మమతా దీదీ బాటలో కేసీఆర్ నడుస్తారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకుంటారా? ఆమె తరహాలో.. వివాదం రేగినా సరే తాను ఖాతరు చేయనని తాను నమ్మిన రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని దృఢంగా నిలబడతారా? అందుకోసం, అవసరమైతే కేంద్రంతో ఎంతవరకైనా తగువు పెట్టుకోడానికి ఆయన సిద్ధంగా ఉంటారా? అనే చర్చోపచర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి.

తెలంగాణ విమోచన దినోత్సవం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజల భావోద్వేగాలకు సంబంధించినంత వరకు ఒక సున్నితమైన అంశం. ఆ సున్నితత్వం గాయపడకుండా ఇప్పటిదాకా ప్రతి ప్రభుత్వమూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవం అనేది భారతీయ జనతా పార్టీ డిమాండుగా, వారి సొంత కార్యక్రమంలాగా మాత్రమే ఉంటోంది. అయితే ఇప్పుడు భాజపా కూడా గేరు మార్చింది.

కేంద్రంలో తాము రెండోసారి మరింత బలంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడమూ, రాష్ట్రంలో కూడా గతంలో కంటె ఎక్కువ ప్రజాబలాన్ని కూడగట్టుకున్న నేపథ్యంలో.. వారు ఈ విమోచన దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తీసుకువచ్చి సభ పెడుతున్నారు. అయితే ఇలాంటి సభల్లో విద్వేష పూరిత ప్రసంగాలు రేగితే... సమాజంలో చిచ్చు రాజుకునే ప్రమాదమూ ఉంటుంది.

ఇప్పుడు చర్చ ఏంటంటే.. ఈ అంశంపై అమిత్ షా సభకు సీఎం కేసీఆర్ అనుమతిస్తారా? లేదా? అనేది. గతంలో భాజపా జాతీయ అధ్యక్షుడి హోదాలో పశ్చిమ బెంగాల్ లో సభ పెట్టడానికి పూనుకున్నప్పుడు సీఎం మమతా బెనర్జీ అనుమతివ్వలేదు. ఆయన చాలా గొడవచేసినా అనుమతి రాలేదు. మమత దృఢంగా వ్యవహరించారు. అదేబాటలో కేసీఆర్ కూడా అనుమతి నిరాకరిస్తారా? అనేది ఇప్పుడు ప్రశ్న. కాకపోతే ఇప్పుడు అమిత్ షా కేంద్ర హోంమంత్రి కూడా!

ఈ సభను తాము పార్టీ పరంగానే నిర్వహిస్తున్నట్లుగా తె-భాజపా ఇప్పటికే ప్రకటించింది. అలాంటప్పుడు అమిత్ షాను కేంద్రహోంమంత్రి హోదాతో గుర్తించక్కర్లేదు. పైగా కేసీఆర్ వివాదాలను ఖాతరుచేసే రకం కాదు. ఈ తెలంగాణ విమోచన దినోత్సవ సభ పరిణామాలు ఎలా సాగుతాయో చూడాలి.

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది

Show comments