వైసీపీని దారుణంగా దెబ్బకొట్టిన బీజేపీ

కర్నాటకలో మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఐదు లోక్‌సభ నియోజకవర్గాలకు మాత్రం ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఎందుకట.! ఈ ప్రశ్నకు ఎన్నికల కమిషన్‌ తాజాగా ఇచ్చిన వివరణ ఏంటంటే, 'ఏడాదికి మించి గడువు' లేకపోవడంతోనే, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని. మే నెలలోనే, కర్నాటకకు సంబంధించిన మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. జూన్‌ 2న ఐదు స్థానాలు ఖాళీ అయ్యాయి.

ప్రత్యేకహోదా కోసమంటూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామ చేశారు. కానీ, ఆ రాజీనామాలకు ఆమోదం మాత్రం చాలా లేటుగా లభించింది. స్పీకర్‌ తన విచక్షణ మేరకు, ఎంపీల రాజీనామాలపై ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఎవరి 'విచక్షణ' మేరకు పనిచేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసెంబ్లీ స్పీకర్‌ అయినా, లోక్‌సభ స్పీకర్‌ అయినా, అధికార పార్టీలకు చెందినవారే. దాంతో, అధికార పార్టీ ఎలా నిర్ణయిస్తే.. సభాపతుల నిర్ణయం అలా వుంటుంది.

అలా అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ, వైఎస్సార్సీపీని దెబ్బకొట్టింది. తమ రాజీనామాల్ని ఆమోదించాలంటూ పదే పదే లోక్‌సభ స్పీకర్‌కి వైసీపీ ఎంపీలు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. సరిగ్గా టైమ్‌ చూసి, ఇప్పుడు రాజీనామాల్ని ఆమోదిస్తే.. ఉప ఎన్నికలు రావనే నిర్ణయానికి వచ్చి.. అప్పుడు రాజీనామాలకు ఆమోదం లభించేలా బీజేపీ వ్యూహం రచించి, అమలు చేసింది. లేకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి.

'చంద్రబాబుతో మా స్నేహం ఎప్పటికీ కొనసాగుతుంది..' అంటూ సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే. ఆ స్నేహమే, వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదానికి కారణమా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే కదా మరి.! ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగి వుంటే.. ఇక్కడ, రాజకీయ సమీకరణాలు ఎలా మారేవో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేశారు గనుక, బంపర్‌ మెజార్టీతో మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. అది అధికార తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే అయి వుండేది. ఒకవేళ టీడీపీ, భయపడి ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దృష్టిలో దోషిగా నిలబడి.. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో కనుమరుగయ్యేదే.

ఆ ప్రమాదం నుంచి భయపడేందుకు, మిత్రుడు చంద్రబాబుని రక్షించేందుకే.. ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసినా, ఉప ఎన్నికలు రాకుండా కేంద్రంలోని మోడీ సర్కార్‌ వ్యూహ రచన చేసిందన్నమాట.

జరిగిన కథ ఇది. కానీ, టీడీపీ నేతలు బీజేపీ - వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నాయి. ఇంతకన్నా దివాళాకోరుతనం ఏ రాజకీయ పార్టీకైనా వుంటుందా.?

Show comments