ఊహించని విధంగా జగన్ కేబినెట్ కూర్పు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ కూర్పు ఊహలకు అందని విధంగా ఉంది. కేబినెట్ కూర్పు విషయంలో ఇంతకు ముందు రకరకాల వార్తలు రాగా.. వాటన్నింటికీ భిన్నంగా కేబినెట్ కు రూపకల్పన చేశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఐదుమంది డిప్యూటీ సీఎంలు అంటూ తొలి ఆశ్చర్యాన్ని కలిగించిన జగన్ మోహన్ రెడ్డి, ఒకేసారి పాతికమంది ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకున్నారు. కుల సమీకరణాలు, ప్రాంతాల సమీకరణాల విషయంలో కూడా జగన్ కేబినెట్ కూర్పు విభిన్నంగా సాగింది. ఇది వరకటి అందరి సీఎంల కన్నా అత్యంత  భిన్నంగా ఉంది జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ కూర్పు.

కేబినెట్లో సగానికి మించిన స్థాయిలో పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు జగన్ మోహన్ రెడ్డి. అత్యధిక ఎమ్మెల్యేలున్నప్పటికీ రెడ్డి సామాజికవర్గానికి కేవలం నాలుగు మంత్రి పదవులనే కేటాయించారు. కాపులకు పెద్ద పీట వేస్తూ నాలుగు మంత్రి పదవులను కేటాయించారు. ప్రాంతాల వారీగా కూడా కొన్ని జిల్లాలకు తక్కువ ప్రాధాన్యం దక్కింది. ఒక్కో లోక్ సభ సీటు పరిధిలో ఒక్కో ఎమ్మెల్యేకు మంత్రిపదవి దక్కుతుందనే ఊహాగానం కేబినెట్ సమీకరణంలో అగుపించలేదు.

జగన్ కేబినెట్లో మంత్రి పదవులు ఖరారు అయిన వారి జాబితా ఇలా ఉంది..
ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి,  తానేటి వనిత, మేకతోటి సుచరిత,  మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, నారాయణస్వామి, అంజాద్ బాషా, శంకర్నారాయణ, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస రెడ్డి.