ఒలింపిక్స్‌కీ క్రికెట్‌కీ అదే తేడా.!

ప్రపంచంలో చాలా దేశాలు ఒలింపిక్స్‌ కోసం ఎంతో ఉత్కంఠగా, ఉత్సాహంగా ఎదురుచూస్తాయి. అక్కడ ఒకటి కాదు రెండు కాదు, బోల్డన్ని క్రీడలకు చోటుంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాలు ఆ పోటీల్లో పాల్గొని, సత్తా చాటాలని తహతహలాడుతుంటాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో ఒలింపిక్స్‌ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఒలింపిక్స్‌ నిర్వహణ అనేది ఓ చారిత్రక ఘట్టం ఏ దేశానికైనా. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కొట్టడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఏ మెడల్‌ కొట్టినా అది ప్రతిష్టాత్మకమే. కానీ, మన దేశంలో ఒలింపిక్స్‌ పట్ల అంత క్రేజ్‌ వుందా.? 

ప్చ్‌.. దురదృష్టవశాత్తూ ఒలింపిక్స్‌ అంటే మన దేశంలో పెద్దగా ఎవరికీ అంత ఇంట్రెస్ట్‌ లేదు. అదే క్రికెట్‌ అయితే ఆ కిక్కే వేరప్పా. సాధారణంగా రెండు జట్ల మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌కి (టీమిండియా తలపడే మ్యాచ్‌లు) వున్నంత క్రేజ్‌ కూడా ఒలింపిక్స్‌కి కన్పించడంలేదు. ఐపీఎల్‌కి జరిగినంత హడావిడీ కన్పించడంలేదు. 

ప్రపంచంలో చాలా చిన్నదేశాలు సైతం, ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్నాయి. కానీ, మన భారతావనిలో మాత్రం ఒలింపిక్స్‌కి వెళ్ళేందుకు క్రీడాకారులే దొరకని పరిస్థితి. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు ఆయా క్రీడలకు మన దేశంలో తగిన ప్రోత్సాహం లభించడంలేదు. ఆటగాళ్ళ ఎంపిక దగ్గర నుంచి, వారికి శిక్షణ ఇప్పించడం, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడం వంటి విషయాల్లో పాలకుల నిర్లక్ష్యం సుస్పష్టం. టాలెంట్‌కి లోటేమీ లేదిక్కడ. 

ఈసారి వంద మందికి పైగా ఆటగాళ్ళు భారత్‌ తరఫున వివిధ క్రీడలకు ప్రాతినిథ్యం వహించనున్నారు రియో ఒలింపిక్స్‌లో. కానీ, ఆ వంద మంది నుంచి భారత్‌ ఆశిస్తున్న పథకాలు ఎన్నో తెలుసా.? పది లోపు మాత్రమే. ఇది చాలు, ఎంత కాన్ఫిడెంట్‌గా మన దేశం రియో ఒలింపిక్స్‌కి మన క్రీడాకారుల్ని సమాయత్తం చేస్తుందో చెప్పడానికి. క్రికెట్‌ని పిచ్చి మార్చేసి, ఆ క్రికెట్‌ పిచ్చితో జనాన్ని జూదం వైపుకు మళ్ళించిన బీసీసీఐ, ఆ బీసీసీఐని అన్ని విధాలా సమర్ధిస్తున్న ప్రభుత్వాలు.. ఒలింపిక్స్‌ విషయంలో మాత్రం, కనీసపాటి శ్రద్ధ కూడా పెట్టకపోవడం శోచనీయమే. 

చివరగా: ఒలింపిక్స్‌లో గతంలో పతకాలు మోసుకొచ్చినవారు, ఆ తర్వాత ప్రభుత్వాల నిరాదరణ కారణంగా అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. ఇదీ ఒలింపిక్స్‌ పట్ల మన పాలకులకు వున్న చిత్తశుద్ధి.

Show comments