చంద్రబాబు వైఎఎస్ జపం.. ఏంటి కథ..?

సహజంగానే తన ప్రసంగాల్లో ఎక్కడా ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు రాకుండా మేనేజ్ చేస్తుంటారు చంద్రబాబు. మరీ అవసరమైతే అలా ఒకటీ రెండు సార్లు వాడతారు కానీ, ఆయన పథకాలు కానీ, ఆయన పాలన గురించి కానీ బాబు పొగడటం చాలా అరుదు. తెలుగుదేశం వ్యవస్థాపకుడినే గుర్తుంచుకోని చంద్రబాబు.. ఇటీవల పదే పదే తన ప్రసంగాల్లో వైఎస్సార్ పేరు కలవరిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పాలనను పరోక్షంగా మెచ్చుకుంటున్నారు.

ఏదో ఒకటీ అరా అంటే సరే.. జిల్లాల పర్యటనలకు వెళ్తున్న చంద్రబాబు ప్రతిచోటా వైఎస్ పాలన గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసి చూపించేందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేసినా వైఎస్సార్ పాలన గురించి చంద్రబాబు మెచ్చుకోలుగా మాట్లాడ్డం మాత్రం టీడీపీ వీరాభిమానుల్ని విస్తుపోయేలే చేస్తోంది. విశాఖ, నెల్లూరు, తాజాగా శ్రీకాకుళంలో కూడా వైఎస్ పాలన గుర్తు చేసి మరీ జగన్ ని కించపరిచేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. తాను హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేస్తే తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి దాన్ని కొనసాగించారని, అందుకే అది ఇప్పుడు విశ్వనగరమైందని అంటున్నారు బాబు.

అమరావతిని కూడా అలాగే ప్రారంభించానని, ఇప్పుడు జగన్ దీనికి అడ్డు పడుతున్నారని విమర్శించారు. తండ్రిని చూసి నేర్చుకోవాలని కూడా జగన్ కి హితబోధ చేశారు బాబు. అసెంబ్లీలో తన సూచనలను రాజశేఖర్ రెడ్డి గౌరవించేవారని కూడా గతంలో జరిగిన సభలలో ప్రస్తావించారు బాబు. ఇలా.. వీలైనన్నిసార్లు వైఎస్ పాలన గుర్తుచేస్తూ జగన్ ని తక్కువ చేసేందుకు, జగన్ కి సుద్దులు చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో మాత్రం చంద్రబాబుపై విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికైనా వైఎస్ గొప్పతనాన్ని చంద్రబాబు తెలుసుకున్నారని, జగన్ ని కూడా చంద్రబాబు మెచ్చుకునే రోజు కచ్చితంగా వస్తుందని అంటున్నారు. 

జగన్ పై జేసీ కోపం.. రీజన్ అదే!

Show comments