అక్రమ సంబంధం పెట్టుకున్నారు.. కొట్టుమిట్టాడుతున్నారు

తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు పరిస్థితి పూర్తిగా అయోమయంలో పడింది. కేసీఆర్ కి శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే ఫలితాలపై స్పందనను పరిమితం చేసిన చంద్రబాబుకి భవిష్యత్ అగమ్య గోచరంలా ఉంది. మరీముఖ్యంగా కాంగ్రెస్ తో అక్రమ సంబంధంపై చంద్రబాబు ఇప్పుడు డైలమాలో పడ్డారు.

కాంగ్రెస్ తో పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని తెలంగాణ ఓటర్లు ఛీ కొట్టారు. పొత్తుతో అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ దారుణంగా నష్టపోయాయి. విడివిడిగా పోటీ చేసినా ఇంతకంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని మథనపడుతున్నారు పరాజితులు.

ప్రతిపక్షం అన్న సింపతీ కాంగ్రెస్ పై, గెలిచిన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారన్న సింపతీ టీడీపీపై ఉండేవేమో. కానీ ప్రభుత్వ వ్యతిరేకతను ఏమాత్రం ఓట్ల రూపంలో మలచుకోలేకపోయిన ప్రజాకూటమి, అక్రమ కలయిక వల్ల మహా పరాభవం మూటగట్టుకుంది.

ఇక బాబు సంగతి మరీ తీసికట్టుగా మారింది. ఈ అక్రమ సంబంధాన్ని ఏపీలో కొనసాగించాలా వద్దా అనేదే చంద్రబాబు ముందున్న అతి పెద్ద ప్రశ్న. అలవాటు ప్రకారం చంద్రబాబు ఈ పాటికే కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోసేవారు.

అంతా కాంగ్రెస్ వల్లే జరిగింది, ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్లే టీడీపీ కూడా ఓడిపోయిందంటూ, తన అను'కుల' మీడియాతో పరాభవ భారం అంతా హస్తానికి అంటించేవారు. కానీ జాతీయస్థాయిలో కాంగ్రెస్ కు మెజారిటీ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. కాబట్టి ఆ పార్టీపై నెపం నెట్టలేరు.

అలా అని ఏపీలో కాంగ్రెస్ తో అక్రమ సంబంధం పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. తెలంగాణలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూసిన తర్వాత కూడా ఏపీలో కాంగ్రెస్-టీడీపీ జట్టుకడితే డిపాజిట్లు గల్లంతవుతాయి. బద్ధశత్రువులుగా ఉండాల్సిన కాంగ్రెస్, టీడీపీ కలయికను ఎవరూ జీర్ణించుకోలేదు.

ఏపీలో కొంతమంది ముఖ్యనేతలే దీన్నితీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఫలితాలతో అలాంటి స్వరాలకు మరింత బలం వచ్చినట్టయింది. బీజేపీ వ్యతిరేక కూటమిని తానే ఒక్కతాటిపైకి తెచ్చానని, కాంగ్రెస్ కు సౌత్ లో జవసత్వాలు తీసుకొచ్చానని ఇప్పటికే ఎక్కడలేని బిల్డప్ ఇచ్చుకున్నారు బాబు.

ఇప్పుడు అదే కాంగ్రెస్ విషయంలో వెనక్కి తగ్గితే జాతీయ స్థాయిలో పరువు పోతుంది. అలా అని కాంగ్రెస్ తోనే కొనసాగితే ఏపీలో ఓటమి తప్పదు. ఈ అయోమయ స్థితిలోనే బాబు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి ఎన్నికలకు ఏదో ఒక పార్టీతో సంబంధం పెట్టుకోనిదే చంద్రబాబుకు నిద్రపట్టదు.

కాబట్టి ఈసారి ఇష్టంలేకపోయినా కాంగ్రెస్ తో కాపురం చేయాల్సిందే. శిక్ష అనుభవించాల్సిందే. ఇది బాబు చేసుకున్న స్వయంకృతాపరాధం.

Show comments