస్తున్నారు?  తను గెలిస్తే అంతా సక్రమంగా జరిగినట్టు, ఓడిపోతే అక్రమం జరిగినట్టు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. గత ఎన్నికల్లోనూ, నంద్యాల ఉప ఎన్నికలప్పుడు బాగా పని చేసిన ఈవీఎంలు ఇప్పుడు బాబుకు చెడ్డవి అయిపోయాయా?' అని ప్రశ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.

పోలింగ్ అనంతరం జరిగిన, జరుగుతున్న హింస గురించి గవర్నర్ నరసింహన్ కు విన్నవించిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. పోలింగ్ రోజున పేట్రేగిన హింస గురించి తాము గవర్నర్ కు ఫిర్యాదు చేశామని జగన్ అన్నారు. 

కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్ లోకి దూరి, తలుపులు వేసుకుని, చొక్కా చించుకుని రాద్ధాంతం చేశారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద కూడా పలు చోట్ల దాడులు జరిగాయని జగన్ అన్నారు. ఆ విషయంలో కేసులు నమోదు చేయడం లేదని, ఒకే కులానికి చెందిన వారికి ప్రమోషన్లు ఇచ్చి.. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో వారిని ఉపయోగించుకున్నారని జగన్ అన్నారు.

ఈవీఎంల విషయంలో అంతా పారదర్శకంగానే జరిగిందని, మాక్ పోలింగ్ రూపంలో యాభై ఓట్లను పోల్ చేసిన తర్వాత.. అక్కడున్న అన్ని పార్టీల ఏజెంట్లూ సంతకాలు చేశాకే.. పోలింగ్ మొదలైందని, ఈ ప్రాథమిక విషయాలను కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేస్తున్నారని జగన్ అన్నారు.  

కేవలం ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద నెపాన్ని నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ‘మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి అవుతాయి, ఓటమి తప్పదన్నప్పుడు అవి చెడ్డవి అవుతాయా?’ అనే ప్రశ్నను చంద్రబాబునే అడగాలని జగన్ విలేకరులను ఉద్దేశించి అన్నారు.

Show comments