ప్రభాస్ ఒట్టేసి ఒక మాట.. ఒట్టేయకుండా ఒకమాట

ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని గతంలోనే మాటిచ్చాడు ప్రభాస్. కానీ బాహుబలి టైమ్ లో అది సాధ్యంకాలేదు. బాహుబలి-2 రిలీజైన తర్వాత కూడా అది సాధ్యంకాలేదు. సాహో సినిమాకు ఏకంగా రెండేళ్లు టైమ్ తీసుకున్నాడు. అందుకే గతంలో ఇచ్చిన మాటను మరోసారి గుర్తుచేసుకున్నాడు ప్రభాస్. ఈసారి తప్పకుండా ఏడాదికి 2 సినిమాలు చేస్తానన్నాడు. కానీ ఈసారి కూడా ప్రభాస్ మాట మీద నిలబడ్డం అనుమానమే. ఎందుకంటే ప్రభాస్ అనుకున్నా.. ఇండస్ట్రీ ప్రభాస్ ను ఇప్పుడలా చూడడంలేదు.

బాహుబలి తర్వాత ఏడాదికి రెండు సినిమాలంటూ అభిమానులకు మాటిచ్చానని, అయితే మాటతప్పాల్సి వచ్చిందని, ఇప్పుడు మాట ఇవ్వకుండానే ఏడాదికి రెండు సినిమాలు చేస్తానంటున్నారు ప్రభాస్. ఒట్టేసి ఒకమాట, ఒట్టేయకుండా ఒకమాట అంటూ ఛత్రపతి డైలాగ్ గుర్తుచేశారు. అయితే ఈసారి కూడా ప్రభాస్ మాటతప్పేలా కనిపిస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలు ప్రభాస్ చేస్తానన్నా, దర్శక నిర్మాతలు ఒప్పుకోరు. ప్రభాస్ డేట్స్ దొరకడమంటే అంత ఈజీ కాదు, దొరికిన కాల్షీట్లను చిన్న సినిమాలతో, ఆరునెలల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్ లతో సరిపెట్టుకోవాలని ఎవరూ అనుకోరు.

దర్శకులు కూడా తన స్టామినా చూపించాలని వీర లెవల్లో ప్రిపేర్ అయి ఉంటారు. కచ్చితంగా గత సినిమాలతో పోలిక ఉంటుంది. అందులోనూ ప్రభాస్ ఇప్పుడు ఆలిండియా స్టార్. విదేశాల్లో కూడా అభిమానులున్నారు. వారందరికీ నచ్చే, అన్నిచోట్లా మంచి బిజినెస్ జరిగే సబ్జెక్ట్ ని డీల్ చేయాలి. వీటన్నిటినీ దాటుకుని వెళ్లాలంటే ఏడాదికి ఒక్క సినిమా చేసినా గగనమే. కాబట్టి రెండు సినిమాల కాన్సెప్ట్ అనేది ప్రభాస్ విషయంలో వర్కవుట్ కాకపోవచ్చు.

సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా భారీ చిత్రాల నుంచి బైటకొచ్చిన తర్వాత చిన్న చిన్న సినిమాలు చేస్తున్నా, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయే కానీ అవి అభిమానులకు ఆనడంలేదు. రజనీ వయసైపోయిన తర్వాత ఇలాంటి నిర్ణయానికొచ్చేశారు. ప్రభాస్ కి అలాంటి అవసరమేం లేదు. సో.. ప్రభాస్ కచ్చితంగా ఈసారి కూడా మాట తప్పాల్సిందే. ఏడాదికి రెండు సినిమాలు చేసే దుస్సాహసం ప్రభాస్ ఎంతమాత్రం చేయడు. ఒకవేళ చేస్తానన్నా దర్శక నిర్మాతలు, డైహార్డ్ ఫ్యాన్స్ ఒప్పుకోరు.

సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..

Show comments