రవిప్రకాష్ ను ఈరోజు అరెస్ట్ చేస్తారా?

టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాష్ ను ఈరోజు అరెస్ట్ చేస్తారా? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. సాక్ష్యాలన్నీ రవిప్రకాష్ కు వ్యతిరేకంగా బలంగా ఉండడంతో, ఏ క్షణానైనా అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. మొన్నటివరకు ఆయన కేవలం విచారణకు మాత్రమే హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోయేవారు.

కానీ ఈసారి మాత్రం అతడ్ని పూర్తిగా అదుపులోకి తీసుకునేలా కోర్టు ఆదేశాలు జారీ చేయొచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ మేరకు అతడు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను రద్దుచేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అందుకే ఇవాళ వెలువడనున్న హైకోర్టు తీర్పు ఈ కేసులో కీలకంగా మారింది.

టీవీ9 సీఈవోగా పనిచేసిన రవిప్రకాష్, తన పదవీకాలంలో కంపెనీకి చెందిన నిధుల్ని దారిమళ్లించారని, లోగోను అక్రమంగా అమ్మేశారని, ఒక దశలో ఫోర్జరీకి కూడా పాల్పడ్డారంటూ నూతన సంస్థ అలందా మీడియా కేసు వేసింది. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరుకాకుండా మొన్నటివరకు తప్పించుకు తిరిగారు రవిప్రకాష్. చివరికి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురవ్వడంతో పోలీసుల ముందు హాజరయ్యారు. అరెస్ట్ చేయకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

రవిప్రకాష్ కు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారని తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, 40 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు రవిప్రకాష్ కు వ్యతిరేకంగా కీలక సాక్ష్యాలు సంపాదించరని, అతడ్ని అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల్ని అనుసరించి 41-ఏ సెక్షన్ కింద నోటీసులు కూడా జారీచేసిన విషయాన్ని ప్రస్తావించారు.

మరో ముఖ్య విషయం ఏంటంటే.. తన 40 గంటల సుదీర్ఘ విచారణలో ఫోర్జరీ చేసినట్టు రవిప్రకాష్ అంగీకరించారట. ఈరోజు విచారణలో ఈ అంశమే కీలకం కానుందని తెలుస్తోంది. మరోవైపు రవిప్రకాష్ తరపు లాయర్ కూడా బలంగా వాదించారు. విచారణలో భాగంగా మౌనంగా ఉండే హక్కు కూడా ఉందని, కేసుల వెనుక కుట్రపూరిత ఉద్దేశాలు ఉన్నాయని వాదించారు. అయితే సాక్ష్యాలు మాత్రం రవిప్రకాష్ కు వ్యతిరేకంగా బలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు విచారణ సందర్భంగా రికార్డు చేసిన వీడియో టేపుల్ని తనకు ఇవ్వాల్సిందిగా కోరిన రవిప్రకాష్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్