జగన్ మొండితనం 1: అసలెందుకు?

విద్యుత్తు పీపీఏలను సమీక్షించడం గురించి.. సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుగుదేశానికి ఏమాత్రం మింగుడుపడడం లేదు. ఇలాంటి రోజు వస్తుందని వారు ఊహించలేదేమో.. మింగలేక కక్కలేక మధనపడిపోతున్నారు. కేంద్రం కూడా దీన్ని వద్దన్నదని, జపాన్ రాయబారి కూడా వద్దని లేఖ రాశాడని.. చంద్రబాబునాయుడు ట్వీట్ల రూపంలో  ఆక్రోశిస్తున్నారు. పీపీఏల గొడవలో పరిణామాలు ఎలా ఉంటాయోననే భయంతో జగన్ ను జగమొండిగా అభివర్ణిస్తున్నారు. అవును తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోడానికి జగన్ మొండిగానే వ్యవహరిస్తున్నారన్న మాట నిజం.

గిరిజన తండాలు, ఎస్టీ కాలనీల్లోని గిరిజనులకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తాం అని జగన్ సర్కారు ప్రకటించింది. గతంలో ఏ ప్రభుత్వమూ కనీసం ఆలోచన కూడా చేయని గొప్ప సంక్షేమ పథకం ఇది. ఆ వర్గాలకు వరం వంటిది. అయితే, అసలే అటవీ, గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ నెలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దీనితో పాటు రైతులకు ఇవ్వవలసిన ఉచిత విద్యుత్తు భారం కూడా ఉండనే ఉంది.

మరొకవైపు చంద్రబాబునాయుడు అవినీతికి తలుపులు బార్లా తెరచి.. వందలకోట్ల స్వాహా ఆరోపణలు ఎదుర్కొంటూ... కుదుర్చుకున్న విద్యుత్తు ఒప్పందాల వల్ల.. యూనిట్ రేటు చాలా ఎక్కువగా ఉంటోంది. తమ ప్రభుత్వం గిరిజన సంక్షేమం.. ఇతర పథకాల దృష్ట్యా అదనపు భారం మోయాల్సి వస్తున్న నేపథ్యంలో.. కొనే విద్యుత్తు ధరను వీలైనంత తగ్గించుకోవడం శ్రేయస్కరం అనే ఆలోచనే జగన్ మోహన రెడ్డి సర్కారు చేస్తోంది. అందుకే.. వక్రమార్గాల్లో ఆకాశంలో కూర్చున్న విద్యుత్తు ధరలను, జుట్టుపట్టి కిందికి లాక్కు రావడానికి... పీపీఏల సమీక్షకు ఆదేశించింది.

జరిగిన అవినీతిని కట్టడి చేయడంతో పాటు, ఈ తరహా సంక్షేమ పథకాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే పీపీఏ ల సమీక్ష జరుగుతోందన్న మాట వాస్తవం. అయితే చంద్రబాబునాయుడు,  ఆయన తైనాతీలు మాత్రం దీనిని సహించలేకపోతున్నారు. ఆయన జపాన్ నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం లాగా.. అక్కడి రాయబారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాడంటూ.. గ్రేటాంధ్ర ఒక కథనం అందించింది. అది నిజమే అనిపించేలా.. ఆ లేఖను చంద్రబాబు బాగానే వాడుతున్నారు. విదేశాలు కూడా జోక్యం చేసుకుని జగన్ కు హితవు చెబుతున్నాయంటూ.. ట్వీట్లు పెడుతున్నారు. పీపీఏల సమీక్షలో అక్రమాలు నిగ్గు తేలితే, ఏం చేస్తారో చూడాలి!
జగన్ మొండితనం 2: భారం మోయడానికే!

Readmore!

Show comments