జగన్ విశాఖ ఎందుకు రాలేదంటే... ?

అన్నీ సిద్ధమయ్యాయి. పైగా వైఎస్సార్ కుటుంబానికి నమ్మిన బంటు అయిన సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహం ఉంది. మరో వైపు అధికారిక కార్యక్రమాలు. చాలా ఉన్నాయి. జగన్ తప్పకుండా వస్తారు అని అంతా భావించారు. సీఎం టూర్ ఉన్న నేపధ్యంలో గత వారం రోజులుగా అటు అధికార వర్గాలు, ఇటు పార్టీ శ్రేణులు ఒక్క లెక్కన శ్రమించాయి.

ఇక చాలా కాలానికి జగన్ విశాఖ రానుండడంతో నగర వాసులలో కూడా ఆసక్తి కనిపించింది. జగన్ విశాఖలో ఏం మాట్లాడతారు, ఏ వరాలు ఇస్తారన్న చర్చ కూడా ఒక వైపు సాగుతోంది. ఈ నేపధ్యంలో సడెన్ గా ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయింది. అర్ధరాత్రి ఈ ప్రకటన వచ్చింది. ఎందుకు సీఎం టూర్ క్యాన్సిల్ అయిందో ఎవరికీ తెలియదు కానీ వైసీపీ శ్రేణులు మాత్రం బాగా డీలా పడ్డాయి.

మరి దొరికిందే చాన్స్ అన్నట్లుగా కొందరు తమ్ముళ్ళు మాత్రం బాగానే మాట్లాడుతున్నారు. లాజిక్ కి అందని మాటలను పేర్చుకుంటూ పోతున్నారు. జగన్ విశాఖ వస్తే తాము అడ్డుకుంటామనే భయపడి ఆయన చివరి నిముషంలో ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారని అంటున్నారు.

నిజానికి జగన్ కి ఆ అవసరం ఉందా, సీఎం టూర్ అంటే ఎంత బందోబస్తు ఉంటుందో ఎవరికి తెలియదు, నిజంగా జగన్ టీడీపీకి భయపడితే విపక్షంలో ఉన్నపుడు పద్నాలుగు నెలల పాటు పాదయాత్ర ఎలా చేస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. 

ఇపుడు ఆయన బలమైన నేత, పైగా ఏపీకి  సీఎం, ఆయన భయపడేది ఎవరికి అని వైసీపీ నేతలు రివర్స్ లో ఫైర్ అవుతున్నారు. విశాఖ టూర్ రద్దు కావడానికి తమ్ముళ్ల మాటలకు ఏమైనా లింక్ ఉందా అని వారు అంటున్నారు. మొత్తానికి జగన్ విశాఖ వచ్చినా రచ్చే, రాకపోయినా చర్చే. ఇదీ రాజకీయమంటే అని అనుకోవాలేమో.

Show comments