కష్టాల్లో ఉన్నాను, మళ్లీ సినిమాలు చేసుకుంటా

నిన్నగాక మొన్న పార్టీలో చేరాడు. టిక్కెట్ వస్తుందని ఆశించి భంగపడ్డాడు. ఎన్నికల టైమ్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. భవిష్యత్తులో ఓ పెద్దపదవి వస్తుందనే ఆశ కూడా పోయింది. దీంతో బండ్ల గణేష్ కు తత్వం బోధపడింది. తను కష్టాల్లో ఉన్నానని, మళ్లీ సినిమాలు చేసుకుంటానని అంటున్నాడు ఈ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.

"ప్రజాసేవ చేస్తాను. కానీ నా జీవితమే ప్రజాసేవగా పెట్టుకుంటే నా కుటుంబం ఏమౌతుందో అని భయం. పైగా ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను. కాబట్టి సినిమాలు కూడా తీసుకుంటా." సినిమాలకు సంబంధించి ఆల్రెడీ లైనప్ రెడీగా ఉందంటున్నాడు బండ్ల. తెలంగాణలో రాజకీయ స్థిరత్వం వచ్చిన తర్వాత తన సినిమాల వివరాల్ని వెల్లడిస్తానని, అప్పటివరకు రాజకీయాలే జీవితం అంటున్నాడు.

"ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు హీరోలతో చర్చలు సాగుతున్నాయి. లైనప్ రెడీగా ఉంది. సినిమాలు చేసుకోకపోతే ఎట్లా? వాళ్లలా (టీఆర్ఎస్ నాయకులు) నేను కమిషన్లు కొట్టలేను కదా. వాళ్లకంటే క'మిషన్' భగీరధ, క'మిషన్' కాకతీయ ఉన్నాయి. నాకు అలాంటి మిషన్లు లేవు కదా. నేను సినిమాలు చేసుకునే బతకాలి."

ఇలా సినిమాలు నిర్మిస్తానని చెబుతూనే, టీఆర్ఎస్ నేతలపై పంచ్ లు వేశారు బండ్ల గణేష్. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతూనే, నిర్మాణ రంగంలో కూడా ఉంటానని స్పష్టంచేశాడు. కేవలం పెద్ద స్టార్స్ తో, భారీ బడ్జెట్ సినిమాలే చేస్తానని, చిన్న సినిమాలు చేయనని కూడా తెలిపాడు.

మధ్యమధ్యలో అవసరమైతే న్యూస్ ఛానెల్స్ చర్చల్లో కూడా పాల్గొంటానని, చర్చలకు వెళ్లొద్దని తనను పార్టీ నుంచి ఎవరూ ఆదేశించలేదని స్పష్టంచేశాడు.

Show comments