'ఆర్.ఆర్.ఆర్' కి ఆస్కార్ రేంజ్ ఎందుకు లేదంటే

తెలుగువాడికి ఆస్కార్ అవార్డొస్తుంటే కచ్చితంగా ప్రతి తెలుగువాడూ గర్విస్తాడు. ఆస్కార్ కి ఆస్కారమున్న సినిమాని తీసి దానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటే కచ్చితంగా గళం కలుపుతాడు. 

కానీ ఆ స్థాయి సినిమా కాని సినిమాకి బాకాలూది లాబీయింగులు చేస్తుంటే మాత్రం చిరాకొచ్చి ఛీ అంటాడు. అలా ఛీకొడుతున్న వాడిని చూసి తెలుగువాడికి తెలుగువాడే శత్రువు అనో, కులప్రాతిపదిక మీద ఏర్పరుచుకున్న ద్వేషం వల్ల ఛీకొడుతున్నాడనో అనుకుంటారు తప్ప స్వీయసమీక్ష చేసుకునే స్థితప్రజ్ఞత చాలామందిలో ఉండదు. 

బాహుబలితో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నిజంగా తెలుగువారికి గర్వకారణం. అందులో సందేహమేదీ లేదు. కానీ మలి చిత్రం ఆర్.ఆర్.ఆర్ తో విపరీతంగా నిరాశపరిచాడు. బాక్సాఫీసు కలెక్షన్ల గురించి ఎంత చెప్పుకున్నా.. ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయంటే అదంతా "బాహుబలి" ఇమేజ్ కి కొనసాగింపు కొంత, తారాబలం కొంత. అంతే తప్ప "ఆర్.ఆర్.ఆర్" కంటెంటుకి మాత్రం అంత కటౌట్ లేదు. 

దొంగలుపడ్డ ఆర్నెల్లకి కుక్కలు మొరిగిన సామెత లాగ, సినిమా విడుదలప్పుడు కాకుండా చాలా నెలల తర్వాత ఈ మధ్యన "ఆర్.ఆర్.ఆర్" కి విచిత్రమైన గెరిల్లా పబ్లిసిటీ చేసారు. 

తెలిసిన హాలీవుడ్ బ్యాచ్ ని, కామన్ కాంటాక్ట్స్ ద్వారా పరిచయమైన కొందరు ద్వీతీయ, తృతీయ శ్రేణి అంతర్జాతీయ సినీ ప్రముఖుల చేత ఈ సినిమా గురించి ట్వీట్స్ వేయించుకున్నారు. వాటిని ఇక్కడి లోకల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. పెయిడ్ ప్రమోషన్ తో "ఆర్ ఆర్ ఆర్" కి ఇంటర్నేషనల్ బజ్ ఉందన్నది ఎష్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసారు. ఇదంతా దేనికంటే ఒకానొక కార్యానికి ప్లాట్ఫాం తయారు చేసుకోవడానికి. 

అదేంటంటే... ఆర్.ఆర్.ఆర్ ని భారతదేశం నుంచి ఆస్కార్ బరిలో నిలపాలని.... ఆల్రెడీ అంతర్జాతీయ బజ్ ఉంటే ఈ సినిమాని నామినేట్ చేస్తే అవార్డు దక్కించుకునే ఛాన్స్ ఉండొచ్చని మన దేశం అనుకుంటుందని... తద్వారా నామినేట్ అయ్యాక కుదిరినంత లాబీయింగ్ మరింత చేసుకోవచ్చని!!! ఒకవేళ అవార్డ్ రాకపోయినా "ఆస్కార్ కి నామినేట్ అయిన చిత్రం" గా ఒక శాశ్వత గుర్తింపుని ఖాతాలో వేసుకోవచ్చని..! 

కానీ ఆదిలోనే అభాసుపాలైనట్టు అసలు మన దేశం నుంచే ఈ చిత్రాన్ని ఆస్కార్ బరిలో లేకుండా చేసేసారు మనవాళ్లు. అసలెప్పుడొచ్చిందో ఏమిటో తెలియని ఒక గుజరాతి సినిమా "ఛెల్లో షా" ని ఆస్కార్ బరిలోకి దింపారు. ఆర్.ఆర్.ఆర్ ని పూర్తిగా విస్మరించారు. 

రాజమౌళి ప్రతిభగల దర్శకుడే...తెలివైన మార్కెటింగ్ డైరక్టరే. కానీ ఆర్.ఆర్.ఆర్ ని ఆస్కార్ బరిలోకి దింపాలనుకోవడం అవివేకం. ఎందుకంటే దీనికి ఆ స్థాయి లేదు. ఎందుకో చూద్దాం. 

ఎంతటి ఆస్కార్ అవార్డైనా అది ఇచ్చేది దేవతలు కాదు. మనలాంటి మనుషులే. ఎన్ని రూల్స్ గురించి చెప్పుకున్నా వాళ్లకీ జాతీయభావాలు, మనోభావాలు వగైరాలు ఉంటాయి. వారిలో అత్యధికులు తెల్లజాతీయులు. 1982లో "గాంధి"మీద ఆస్కార్ అవార్డుల వర్షం కురిసింది. దర్శకుడు అటెన్ బరో, కథానాయక పాత్ర పొషించిన బెన్ కింగ్స్లే తో కలుపుకుని ఆ సినిమాకి పనిచేసిన మొత్తం 18 మందికి వేరు వేరు విభాగాల్లో ఆస్కార్ అవార్డులిచ్చారు. వారిలో ఒక్క పండిట్ రవిశంకర్ (సంగీతం) తప్ప మిగిలిన 17 మంది తెల్లజాతీయులే. తెల్లవారిని విలన్స్ గా చూపించినా అది చరిత్ర కనుక, తీసిన వాడు చేసిన వాడూ కూడా తెల్లజాతీయులే కనుక అన్నేసి అవార్డులొచ్చాయి. రవిశంకర్ కి కూడా సంగీతం విభాగంలో జార్జ్ ఫెంటన్ తో కలిపి ఇచ్చారు. 

ఇక 2008 లో స్లం డాగ్ మిలియనీర్ కి 8 అకాడమీ అవార్డులొచ్చాయి. అందులో ఎ.ఆర్.రెహ్మాన్, రసూల్ పూకుట్టి భరతీయులు. మిగిలినవాళ్లంతా తెల్లవారే. ఆ సినిమా తీసింది కూడా తెల్లజాతీయుడే. 

వీటికి ముందు "మదర్ ఇండియా (1958)", "సలాం మోంబే (1989) ఇండియా నుంచి ఆస్కార్ బరిలో నిలబడ్డాయి. 2001 నాటి లగాన్ ఫైనల్ ఫైవ్ దాకా వెళ్లి వెనుతిరిగింది. వీటిలో వెటికీ ఆస్కార్ అవార్డులు రాలేదు. 

1929 నుంచి ఆస్కార్ అవార్డులివ్వడం మొదలుపెట్టారు. భారతీయ టాకీ యుగం 1931 లో "ఆలం అరా" నుంచి మొదలయ్యింది. ఈ 91 సంవత్సరాల సుదీర్ఘయానంలో ఏ భారతీయ చిత్రానికి ఒక్క ఆస్కార్ అవార్డు కూడా రాలేదు. 

1992లో మాత్రం గౌరవ ఆస్కార్ అవార్డుని అంపశయ్య మీద అవసాన దశలో ఉన్న సత్యజిత్ రే కి ఇచ్చారు. దానినే ఎంతో గొప్పగా రాసాయి అప్పటి పత్రికలు. 

ఈ చరిత్రంతా దేనికంటే అసలు భారతీయ సినిమాలు ఆస్కార్ బరిలో నిలబడాలంటే తీసినవాడు, చేసినవాడు, ఆడినవాడు తెల్లవాడై ఉండాలి. లేదా భారతదేశంలోని దుర్భర జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. ఉదాహరణకి "స్లం డాగ్ మిలియనీర్" లో కంపుగొట్టే ముంబాయి మురికివాడల్ని చూపించారు. అలా మన దేశం అసహ్యంగా కనిపిస్తేనే అక్కడి వారికి చాలా సహజంగా అనిపిస్తుంది. 

అంతే తప్ప తెల్లవారిని వెర్రివెంగళాయల్లా చూపిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని చెబుతూ "నెత్తురు మరిగితే ఎత్తర జెండా" అంటే ఆ జెండాని మడిచి ఎక్కడో పెట్టుకోమంటారు ఆస్కార్ వారు.

ఇక్కడ "వెర్రివెంగళాయలు" అని ఎందుకు అనాల్సొచ్చిందంటే..."కొండా ఉయ్యాలా.." అని పాట పాడుతో చేతి మీద రంగులతో ముగ్గులేసి ఒక చిన్నారిని తమ కోటలో పెట్టుకోవడం కోసం కొమరం భీముడితో యుద్ధం చేసి ఆంగ్లేయులు అంత సైన్యాన్ని పోగొట్టుకుంటారా? 

ఈ డౌటు మనకే కాదు ఈ సినిమా చూసే తెల్లవాళ్లకి కూడా వస్తుంది కదా. తమని కౄరంగా, విలన్లుగా చూపించిన దానికంటే ఇంత బుర్రలేని వాళ్లలా చూపించినందుకే చిరాకొస్తుంది. పైగా ఇది చరిత్రలో జరిగింది కాదు. పూర్తిగా అభూత కల్పన.

అసలిలాంటి సినిమాని ఆస్కార్ బరిలో పెట్టాలని రాజమౌళి చేసిన ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. 

ఇదంతా ఎందుకంటే రాజమౌళి తదుపరి చిత్రానికి హైప్ పెంచుకోవడం కోసమన్నారు కొందరు. అదేంటని వివరం అడిగితే, "ఆర్.ఆర్.ఆర్ రాజమౌళి ఇమేజ్ ను పెంచలేదు. కనీసం ఆస్కార్ ఇమేజ్ వస్తే దాన్ని అడ్డం పెట్టుకుని తదుపరి సినిమాని వేరే లెవెల్లో నిలబెట్టుకోవచ్చని" అన్నారు. 

ఇదే నిజమైతే ఇంతకంటే అమాయకత్వం మరొకటి లేదు. ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ వస్తే రాజమౌళి మీద గౌరవం పెరగడం కాదు...ఆస్కార్ ఇమేజ్ తగ్గుతుంది. 

మరొకరు చెప్పిందేంటంటే- "ఈ సినిమా మీద ఎన్.టి.ఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. రాం చరణ్ "ఆర్ ఆర్ ఆర్" తో పాటూ సమాంతరంగా "ఆచార్య" సినిమా, శంకర్ సినిమా చేసుకుంటుంటే ఎన్.టి.ఆర్ మాత్రం పూర్తిగా ఆర్.ఆర్.ఆర్ మీదే దృష్టి పెట్టాడు. ఆర్.ఆర్.ఆర్ దెబ్బకి తన స్థాయి ప్రభాస్ ని మించి అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందని, బాలీవుడ్ పరిశ్రమ తన ఇంటి ముందు లైన్లో నిలబడుతుందని ఆశించాడు. కానీ సినిమా విడుదలయ్యాక గుర్తింపు రాం చరణ్ కి వచ్చింది. ఎన్.టి.ఆర్ అభిమానులు తమ నిరాశని ఓపెన్ గానే ప్రదర్శించారు. దాంతో అతను డల్లైపోయాడు. అతనిని సముదాయించడానికి కొందరు "సొంతవాళ్లు" ఆస్కార్ బరిలో తన ప్రతిభని పెడతామని చెప్పి ఈ ప్రచారం మొదలుపెట్టారు. అంతర్జాతీయ మీడియాలో ఈ చిత్రాన్ని ప్రొమోట్ చేసిన చోటల్లా ఎన్.టి.ఆర్ ఫోటోల్నే వాడారు తప్ప రాం చరణ్ బి కాదు. ఇదంతా ఎన్.టి.ఆర్ మనసుకి తగిలిన గాయానికి ఆయింటిమెంటు రాస్తూ అవార్డు కోసం చేసిన ప్రయత్నం". 

ఇది వినడానికి నమ్మశక్యంగా ఉంది కానీ ఒక హీరోని ఊరట పరచడానికి మరీ ఇంత చెయ్యాలా అనిపిస్తుంది. ఏమో! ఎవరికి ఏ అవసరాలున్నాయో, ఎటువంటి ఎమోషనల్ లగేజులున్నాయో మనకి తెలియదు కదా! 

ఏది ఏమైనా కంగనా చేత రికమెండేషన్ చేయించుకుని రాజ్యసభ సీటు సంపాదించినంత తేలిక కాదు ఆస్కార్ బరిలో నిలబడి అవార్డు కొట్టేయడమంటే! 

అయినా ఎవడో ఆస్కారు వాడు మనల్ని గుర్తించడమేంటి? 

అల్లూరి ని హీరోగా పెట్టి సినిమా తీసి తెల్లవాడి అవార్డుకి వెంపర్లాడడమేంటి? 

కొమరం భీముడిని తెల్లవాడి పాత్ర చేత చితకబాదించి వాడి గుర్తింపు కోసం పాకులాడడమేంటి? 

ఆస్కార్ వాడు మనవైపు చూస్తే ఎంత చూడక పోతే ఎంత? అనుకుంటూ...అందని ద్రాక్ష పులుపని మొహం చిట్లించుకోవాలి కానీ ఎందుకొచ్చిన ఆస్కార్ ఉద్యమాలు చెప్పండి.  

రాజమౌళి గారూ! మీ మీద మాకు గౌరవం ఎప్పుడూ ఉంటుంది. మీరు తీసే తదుపరి చిత్రానికి ఆర్.ఆర్.ఆర్ ఏమీ అడ్డంకి కాదు. మీరు ఎన్ని సినిమాలు తీసిన ప్రేక్షకులు తండోపతండాలుగా సినిమా హాళ్లకొస్తారు. దయచేసి మీరు మాత్రం ఎవో కౌన్ కిస్కా అవార్డుల కోసం ప్రయత్నించకండి. 

మామటుకు మేము..."నాటు నాటు.." పాట పెట్టుకుని మన తెలుగుహీరోలు తెల్లవాడిని స్టెప్పులతో ఎలా ఆడుకుని వెర్రిపప్పని చేసారో చూసుకుని ఆనందిస్తాం. 

గుడ్లవల్లేటి వెంకటసుబ్రహ్మణ్యం

Show comments