ఎమ్బీయస్‌: ఎందుకో యింత తొందర?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా లేదా అన్న చర్చ హేమ్లెట్‌ తాలూకు 'టు బి ఆర్‌ నాట్‌ టు బి' తరహాగా తయారైంది. ఇప్పటివరకు వింటున్నదాని ప్రకారం కెసియార్‌ ముందస్తుకై పట్టుదలగా ఉన్నారు కానీ కేంద్రం మాత్రం అనుమతి యిద్దామా వద్దా అన్న ఊగిసలాటలోనే ఉంది. అసలు కెసియార్‌లో ముందస్తు ఆలోచన ఎందుకు రావాలి? ఆంధ్రలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళదామా అన్న ఆలోచన జరిగి, తర్జనభర్జనలు జరిగి చివరకు వద్దనుకున్నారని సమాచారం. తెలంగాణలో కూడా కెసియార్‌ తన కాబినెట్‌లో యీ విషయం గురించి చర్చించారని, మనం ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా గెలిచేట్లు ఉన్నాం కదా, ఎందుకు ముందుగా నాలుగు నెలల పదవీకాలాన్ని తగ్గించేసుకోవడం అని మంత్రులు అన్నారని తొలివార్తలు వచ్చాయి. తర్వాత కెసియార్‌ ఏం చెప్పి ఒప్పించారో మనకు తెలియదు కానీ ముందస్తు ఎన్నికలు తథ్యం అంటున్నారు.

ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు చూశాక అబ్బే, కెసియార్‌కి అనుమతి వచ్చేసింది, అందుకే సభకు గంట ముందు అర్జంటుగా కాబినెట్‌ మీటింగు పెట్టారు, అసెంబ్లీ రద్దు తీర్మానం చేసి, అటునుంచి అటే సభకు హెలికాప్టర్‌లో వెళ్లి ఎన్నికల భేరి మోగించేస్తారు అంటున్నారు. ఏ విషయం రేపు సాయంత్రాని కల్లా తెలిసిపోతుంది. అంతా బాగానే ఉంది కానీ, ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నట్లు? అనే ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం లేదు. సాధారణంగా కొన్ని సందర్భాల్లో అధికారపక్షాలు 'మేం ఎన్నో ప్రజాహితమైన పనులు చేపడదామనుకున్నాం కానీ మాకున్న బలం చాలటం లేదు. మీరు మాకు యిప్పటికంటె ఎక్కువమంది ఎమ్మెల్యేల నిస్తే మేము యింకా బాగా సేవ చేయగలుగుతాం' అనే కారణం చెప్పి ముందస్తు ఎన్నికలకు వెళుతూంటాయి. ఇక్కడ అలాటి సందర్భమేదీ లేదు.

తెరాస ప్రభుత్వం పటిష్టంగా ఉంది. ఉపయెన్నికలలో, కార్పోరేషన్‌ ఎన్నికలలో ప్రథమస్థానంలో, ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఉన్నారు. పార్టీపరంగా చూస్తే అసమ్మతి అనేది వినిపించటం లేదు. పార్టీ అధ్యక్షుడి మాట శిలాక్షరంగా ఉంది. ఏ నాయకుడూ అలిగి రాజీనామా చేయడమో, ప్రతిపక్ష పార్టీలో చేరడమో, కొత్త పార్టీ పెట్టడమో చేయలేదు. రాజకీయ సంక్షోభం యితర పార్టీల్లో ఉంది కానీ అధికార పక్షంలో లేదు. ఇలాటి పరిస్థితుల్లో తమ పదవీకాలాన్ని నాలుగు నెలలకు కుదించుకోవలసిన అవసరం ఏముంది? అడ్మినిస్ట్రేషన్‌ పరంగా సబబైన కారణం ఏదీ కనబడదు. అందువలన రాజకీయ కారణమే ఉండి ఉండవచ్చు. అది ఏమిటి? ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా మాకు 100 సీట్లు గ్యారంటీ అని పైకి తెరాస చెప్పుకుంటున్నా లోపల గుబులు ఉందనుకోవాలి.

కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయం కనబడటం లేదు. అందువలన 2019లో సీట్లు తగ్గినా బిజెపి గెలుపు, మోదీ ఎన్నిక ఖాయం. మోదీకి గతంలో ఉన్న ప్రజాదరణ తగ్గినా, పార్లమెంటు ఎన్నికలలో అతని మొహాన్ని చూపే బిజెపి ఓట్లు సంపాదించుకుంటుంది. ఆ ఊపులో రాష్ట్ర నాయకుల వైఫల్యాలు కొట్టుకుపోతాయని, పార్లమెంటుకి బిజెపికి ఓటేసిన ఓటరు, రాష్ట్రానికి వచ్చేసరికి మరో పార్టీకి ఓటేయడని బిజెపి నమ్మకం, యితర పార్టీల భయం. అందుకే పార్లమెంటు ఎన్నికలను ముందుకు జరిపి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తామని బిజెపి అంటే అవి అడ్డుకున్నాయి. కెసియార్‌కు కూడా యిదే భయం కావచ్చు - పార్లమెంటు ఎన్నికలతో కలిసే నిర్వహిస్తే  మోదీ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పడి తనకు సీట్లు తగ్గుతాయని!

తెలంగాణలో బిజెపి అంత బలంగా లేదన్నమాట నిజమే, కానీ మోదీయే ప్రధాన ఫ్యాక్టర్‌ అయ్యేసరికి మోదీకి అనుకూలంగా ఓటేసేవారు బిజెపికి, ప్రతికూలంగా ఓటేసేవారు కాంగ్రెసు కేంద్రిత కూటమికి ఓటేస్తారు. ఎందుకంటే బిజెపికి కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రత్యర్థి కాంగ్రెస్సే, తెరాస కాదు. అది ఊగిసలాట పార్టీ. ఈ మధ్యలో తెరాసకు ఓటేసేవారు, ఆ పార్టీకి పూర్తిగా కట్టుబడి ఉన్నవారు మాత్రమే. తటస్థ ఓటర్ల ఓటు పడకపోతే అనేక నియోజకవర్గాల్లో గెలుపు సందిగ్ధమే. అందువలన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను విడగొట్టడం కెసియార్‌ లక్ష్యం. ఇంకో కారణం కూడా ఉంది. కాంగ్రెసు, టిడిపి ఆంధ్రలో బహిరంగంగా కలుస్తాయో లేదో యిప్పుడే చెప్పలేం కానీ తెలంగాణలో మాత్రం కచ్చితంగా కలుస్తాయనుకోవచ్చు.

రెండు పార్టీల నాయకులకూ కెసియార్‌పై పీకల దాకా కసి ఉంది, తమ ఎమ్మేల్యేలను లాగేసుకుని తమ పార్టీలను భూస్థాపితం చేసేశాడని. తాము విడివిడిగా ఉండటం చేతనే తెరాస తన బలాన్ని 63 నుంచి 93కి పెంచుకోగలిగింది. ఇప్పటికైనా చేతులు కలపాలి అని నిశ్చయించుకుని నాయకుల నుంచి క్యాడర్‌ వరకు కలవగలిగితే అది దృఢమైన శక్తిగానే రూపొందుతుంది. ఎందుకంటే రెండు పార్టీలకు తెలంగాణలో మూలాల నుంచి పార్టీ నిర్మాణం ఉంది. ఊరూరా శాఖలున్నాయి. కాంగ్రెసుకు కొన్ని కులాలలో, టిడిపికి మరి కొన్ని కులాలలో స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. తెరాసకు పార్టీ నిర్మాణం సవ్యంగా లేదు. తెలంగాణ సెంటిమెంటుతోనే కెసియార్‌ పార్టీ నడుపుతూ వచ్చారు. తర్వాత యితర పార్టీ నాయకులను గుంజుకోవడం ద్వారా వాళ్ల అనుయాయులను తనవాళ్లుగా మార్చుకున్నాడు.

కాంగ్రెసు వాళ్లు తెలంగాణ యిచ్చి కూడా అంత:కలహాల కారణంగా అధికారం పోగొట్టుకున్నారు. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెసు నిండా కెసియార్‌ కోవర్టులే. తెలంగాణ యిస్తే కెసియార్‌ పార్టీని విలీనం చేస్తాడంటూ వాళ్లు అధిష్టానాన్ని బోల్తా కొట్టించారు. తెరాస అధికారంలోకి వచ్చాక వాళ్లంతా తమ ముసుగులు తీసేసి తెరాస లోకి చేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెసులో నికరంగా మిగిలినవాళ్లు తెరాసలో తమకు గౌరవం దక్కదన్న భయం ఉన్నవారో, లేక చావోరేవో కాంగ్రెసుతోనే అనుకునే వాళ్లో. రేపు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెసు గెలిచినా, గెలుపుకి దగ్గరగా వచ్చినా వీళ్లకు ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. వీరిపై యితర పార్టీలకు కూడా గౌరవం కలుగుతుంది. గౌరవం కలిగినా కలగకపోయినా టిడిపి కలవక మానదు, ఎందుకంటే బిజెపి తెప్ప తగలేసుకున్న తర్వాత వారికి వేరే గతి లేదు. రేవంత్‌ రెడ్డి సంధానకర్తగా ఉండి, ఆ సంగతి చూస్తాడు.

ఇక మిగిలినది కోదండరాం పార్టీ. విడిగా పోటీ చేసేటంత సాధనసంపత్తి లేదు దానికి. తెలంగాణ వస్తే ప్రజా తెలంగాణ ఏర్పడుతుందని, సామాజిక తెలంగాణ వస్తుందని, దళితులకు పెద్దపీట వేస్తారని, వామపక్ష విధానాలు అమలవుతాయని, ఆంధ్ర పెట్టుబడిదారుల కొమ్ములు విరుగుతాయని ఆశపడిన వామపక్ష వాదులందరూ, ప్రజాసంఘాల వారు కోదండరాం నాయకత్వంలో కెసియార్‌ వెంట నడిచారు. చివరకు చూస్తే కెసియార్‌ దొరతనానికి ప్రతీకగా మిగిలాడు. అసమ్మతి గళం విప్పితే పీక నులిమివేసేట్లు తయారయ్యాడు. నిరసన తెలిపిన వారి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రజాహితమైన పనుల కంటె ధార్మిక కార్యక్రమాలపై ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు. ఆంధ్రులతో సహా అందరు పెట్టుబడిదారులతో ఊరేగుతున్నాడు. పబ్లిసిటీ తప్ప సామాన్య ప్రజలకు ఒరిగినదేమీ లేకపోయింది.

అసెంబ్లీలో స్పీకరుకు మైకు తగిలిన సంఘటనలో ఆధారాల్లేని ఆరోపణపై యిద్దరు కాంగ్రెసు ఎమ్మేల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసిన ఉదంతం  నియంతృత్వానికి, అహంకారానికి పరాకాష్ఠ. కెసియార్‌ అధినేతగా తెలంగాణ ఏర్పడితే దివి నుండి భువికి స్వర్గం దిగి వస్తుందని ఊరించిన కోదండరాంకు వీటన్నిటి గురించి సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం వచ్చింది. అందుకే తిరగబడ్డాడు, కానీ బలం చాలలేదు. ఎపాయింట్‌మెంటే దొరకని పరిస్థితి దాపురించి, కుమలసాగాడు. కాంగ్రెసు-టిడిపి కూటమితో చేతులు కలిపినా కలపవచ్చు. గతంలో వారిని విమర్శించావు కదా అని అడిగితే 'నేనెప్పుడూ ప్రజల పక్షమే, అప్పుడూ అధికారంలో ఉన్నవారిని ఎదిరించాను, ఇప్పుడూ అధికారంలో ఉన్నవాళ్లని ఎదిరిస్తున్నాను.

ప్రజల కోసం బొంతపురుగునైనా ముద్దాడతాను' అనవచ్చు. మామూలు లెక్క ప్రకారం ఎన్నికలు జరిగేట్లయితే ఈ ఏడున్నర నెలల్లో యీ కూటమి సభ్యులు తమలో తాము సమాధానపడి, అహంకారాలు పక్కన పెట్టి రాజీపడవచ్చు. ఎందుకంటే విడివిడిగా ఉంటే ఎన్నికల తర్వాత కెసియార్‌ తమ పార్టీలను నమిలి మింగేస్తాడని తెలుసు. తమ ఉనికికే ప్రమాదం. అందువలన వాళ్లు తెరాస వ్యతిరేక ప్రదర్శనలంటూ సంయుక్త కార్యాచరణకి దిగి బలపడవచ్చు. దాన్ని నివారించాలంటే ముందుగానే వెళ్లిపోవాలనే ఆతృత కెసియార్‌ది. మరో కారణం కూడా ఉంది. కెసియార్‌ తన వారసుడిగా కొడుకుని తీర్చిదిద్దుతున్నారు. అతనికి రాష్ట్రాన్ని అప్పగించేసి, తను జాతీయస్థాయి నాయకుడిగా ఎదగాల్సిన తరుణం వచ్చేసిందని ఆత్మవిశ్వాసం ప్రబలింది.

కాంగ్రెసు, బిజెపిలు రెండిటికి దూరంగా ప్రాంతీయ పార్టీలతో ఓ కూటమి తయారు చేద్దామని ముందుకు వచ్చారు. మాది నాలుగో కూటమి కాదు, మొదటి కూటమే అని గంభీరంగా ప్రకటించారు. కానీ అంబ పలకలేదు. మమత దగ్గర్నుంచి అందరూ కేవలం పలకరించి వదిలేశారు. బిజెపిని ఓడించాలంటే కాంగ్రెసుతో ఏదో ఒక రకంగా చేతులు కలపవలసినదే అని వాళ్ల అభిప్రాయం. రాష్ట్రంలో ద్వితీయస్థానంలో ఉన్న కాంగ్రెసును కెసియార్‌ అక్కున చేర్చుకోలేరు. బిజెపి ఒక్కటే గతి. ఆ విషయం అర్థం కాగానే పార్లమెంటు సాక్షిగా బిజెపికి మద్దతు పలకసాగారు. ఎన్‌డిఏలో భాగస్వాములను చేర్చే పనిలో ప్రస్తుతం అమిత్‌ ఉన్నారు. రాబోయే ఎన్నికలలో తమతో పొత్తు పెట్టుకోమని బిజెపితో అడిగితే కాదనలేని పరిస్థితి కెసియార్‌ది.

బిజెపితో పొత్తు పెట్టుకుంటే మజ్లిస్‌కు కోపం వస్తుంది, మైనారిటీలు దూరమవుతారు. వామపక్ష వాదులు సరేసరి. దళితులు సంగతి గట్టిగా చెప్పలేం. వాళ్లంతా కలిసి కాంగ్రెసు కూటమి వైపు మొగ్గితే తనకు నష్టమే. అందువలన అసెంబ్లీ ఎన్నికల వరకు పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి, యీ వర్గాల సాయంతో గెలిచి, పార్లమెంటుకి వచ్చేసరికి ఎన్‌డిఏ భాగస్వామిగా పోటీ చేయడం ఒక పద్ధతి. దానివలన ఎంపీల సంఖ్య తగ్గితే తగ్గవచ్చు కానీ రాష్ట్రం వరకు అధికారం, కొడుకు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఎంపీల సంఖ్య పెంచుకునేందుకు బిజెపి ఎలాగూ శ్రమిస్తుంది. మోదీ యిమేజి ఎలాగూ తోడ్పడుతుంది. ఎమ్జీయార్‌ ఫార్ములా అని ఒకటుంది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రాంతీయపార్టీకి 75% సీట్లు, జాతీయ పార్టీకి 25% సీట్లు కేటాయిస్తారు. పార్లమెంటు ఎన్నికలలో ప్రాంతీయపార్టీకి 25% సీట్లు, జాతీయ పార్టీకి 75% సీట్లు కేటాయిస్తారు. కెసియార్‌ దానికి మార్పులు చేస్తున్నారు. అసెంబ్లీ వరకు 100% ఆయనకే. లేదా కొన్ని సీట్లలో లోపాయికారీ ఒప్పందం. పార్లమెంటుకు మాత్రం ఏదో ఒక నిష్పత్తిలో సీట్ల కేటాయింపు. దానివలన కెసియార్‌కు కేంద్ర కాబినెట్‌లో బెర్త్‌ ఖాయం.

ఈ ప్లానుని బిజెపి ఒప్పుకుంటే కెసియార్‌కు అసెంబ్లీలో విజయం ఖాయమేనా? దీనికి సమాధానం చెప్పడం కష్టమే. ఏదో జరిగిపోతోందని పబ్లిసిటీ చేసి భ్రమ పెట్టడం ఒక విద్య అయితే, చేసిన వాగ్దానాలు తీర్చడం మరో విద్య. అందునా కెసియార్‌ ఎడాపెడా వాగ్దానాలు చేసేశారు. ఎన్నో నెరవేర్చలేదు. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగాల విషయంలో తెలంగాణ యువత చాలా నిరాశ చెందుతున్నారు. ఉద్యమసమయంలో తెరాస చాలా మాటలు చెప్పింది - తెలంగాణ నుంచి ఆంధ్ర మూలాల వాళ్లను పరుగులు పెట్టిస్తామని, వాళ్ల పెట్టుబడులకు ముకుతాడు వేస్తామని, వాళ్ల కాలేజీలు మూసేస్తామని, వాళ్ల ఫ్యాక్టరీల ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తామని,  ఆంధ్ర ప్రాంతీయులు ఖాళీ చేసిన ఉద్యోగాలలో స్థానికులను నియమిస్తాయమని.. యిలా ఎన్నో. తెలంగాణ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు యివన్నీ నమ్మారు.

ప్రతిభతో సంబంధం లేకుండా కేవలం ప్రాంతీయత కారణంగా తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని గాఢంగా విశ్వసించారు. గ్రామాలు, చిన్నసైజు పట్టణాలలో అయితే ఆంధ్రులు ఖాళీ చేసి వెళ్లిపోయిన యిళ్లు స్థానికులకు కేటాయిస్తారనే ప్రచారం కూడా విచ్చలవిడిగా సాగింది. ఇవేమీ జరగలేదు. గుర్తు చేస్తే 'ఉద్యమంలో లక్ష మాట్లాడతాం' అంటూ తెరాస నాయకులు కొట్టిపారేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం తరిమి కొట్టడం అసాధ్యం అని తెలిసి కూడా అప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టారు వీళ్లు. సరే, పొట్టకూటి కోసం వచ్చినవాళ్లతో పేచీ పెట్టుకోం అని ఉద్యోగస్తులను వదిలేసేరే అనుకుందాం. మరి ఆంధ్ర పెట్టుబడిదారులను అంతలా వాటేసుకోవాల్సిన అవసరం ఉందా?

ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఆంధ్ర కాంట్రాక్టర్ల  గురించి, కొండలు, గుట్టలు, చెఱువులు 'ఆక్రమించేసిన' సినిమాజనం గురించి ఆగం చేశారో, వారితోనే చెట్టాపట్టాలేసుకుని ఉన్నారుగా. ఆట్టే మాట్లాడితే గతంలో కంటె ఎక్కువగా ఉంటున్నారు. కెసియార్‌కు సన్నిహితులైన కొందరు తప్పిస్తే స్థానివ్యాపారస్తులు యిదివరకు ఎక్కడున్నారో యిప్పుడూ అక్కడే ఉన్నారు. బలవంతులైన ఆంధ్రమూలాల వారితో పోటీలో వెనకబడుతూనే వున్నారు. ఈ విధంగా సామరస్యంగా ఉండకూడదా? ఘర్షణ వాతావరణం సృష్టించి అందర్నీ తరిమివేయాలా? అని అడగవద్దు. తెలంగాణ ఏర్పడితే పరిస్థితిలో తమకు అనుకూలమైన మార్పు వస్తుందని ఎదురు చూసి, మోసపోయిన ఒక సాధారణ తెలంగాణవాడి కోణంలోంచి ఆలోచించండి.

నిజానికి కెసియార్‌ అధికారంలోకి రాగానే ఆంధ్రమూలాల వారు కంగారు పడ్డారు. పెట్టుబడులు తరలించుకుని పోవాలేమో అనుకుని బెంగపడ్డారు. దానికి తగ్గట్టుగానే ఆయనా పెద్ద హంగామా చేశాడు. ఆ విధంగా ఆంధ్రమూలాల వారికి తన తడాఖా ఏమిటో చూపించి, వాళ్లు తనతో రాజీకి వచ్చేట్లు చేశాడు. ఆ తర్వాత అంతా గప్‌చుప్‌. గతంలో ఎలా ఉన్నారో, యిప్పుడూ అలాగే ఉండండి, ఆ మాట కొస్తే యింకా వర్ధిల్లండి అన్నాడు. కొత్తగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు అక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతాయని బాబు హడావుడి చేయడంతో ఆంధ్రులు అక్కడ రియల్‌ ఎస్టేటులో పెట్టుబడులు పెట్టారు. కానీ ఎన్నేళ్లయినా అతీ, గతీ కానరాకపోవడంతో అక్కణ్నుంచి తీసేసి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వైపు మరలారు. ఈలోగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, తమ కేమీ యిబ్బంది ఉండదని నమ్మకం బలపడడంతో తెలంగాణలో ఎడాపెడా కొనేస్తున్నారు.

ఈ పెట్టుబడుల వలన తెలంగాణలో, ముఖ్యంగా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇవన్నీ చూసి ఆంధ్రులు కెసియార్‌ను మెచ్చుకోవచ్చు. కానీ ఆంధ్రుల కారణంగా భూముల ధరలు తమకు అందుబాటులో లేవని బాధపడే ఓ స్థాయి తెలంగాణా కొనుగోలు దారుల సంగతేమిటి? తనను ఆంధ్రమూలాల వారు కూడా ఆత్మీయుడిగా భావించాలని కెసియార్‌ తపన. 2014 ఎన్నికలలో జంటనగరాలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రమూలాల వారు టిడిపిని, దానితో జత కట్టిన బిజెపిని ఆదరించారు - ఏదైనా ఘర్షణ వస్తే వాళ్లు తమకు అండగా ఉంటారనే ఆశతో ! కానీ త్వరలోనే వాళ్ల కర్మానికి వాళ్లను వదిలేసి బాబు పలాయనం చిత్తగించారు. ఆ అదను చూసుకుని మునిసిపల్‌ ఎన్నికలలో కెటియార్‌ వాళ్లను దువ్వారు. నగరంలో ఉన్న టిడిపి ఎమ్మేల్యేలను తెరాసలోకి లాక్కున్నారు.

ఇటీవల ఆంధ్రమూలాల వారి గురించి అక్కర మరీ పెరిగింది. ఇక్కడ పుట్టిన వారందరూ తెలంగాణా వారే అని నిర్వచిస్తోంది తెరాస. గతంలో ఇక్కడే పుట్టి, యిక్కడే చదువుకున్నా వాళ్ల తలిదండ్రులు యిక్కడ పుట్టకపోతే తెలంగాణవారు కాదన్నారు. ఇప్పుడు హరికృష్ణ మృతి తర్వాత చేసిన హంగామా చూసినా ఆశ్చర్యం వేస్తుంది. ఈ దశాబ్దంలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరుల గురించి ఏమీ చేయలేదు, వాళ్లకు గుర్తింపు లేదు, సామూహికంగా ఒక స్మారక చిహ్నం కూడా లేదు. కానీ హరికృష్ణకు మహాప్రస్థానంలో స్మారకచిహ్నం కట్టిస్తుందట తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన హరికృష్ణకు ఆంధ్రలో కట్టారన్నా అర్థముంది.

తెలంగాణలో కట్టడమేమిటి? ఇదంతా చూసి ఉద్యమసమయంలో ఆంధ్రమూలాల వారిని నానా బూతులూ తిట్టిన కాంగ్రెసు వారు సైతం వారిని తమ కడుపులో పెట్టుకుంటామని, రక్షిస్తామని తెగ ఆఫర్లు యిస్తున్నారు. వాళ్ల ఓట్ల గురించి అందరూ గేలం వేసేవారే! ఈ క్రమంలో ఉద్యోగాలు రాక, ఉపాధి అవకాశాలు కలగక అలమటిస్తున్న సగటు తెలంగాణ ఓటరు మనోభావాలు ఏమిటో తెలిస్తే ఏ పార్టీకి ఆదరణ ఉంటుందో తెలుస్తుంది. కెసియార్‌కు ఉన్న మరో యిబ్బంది - ఫిరాయింపుదార్లకు టిక్కెట్లు. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే ఆశ చూపి అందర్నీ తన పార్టీలోకి లాక్కుని వచ్చాడు. ఇప్పుడు ప్రతీ నియోజకవర్గంలో ఒరిజినల్‌ తెరాస నాయకుడు, ఫిరాయింపు కాంగ్రెసు నాయకుడు, ఫిరాయింపు టిడిపి నాయకుడు అందరూ తెరాసలోనే ఉన్నారు.

ఎవరికి టిక్కెట్టు యిచ్చినా అవతలివాళ్లు తిరుగుబాటు అభ్యర్థి అవుతారు. వాళ్లను ఎగేసుకుపోవడానికి కాంగ్రెసు, టిడిపిలు రెడీగా ఉంటాయి - సొంతింటికి తిరిగివచ్చేయ్‌ అంటూ. ఇన్ని కష్టాల మధ్య కెసియార్‌ అసెంబ్లీ ఎన్నికలు గెలవాలంటే అవి విడిగానే జరగాలి. కెసియార్‌ వరకు యిది అనుకూలమే. కానీ మీకు అనుకూలమైన దానికి సమ్మతించడానికి మేమెందుకు సహకరించాలి? అని కేంద్ర బిజెపి అడిగితే కెసియార్‌ వద్ద సమాధానమేముంది? నిజానికి అసెంబ్లీని ముందుగానే రద్దు చేసుకుని, మళ్లీ ఎన్నికలకు వెళ్లే హక్కు రాష్ట్రానికి ఉంది. కేంద్రం అనుమతి అక్కరలేదు. మరి దీని విషయమై ప్రధానికి ఓ మాట ముందుగా చెప్పడం దేనికి? వారితో చర్చించడం దేనికి? రద్దు చేసుకోవడం వరకు రాష్ట్ర ప్రభుత్వం యిష్టమే కానీ, మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిపించాలి అనేది ఎన్నికల కమిషన్‌ నిర్ణయించాల్సిన విషయం. ఆ విషయంలో దాన్ని మాట ఎవరూ జవదాటలేరు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై 2003లో అలిపిరిలో మావోయిస్టుల దాడి జరిగింది. ఎల్లెడలా సానుభూతి పెల్లుబికింది. ఆనాటి వాతావరణం బట్టి ముందస్తు ఎన్నికలకు వెళితే విజయం తథ్యమనుకున్నారు చంద్రబాబు. తక్షణం ఎసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎన్నికల కమిషనర్‌కు సిఫార్సు పంపారు. ఇంతవరకు బాగానే జరిగింది. తర్వాతే కథ అడ్డం తిరిగింది. ఎన్నికల కమిషనర్‌గా లింగ్డో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు జరిపేందుకు సరైన వాతావరణం లేదని ఆయన అభిప్రాయ పడ్డాడు. ఓటర్ల జాబితా సవరించాల్సి ఉందని, ఆ పని పూర్తయిన తర్వాతనే ఎన్నికలని ఆయన పట్టుబట్టాడు. అది చాలా టైము పట్టే వ్యవహారం. ఏడెనిమిది నెలల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈలోగా పరిస్థితులలో మార్పు వచ్చింది.

చంద్రబాబుపై సానుభూతి యిగిరిపోయింది. 2004 ఎన్నికలలో ఓడిపోయారు. ఎన్నికల రద్దుకు, తాజా ఎన్నికల నిర్వహణ మధ్య ఎక్కువ గ్యాప్‌ ఉండడం లెక్కలను తారుమారు చేస్తుందనే భయం అందరికీ ఉంటుంది. అందువలన ఎన్నికల కమిషన్‌ అభిప్రాయాన్ని తెలుసుకోనిదే ఉన్న అసెంబ్లీని రద్దు చేసుకోవడం వివేకమనిపించుకోదు. కెసియార్‌ దిల్లీ పర్యటనలో మోదీ ద్వారా ఆ విషయాన్ని కూడా చక్కబెట్టుకునే ఉంటారనుకోవాలా? అదే జరిగితే బిజెపికి ఏం చెప్పి కెసియార్‌ ఒప్పించి ఉంటారు? అసెంబ్లీ ఎన్నికలు కాగానే నేను అధికారికంగా ఎన్‌డిఏలో చేరతాను, తర్వాత దేశంలో తక్కిన పార్టీలను కూడా యీ కూటమిలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను అని ఉంటారా? టిడిపి తరఫున గతంలో బాబు ఎన్‌డిఏ కన్వీనరుగా ఉన్నారంటే దానికి చారిత్రక నేపథ్యం ఉంది.

దేశమంతా ఇందిరా గాంధీ అంటే గడగడలాడే సమయంలో ఎన్టీయార్‌ నేషనల్‌ ఫ్రంట్‌ పెట్టి ప్రతిపక్షాలను సమీకృతం చేశారు. వాళ్ల రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు వెళ్లి ప్రచారం చేశారు, నిధులు పంపారు. వాళ్లందరికీ కృతజ్ఞతాభావం, గౌరవం ఉన్నాయి. ఎన్టీయార్‌ వారసుడిగా బాబుకి అవి దఖలు పడ్డాయి. పైగా అప్పుడు ఆయన 42 మంది ఎంపీలున్న పెద్ద రాష్ట్రానికి నాయకుడు. కెసియార్‌కు అలాటి చరిత్ర ఏముంది? ఏ పార్టీకి సాయపడ్డాడు? గతంలో కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఏ రాష్ట్రానికేనా సౌకర్యాలు సమకూర్చి, అక్కడి ప్రాంతీయ పార్టీకి ఆత్మీయుడయ్యాడా? అసలు మంత్రి పదవే సరిగ్గా నిర్వహించలేదు. జాతీయ స్థాయి నాయకుడని మన పేపర్లలో రాసుకుంటే సరిపోయిందా? తిప్పితిప్పి కొడితే 17 మంది ఎంపీలున్న రాష్ట్రం.

కెసియార్‌ పెట్టిన కూటమి వైఫల్యంతోనే ఆయన సత్తా వెల్లడయింది. ఇప్పటికే అనేక పార్టీలు బిజెపి వైపో, కాంగ్రెసు వైపో చూస్తున్నాయి. బిజెడి లాటివి సరిగ్గా తేల్చకపోయినా, కెసియార్‌ వెళ్లి మార్చేసేది ఏమీ లేదు. అందువలన తెలంగాణ ముందస్తు ఎన్నికలకు బిజెపి సమ్మతించవలసిన అవసరం ఏమీ కనబడటం లేదు. అయినా బిజెపి ఒప్పుకుంటే మరేదో కారణం ఉందనుకోవాలి. ఒకవేళ వాళ్లూ పార్లమెంటూ రద్దు చేసి ముందస్తుకి వెళ్లిదామనుకుంటున్నారేమో! ఆఖరి నిమిషం దాకా ఏమీ తేల్చకుండా, చటుక్కున ఎనౌన్సు చేసి మధ్యప్రదేశ్‌ ఎన్నికలతో పాటు పెట్టేస్తారేమో! అలా ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తారేమో! కొద్ది రోజుల్లో అసలు సంగతి తెలిసిపోతుంది.

ఈ రాజకీయాల మాట అలా వుంచితే ముందస్తు ఎన్నికల నిర్ణయాలలో ప్రజల మాటేమిటి? తమ పదవీకాలాన్ని కుదించుకునే హక్కుని పాలకులకు యిచ్చిన రాజ్యాగం ప్రజాభీష్టాన్ని లెక్కలోకి తీసుకోలేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రజలకు ఒక పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, నాయకత్వం నచ్చాయి. అందువలన 'మీరు మమ్మల్ని ఐదు సంవత్సరాల పాటు పాలించండి' అని కోరుతూ వారికి ఓట్లేశారు. మీ కోర్కెలను తీరుస్తాం, మీరు కోరుకున్నట్లు ప్రవర్తిస్తాం అని వాగ్దానం చేసి కదా పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాటప్పుడు వారిని సంప్రదించకుండా వారు అధికారం నుంచి ముందే దిగిపోవడమేమిటి? ఒక్కొక్కపుడు ఎన్నికైన ప్రజాప్రతినిథి ప్రజల ఆశలను నెరవేర్చడు. అప్పుడు అతన్ని పదవీకాలం ముగిసేలోగానే ప్రజలు వెనక్కి రప్పించే 'రీకాల్‌' హక్కును ఉపయోగించుకుంటారు. ఆ హక్కు మన దేశంలో లేదని అందరికీ తెలుసు.

కనీసం మనకు 'కంటిన్యూ' అని చెప్పే హక్కు కూడా లేదన్నమాట. ముందస్తు ఎన్నికల విషయంలో పదవీకాలాన్ని స్వయంగా కుదించుకుంటున్నారు. అదే రీతిలో పదవీకాలాన్ని పెంచుకోగలరా? ఐదేళ్లపాటు పాలించమంటే ఆరేళ్లు, ఏడేళ్లు పాలిస్తామంటే రాజ్యాంగం ఊరుకుంటుందా? లేదుగా! ఐదేళ్లంటే ఐదేళ్లే అంటుంది. పెంచడానికి వీల్లేనపుడు, తుంచడానికి మాత్రం ఎందుకు ఒప్పుకుంటోంది? ఒకవేళ ఎన్నికలు జరిగి, యీ పార్టీ కాకుండా వేరే పార్టీ గెలిచిందనుకోండి. అప్పుడు యీ పార్టీని ఐదేళ్లపాటు అధికారంలో ఉండమని కోరుతూ గత ఎన్నికలలో ఓటేసిన వారి అభీష్టాన్ని వంచించినట్లేగా! తమ పదవీకాలాన్ని తగ్గించుకోవలసిన అవసరం ఏముందో, ఏ ప్రత్యేక పరిస్థితులు ముందస్తు ఎన్నికలను అవసరాన్ని కొని తెచ్చాయో ప్రభుత్వం ప్రజలకు చెప్పుకోవలసిన, చెప్పిఒప్పించవలసిన అవసరం కూడా ఉంది.

రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్‌ చేసిందంటే చాలదు. నేననేది - రాష్ట్రమైన, కేంద్రమైనా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ. ఎందుకు ముందస్తుకి వెళ్లాల్సి వచ్చింది అనేది కన్విన్సింగ్‌గా చెప్పగలగాలి. 'ప్రస్తుతం మా పాప్యులారిటీ చాలా హైగ్రేడ్‌లో ఉంది. దీన్ని ఎన్‌క్యాష్‌ చేసుకుందా మనుకుంటున్నాం.' అని చెప్పగలరా? లేక 'కొన్నాళ్లు పోతే దిగజారుతుందని భయంగా ఉంది. దీపముండగానే యిల్లు చక్కదిద్దుకుందామని మా తాపత్రయం' అని చెప్పగలరా? ముందస్తుకి వెళ్లే ప్రతీ పార్టీ వచ్చేసారి కూడా మేమే గెలుస్తాం అనే ధీమాను వ్యక్తం చేస్తారు. 'మంచిదే, ఈ ఐదూ, ఆ ఐదూ మొత్తం పదేళ్లు మీరే పాలించండి. తొమ్మిది, తొమ్మిదిన్నర ఏళ్లు పాలించడం దేనికి?' అని ప్రజలు నిలదీసి అడిగితే వీరి వద్ద సమాధానం ఎక్కడుంది?

ఇక ఆర్థిక కోణం గురించి ఆలోచిస్తే - పొదుపు పేరిట జమిలి ఎన్నికలను కాన్వాస్‌ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలా అంగీకరించో తెలియదు. మామూలుగా ఆయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి 2019 ఏప్రిల్‌లో జరగాలి. కానీ యిప్పుడు విడివిడిగా జరుగుతున్నాయంటున్నారు. ఎన్నికల నిర్వహణ ఎంతో వ్యయంతో, శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఎంతోమంది ఉద్యోగులను పోలింగ్‌ బూత్‌ల నిర్వహణకు వుపయోగించాలి. పోలీసులు, మందీ మార్బలం, శాంతిభద్రతల సమస్యలు, ప్రచారం పరిమితుల్లో ఉండేట్లు చూడడాలు.. ఒకటా రెండా? ఇంతటి శ్రమ ఒకసారి పడడమే కష్టమనుకుంటే రెండు సార్లు పడడం ఎంత శ్రమ? ఎంత ఖర్చు? పార్టీల పరంగా చూసినా కూడా రెండూ ఒకేసారి నిర్వహిస్తే ప్రచారం ఖర్చు, సభానిర్వహణ ఖర్చు, జనసమీకరణ ఖర్చు అన్నీ కలిసి వస్తాయి.

ఇలాటి కారణాలు చెప్పే బిజెపి జమిలి ఎన్నికల ప్రతిపాదనను గట్టిగా సమర్థిస్తోంది. కొన్ని అసెంబ్లీల కాలపరిమితులను కుదించి, కొన్నిటిని పొడిగించి పెద్ద కసరత్తు చేస్తానంటోంది - ఖర్చు మిగల్చడానికి! మరి అలాటప్పుడు తెలంగాణ ప్రభుత్వం యిలా ఖర్చు పెడుతూంటే ఎలా ఆమోదిస్తోంది? పొదుపు చేయమని మనల్ని చంపుకుతింటారు. గ్యాస్‌ సబ్సిడీ వదులుకోమంటారు, కార్లో అపరిచితులకు లిఫ్ట్‌ యిచ్చి పెట్రోలు ఆదా చేయమంటారు. ఇలా ప్రచారం చేసే ప్రభుత్వం అవసరం లేని ఖఱ్చు పెడుతూ ప్రజలను ఎలా కన్విన్స్‌ చేయగలగుతుంది?

ముందస్తు ఎన్నికల విధానం గురించి అన్ని పార్టీలు కలిసి కూర్చుని, ఒక సరైన విధానాన్ని రూపొందించి చట్టబద్ధం చేస్తే చాలా బాగుంటుందని మనం ఆశించడంలో తప్పు లేదనుకుంటాను.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2018)
mbsprasad@gmail.com

Show comments