ప్రియాంక పోటీ.. కాంగ్రెస్ కు తలపోటే.. ఎందుకంటే!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద కాంగ్రెస్ తరఫు నుంచి వారణాసి నియోజకవర్గంలో ప్రియాంక వాద్రా పోటీ గురించి తర్జనభర్జనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయంలో నిర్ణయాధికారం రాహుల్ దే అని అంటున్నారు. అయితే వారణాసి నుంచి ఆమె పోటీ విషయంలో ముందుగా క్లూ ఇచ్చింది స్వయంగా ప్రియాంకనే. తను పోటీ చేయడానికి సై అన్నట్టుగా ఆమె సొంత పార్టీ కార్యకర్తల మధ్య వ్యాఖ్యానించారు.

అయితే కచ్చితంగా పోటీ అని చెప్పలేదు. 'పోటీ చేయమంటారా..' అంటూ ఆమె కార్యకర్తలనే అడిగారు. ఇక అసలు నిర్ణయం రాహుల్ తీసుకోవాలట. మరి రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటారో కానీ.. ఆమె పోటీచేస్తే ఏమవుతుంది.. అనేదే పెద్ద జటిలమైన సమస్యగా మారింది కాంగ్రెస్ కు.

-మోడీకి వ్యతిరేకంగా ప్రియాంకను నిలబెడితే, బీజేపీతో కాంగ్రెస్ పార్టీ ఢీ అంటే ఢీ అన్నట్టే. ఇలా జాతీయ పార్టీల తరఫున ప్రధాన నాయకులు పరస్పరం పోటీ చేసుకోవడం అంటే అది సంచలనమే.

-అలా చేస్తే కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం రావొచ్చు. అయితే మోడీ మీద గెలవడం అంటే అది మాటలు మాట్లాడినంత ఈజీ కాదు.

-ప్రియాంక ఒక ప్రధానికి కూతురు, మరో ప్రధానికి మనవరాలు అయ్యుండొచ్చు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థికి చెల్లెలు అయ్యుండొచ్చు. అయితే సిట్టింగ్ పీఎం మీద నెగ్గడం అంటే తేలికకాదు.

-ఇక ప్రియాంకను పూర్తిస్థాయిలో ఈసారి బరిలోకి దించుతోంది కాంగ్రెస్. రాహుల్ కు చేతకాదనే లెక్కలతో ఆమెను రంగంలోకి దించుతోంది. ఇలాంటి పరిణామాల మధ్యన ఆమె మోడీ మీద పోటీచేసి ఎన్నికల్లో ఓడిపోతే.. అంతే సంగతులు!

-కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగూ కచ్చితంగా గెలిచి అధికారాన్ని చేపడుతుందనే నమ్మకాలు లేవు. ఇలాంటి తరుణంలో ప్రియాంకను కూడా ఈసారే మోడీ మీద పోటీకి దించేసి, ఆమె గనుక ఓడిపోతే.. భవిష్యత్తులో చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్ తరఫున తురుపుముక్కలు ఏవీ మిగలవు.

-ప్రియాంకను అదనపు నేతగా ఉపయోగించుకుంటేనే కాంగ్రెస్ కు మేలు. అలా కాకుండా, ఆమెనే ఒక అభ్యర్థిగా బరిలోకి దించేస్తే మాత్రం.. కాంగ్రెస్ చేజేతులారా ఒక అస్త్రాన్ని మిస్ యూజ్ చేసినట్టే! ఈ విషయాన్ని గ్రహించే కాంగ్రెస్ ప్రియాంక విషయంలో ఏం మాట్లాడకుండా ఉన్నట్టుంది!

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా?