ఈ పని అప్పుడే చేసి ఉండొచ్చుగా..?

మొత్తానికి చంద్రబాబునాయుడు కాస్త మెత్తబడ్డారు. ధర్మాబాద్ కోర్టు తన పేరిట అరెస్టు వారంట్లు జారీచేసిన వ్యవహారాన్ని.. భాజపా తన మీద కక్ష కట్టడానికి ముడిపెట్టి ఎంతగా యాగీ చేసినప్పటికీ.. దానివలన పెద్దగా ఫలితం వస్తున్నట్లుగా ఆయనకు అనిపించినట్లు లేదు. ఇంకాస్త రచ్చ చేయడానికి వ్యూహరచనలో ఉన్నారో లేదా, ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నారో గానీ.. మొత్తానికి కాస్త మెత్తబడ్డారు.

కోర్టు వాయిదా నాటికి తన తరఫున న్యాయవాదిని పంపి.. అరెస్టు వారంటుపై రీకాల్ పిటిషన్ వేయించాలని నిర్ణయించారు. అయితే కోర్టులోని కేసు పట్ల ఈ మాత్రం స్పందన ఆనాడే ఉండి ఉంటే గనుక.. అసలు పరిస్థితి ఇంత దాకా వచ్చేదే కాదు కదా... అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబునాయుడు 2010లో బాబ్లీ ప్రాజెక్టు వద్ద నిరసనలు తెలియజేయడానికి వెళ్లారు.

అప్పుడే పోలీసులు అరెస్టు చేసి, తర్వాత విడుదల చేయడం జరిగింది. అప్పట్లోనే కోర్టుకేసు కూడా దాఖలైంది. అప్పటినుంచి పలుమార్లు నోటీసులు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఏ వాయిదాకు కూడా చంద్రబాబు గానీ, ఆయన అనుజులు గానీ హాజరుకాలేదు. కేవలం వీరు హాజరు కాకపోవడం వల్ల మాత్రమే.. పరిస్థితి అరెస్టు వారంట్ల దాకా వచ్చింది.

ఇవాళ ఆ వారంట్ల గురించి చేయగలిగినంత రచ్చ చేసిన తర్వాత.. తమ తరఫు న్యాయవాదిని పంపి వారంట్ పై రీకాల్ పిటిషన్ వేయించాలని చంద్రబాబు డిసైడ్ చేశారు. ఈ మాత్రం పని- అంటే కనీసం తమ తరఫున న్యాయవాదిని అయినా కోర్టుకు పంపడం వంటి పని గతంలోనే చేసి ఉంటే గనుక.. వారంట్లే వచ్చి ఉండేవి కాదని.. చంద్రబాబు లోపాన్ని తనవైపు పెట్టుకుని ఇతరులను నిందించడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు అంటున్నారు.

న్యాయవ్యవస్థ పట్ల గౌరవం లేని చంద్రబాబు, కనీసం వాయిదాలకు కూడా వెళ్లకుండా.. ఇప్పుడు వారంట్ రాగానే.. దానిని మోడీకి ముడిపెట్టే ప్రయత్నంచేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Show comments