తెరపైకి.. ‘మసీదుల్లోకి మహిళల ప్రవేశం’!?

శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన తుది తీర్పు ఇవాళ వస్తుందని కొన్ని రోజులుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయోధ్య తీర్పుకు ఉన్నంత ఉత్కంఠ కాకపోయినా..  శబరిమలై అయ్యప్ప ఆలయం విధివిధానాలకు ముడిపడినది, అత్యంత సున్నితమైన అంశమూ కావడంతో దీనిపట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే సుప్రీం ధర్మాసనం.. దీనినిన విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేస్తూ.. నిస్సారమైన, నిరాశాజనకమైన తీర్పు ఇచ్చింది.

అయితే ఈ సందర్భంగా కొత్తవి కాకపోయినప్పటికీ... కీకలమైనటువంటి రెండు అంశాలు తీర్పులో భాగంగా చర్చకు వస్తున్నాయి.

(1) మతం విషయంలో చొచ్చుకు వచ్చే అధికారం కోర్టులకు ఉందా? అనే అంశం ఇప్పుడు తెరమీదకు వచ్చిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

(2) శబరిమల లోకి మహిళల ప్రవేశం అనేది ఈ ఒక్కమతంతో ఆగదు. ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. మసీదుల్లోకి మహిళల ప్రవేశం అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది... అని తీర్పులో పేర్కొన్నారు.

(1) వ అంశం నిజమే. మత విషయాల్లోకి కోర్టు చొరబడడం అనేది.. వ్యక్తుల జీవితాల్లోకి చొరబడడం లాంటిదే అనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఆలయం ఏ రకంగానూ ప్రభుత్వ సంస్థగా గానీ... ప్రభుత్వ నిధులతో గానీ, ప్రభుత్వ సంస్థల దయాదాక్షిణ్యాల మీద గానీ నడవనప్పుడు.. ఆలయ నిర్వహణకు సంబంధించి.. వారు నమ్మే విశ్వాసాలతో కొన్ని విధివిధానాలను రూపొందించుకున్నప్పుడు.. ఆ వ్యవస్థలో చొరబడి.. తాము చెప్పినట్లుగా ఆలయం నడవాలనడం సబబు కాదనే వాదన ఉంది.

(2) వ అంశం ఇంకా సున్నితమైనది. ముస్లింల మసీదులలోనూ ఆడవారికి ప్రవేశం నిషిద్ధం. ఇటు శబరిమల ఆలయంలోనా, అటు మసీదుల్లోనైనా ఇలాంటి ఆచారాలకు మహిళల పట్ల వివక్ష అనడం కంటె.. ఆయా మతాల వారు నమ్మే విశ్వాసమే మూల కారణం. అయితే ముస్లింలు మసీదుల్లోకి కూడా మహిళలను అనుమతించాలి.. అని ఉద్యమాలు సాగించి.. మసీదుల్లో చొరబడడానికి మహిళలు ప్రయత్నిస్తే గనుక.. ఆ వివాదం యావత్ దేశాన్ని  గందరగోళంగా మార్చేస్తుంది.

ఈ సున్నితమైన అంశాలను సందేహాలుగా లేవనెత్తి.. మొత్తానికి సుదీర్ఘకాలం వాదనలు విన్న సుప్రీం అయిదుగురు జడ్జిల బెంచ్ ఎటూ తేల్చకుండా.. దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించింది. అయితే మతాల్లోకి చొరబడే హక్కు కోర్టుకు ఉందా? అనే సందేహం లేవనెత్తిన సుప్రీం బెంచ్.. ఆ హక్కు ఉన్నదో లేదో తేల్చకుండానే.. గతంలో సుప్రీం ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టేకు నిరాకరించడం మాత్రం చిత్రమైన పరిణామం. మరో రెండురోజుల్లో మళ్లీ ప్రవేశానికి మహిళల ప్రయత్నాలు.. అనే ఉద్యమాలు మొదలవుతాయన్నమాట.

Show comments