వరద రాజకీయం... వైసీపీకి గుణపాఠం

ఒక పని ఎంత బాగా చేశామన్న దానితోపాటు.. ఎంత సమర్థంగా చెప్పగలిగాం అన్నది కూడా ముఖ్యమే. ఏపీ వరదల్లో వైసీపీ ప్రభుత్వం సమర్థంగా నష్ట నివారణ చర్యలు చేపట్టినా.. ప్రచారంలో విఫలమైంది. దీంతో తెలుగుదేశం ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది. వరద నిర్వహణలో వైసీపీ విఫలమైందని, అందుకే పంటలు నీటమునిగాయని, బాధితుల్ని ఎవరూ ఆదుకోలేదని రాద్ధాంతం చేస్తోంది. అక్కడితో ఆగకుండా వరద రాజకీయాన్ని రాయలసీమకి కూడా తీసుకెళ్లింది.

సీమ ప్రాజెక్ట్ లకు నీరివ్వడంలో ఆలస్యం చేశారని అందుకే వరదనీరంతా సముద్రంపాలవుతోందని మరో దుష్ప్రచారం మొదలుపెట్టారు. కృష్ణా వరదల్ని తనకు పూర్తి అనుకూలంగా మార్చుకుని అటు ముంపు జిల్లాల్లో.. ఇటు సీమ జిల్లాల్లో కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించింది టీడీపీ. ఇక టీడీపీ అనుకూల మీడియా కూడా అగ్నికి ఆజ్యం పోస్తోంది, సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్ట్ ల గోల అంతా ఇంతా కాదు. పోనీ టీడీపీది రాద్ధాంతమే అనుకుందాం.

మరి వైసీపీ ఏం చేస్తున్నట్టు. కేవలం వారు చేసేది తప్పు అంటూ అవే వీడియోలను పోస్ట్ చేస్తూ కూర్చుంటే జనం నమ్మేదెలా. కనీసం వరదసాయం అందింది అంటూ సామాన్యులు ఒక్కరైనా మీడియాతో మాట్లాడే సందర్భాన్ని చూపించగలిగారా. పోనీ పచ్చ బ్యాచ్ ని వదిలేసినా తన సొంత మీడియాతో అయినా వైసీపీ ఈ పని చేయించుకోగలిగిందా. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో వరదలు వస్తే సహాయక చర్యలు చేపట్టడంలో హడావిడి పడ్డారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రాణ నష్టం పూర్తిగా నివారించగలిగారు, ఆస్తినష్టాన్ని తగ్గించగలిగారు, పునరావాసం చూపించే విషయంలో కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించారు.

అంతా బాగానే ఉంది కానీ.. వరద ప్రాంతాల జనం బాగోగుల్ని మిగతా ప్రపంచానికి చూపించే విషయంలోనే వైసీపీ నేతలు వెనకపడ్డారు. ఈ వరద రాజకీయం వైసీపీ వారికి ఓ కనువిప్పు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వచ్చిన వరద ముప్పు భవిష్యత్ లో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపై ఆపార్టీ నేతలకు పూర్తి స్పష్టతనిచ్చింది. ప్రజలకు మేలు చేయడంతోపాటు, ప్రతిపక్షాల విమర్శలు కాచుకోవడం ఎలాగో తెలియజేసింది.

ఇకనైనా వైసీపీ నేతలు ప్రచారానికున్న విలువ ఏంటో తెలుసుకోవాలి. దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలో అలవాటు చేసుకోవాలి. 

ముడుపులకు ఆశపడితే మూడినట్టే!

Show comments