చంద్రబాబు బిస్కెట్ వేస్తాడా? చాన్స్ ఇస్తాడా?

చంద్రబాబును నమ్ముకుని.. ఉన్న పార్టీని వదలి.. ఆయన పంచన చేరిన వారిలో చాలామంది ఆ తర్వాత పశ్చాత్తాప పడుతూనే వస్తున్నారు. అడ్డదారిలో రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయని, అందుకు చంద్రబాబు తమకు తోడ్పాటు అందిస్తారని ఆశపడి వెళ్లిన వారికి ఇప్పటికే పలువురికి భంగపాటు తప్పడం లేదు.

వైకాపా నుంచి ఫిరాయించి, తమ నియోజకవర్గాల్లో స్థానిక నేతలతో సయోధ్య కుదరక చంద్రబాబు పట్టించుకోక.. ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో ఉన్నారు. తాజాగా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన బాలయోగి కూడా అలాంటి వారి జాబితాలో చేరుతారేమో అనిపిస్తోంది.

హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న బాలయోగి కొన్నిరోజుల కిందట తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సందర్భంలోనే ఆయన రాజకీయ ఎంట్రీ ఇస్తారని, అమలాపురం లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఆశిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే రాజీనామా చేసిన వెంటనే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లకు భిన్నంగా బాలయోగి శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఉండవిల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఆయన రాజకీయ ఆలోచనల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

మాజీ జస్టిస్ బాలయోగి అమలాపురం స్థానం నుంచి ఎంపీ కావాలనుకుంటున్న మాట వాస్తవమే గానీ... చంద్రబాబు నాయుడు ఆయనకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారా? లేదా? అనేది చర్చనీయాంశంగా ఉంది.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పండుల రవీంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన పినిపె విశ్వరూప్ పై దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బాలయోగి వైకాపా నుంచే టికెట్ ఆశించారని, అక్కడినుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. తెలుగుదేశం ప్రాపకం కోసం అర్రులు చాస్తున్నారని వినిపిస్తోంది.

ఒకవేళ చంద్రబాబు, బాలయోగికి హామీ ఇచ్చినా కూడా.. తమ పార్టీకి చెందిన సిటింగ్ ఎంపీని కాదని టికెట్ ఇవ్వడం సాధ్యమేనా అనేచర్చ సాగుతోంది. ఒకవేళ ఇస్తానని మాట ఇచ్చినా కూడా ఆయనకు ముందు ముందు చికాకులు తప్పకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.

టికెట్ ఇస్తానని చెప్పి తెదేపాలో చేర్చుకున్నా.. చాలామంది విషయంలో చేసినట్లు.. అది బాలయోగికి  బిస్కట్ వేసినట్లే అవుతుందని అనుకుంటున్నారు.

Show comments