పటాస్ సినిమా రానా చేస్తే..?

కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ పటాస్ సినిమా. పటాస్ కు ముందు కల్యాణ్ రామ్ కు అలాంటి సక్సెస్ లేదు. పటాస్ తర్వాత కూడా ఆ స్థాయి విజయం దక్కలేదు. అలాంటి హిట్ సినిమా రానాకు పడితే ఎలా ఉంటుంది..? ఇప్పటివరకు ఎవరూ ఊహించని కాంబినేషన్ ఇది. కానీ నిజానికి జరగాల్సింది అదే అంటున్నారు నిర్మాత సురేష్ బాబు.

"అరె.. ఈ సినిమా మిస్ అయిపోయిందే అనే ఫీలింగ్ నాకు ఇప్పటివరకు రాలేదు. ఒక్క పటాస్ విషయంలోనే అది జరిగింది. అనీల్ రావిపూడి, రానా కోసం తయారుచేసిన కథ అది. ఆ స్టోరీలో నేను కూడా ఇన్ వాల్వ్ అయ్యాను. కాకపోతే అప్పుడు రానా బాహుబలితో బిజీగా ఉన్నాడు. కాబట్టి పటాస్ లో చేయలేకపోయాడు."

అలా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రావాల్సిన పటాస్ సినిమా మిస్ అయిందని చెప్పుకొచ్చాడు రానా. పటాస్ కథలో తను చాలా మార్పులు-చేర్పులు చేశానని, ఇక అంతా ఓకే అనుకున్న టైమ్ లో బాహుబలి సినిమా షెడ్యూల్స్ మారిపోయాయని, ఊహించిన దానికంటే ఇంకాస్త ఎక్కువ టైమ్ బాహుబలికి పట్టడంతో పటాస్ ను వదులుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

రానా కెరీర్ లో ఇప్పటివరకు పటాస్ లాంటి ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ లేదు. నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలు హిట్ అయినప్పటికీ అందులో కూడా వినోదం పాళ్లు తక్కువే. మళ్లీ రానాకు పటాస్ లాంటి పోలీస్ క్యారెక్టర్ ఎప్పుడు దొరుకుతుందో..!

RELATED ఎమ్బీయస్‌: ఆర్‌బిఐ - ఆర్థికశాఖ రగడ - 1/2