ఈసారి నాదెండ్ల ఆశలు ఫలిస్తాయా?

నాదెండ్ల మనోహర్.. జనసేన తరఫున తెనాలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తనకు ఆల్రెడీ నియోజకవర్గంపై ఉన్న పట్టుకుతోడు, పవన్ హవా కూడా జతకలిసి విజయాన్ని అందిస్తాయని ధీమాగా ఉన్నారు. కానీ నాదెండ్ల ఆశించిన స్థాయిలో తెనాలి నియోజకవర్గంలో పరిస్థితులు లేవు. ప్రస్తుతం అక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తోంది.

2014లో వైసీపీ అక్కడ ఓడిపోయింది. ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిచారు. కానీ ఈ ఐదేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెనాలి సెగ్మెంట్ లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు రాజేంద్రప్రసాద్ పై వెల్లువెత్తుతున్న భూ కబ్జా ఆరోపణలు కూడా తక్కువేం కాదు. ఇవన్నీ కలిసి టీడీపీకి చెక్ పెడతాయని అంటున్నారు.

అదే సమయంలో గత ఎన్నికల్లో ఆలపాటి చేతిలో ఓడిపోయిన అన్నాబత్తుని శివకుమార్, ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. జగన్ వేవ్, తనపై జనాల్లో ఉన్న సానుభూతి కలిసి ఈసారి కచ్చితంగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు శివకుమార్. అటు ప్రజల్లో కూడా ఈసారి పోటీ వైసీపీ, టీడీపీ మధ్య మాత్రమే ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి టైమ్ లో సీన్ లోకి ఎంటరయ్యారు నాదెండ్ల మనోహర్.

రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన అనుభవం నాదెండ్లకు ఉంది. కానీ ఆ అనుభవం ఇప్పుడు పనిచేసేలా లేదు. ఎందుకంటే నియోజకవర్గంలో నాదెండ్ల తిరిగింది చాలా తక్కువ. మరీ ముఖ్యంగా ఈ సెగ్మెంట్ లో టీడీపీ, వైసీపీకి ఉన్నంత క్యాడర్ జనసేనకు లేదు. అయినప్పటికీ పవన్ మేనియాతో, తన అనుభవంతో ఒడ్డెక్కేస్తానని ధీమాగా ఉన్నారు నాదెండ్ల.

టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తనవైపు తిప్పుకుంటూనే, మరోవైపు వైసీపీ ప్రభంజనాన్ని అడ్డుకోగలగాలి. అప్పుడు మాత్రమే నాదెండ్ల గెలుపుసాధ్యం. దీనికితోడు నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీల సంప్రదాయ ఓటు బ్యాంక్ ను తనవైపు తిప్పుకోవడం నాదెండ్లకు అతిపెద్ద సవాల్.

దీనికితోడు ప్రచారం చేసుకోవడానికి నాదెండ్లను పవన్ వదిలితే కదా. పార్టీకి సంబంధించి ప్రతి విషయంలో పక్కన నాదెండ్లను పెట్టుకుంటున్నారు. వీటన్నింటినీ అధిగమించి ఆయన గెలుస్తారా అనేది అతిపెద్ద ప్రశ్న.

కర్నూలు ఎంపీ సీటు YCPకి ఇబ్బందులు తప్పవు

సావిత్రి, క్రీడాకారుల సినిమా చూశారే! మరి ఎన్టీఆర్ దే ఎందుకిలా?

Show comments