బాల్‌ఠాక్రే హ‌త్య‌కి కుట్ర జ‌రిగిన‌పుడు!

1985లో శివ‌సేన ముంబయ్ కార్పొరేష‌న్‌లో మొద‌టిసారి గెలిచింది. బాల్‌ఠాక్రేకి సిటీపై వున్న ప‌ట్టు అంద‌రికీ తెలిసింది. 1988 నాటికి ఆయ‌న కింగ్. 84లో ఇందిర హ‌త్య త‌రువాత ఖ‌లిస్తాన్ ఉద్య‌మం పెరిగింది. ముంబ‌య్‌లో కూడా దాని ఉనికి మొద‌ల‌య్యింది.

మార్చి 18, 1988న ఠాక్రే ప్రెస్ కాన్ఫ‌రెన్స్ పెట్టాడు. ముంబ‌య్‌లోని సంప‌న్న సిక్కులు ఖ‌లిస్తాన్‌కి మ‌ద్ద‌తు ఇస్తే ఫ‌లితాలు తీవ్రంగా వుంటాయ‌ని హెచ్చ‌రించాడు. వాళ్ల‌ని సామాజికంగా, ఆర్థికంగా బ‌హిష్క‌రిస్తామ‌ని గ‌ర్జించాడు. 1989 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శివ‌సేన ఓడిపోయింది. కాంగ్రెస్ చేతిలోకి అధికారం. బాల్‌ఠాక్రేకి ఖ‌లిస్తాన్ నుంచే కాదు, అన్ని వైపులా ముప్పు పొంచి వుంది. బాంద్రాలోని ఠాక్రే ఇల్లు మాతోశ్రీ‌ని శివ‌సైనికులు కంటికి రెప్ప‌లా చూసుకుంటున్నారు.

ఒక‌రోజు సీఎం శ‌ర‌ద్‌ప‌వార్ నుంచి ఉద్ధ‌వ్‌ఠాక్రేకి ఫోన్‌. ఒంట‌రిగా వ‌చ్చి క‌ల‌వ‌మ‌ని. మాతోశ్రీ‌ని బాంబుల‌తో పేల్చి వేయ‌డానికి తీవ్ర వాదులు న‌గ‌రానికి వ‌చ్చిన‌ట్టు శ‌ర‌ద్ పవార్ చెప్పారు. చెప్పింది సాక్షాత్తూ సీఎం. న‌మ్మితీరాలి.

సీఎంగా తాను చేయాల్సింది చేస్తాన‌ని, అయితే శ‌త్రువులు ఎక్క‌డో కాదు శివ‌సేన, పోలీస్ ఫోర్స్‌లో కూడా ఉన్నార‌ని స‌మాచారం ఉంద‌ని ప‌వార్ చెప్పారు. కొద్ది రోజులు మాతోశ్రీ నుంచి దూరంగా వుండాల‌ని కోరారు.

ఉద్ధ‌వ్ విష‌యాన్ని బాల్‌ఠాక్రేకి చెప్పాడు. వెంట‌నే మాతోశ్రీ‌లో ఉన్న కుటుంబ స‌భ్యులంతా ఎవ‌రు ఎక్క‌డికి వెళుతున్నారో తెలియ‌నంత ర‌హ‌స్యంగా త‌ర‌లింపు జ‌రిగింది. ఉద‌యాన్నే బాల్‌ఠాక్రే, భార్య మీనాతాయితో క‌లిసి ముంబ‌య్ నుంచి పూనా దారిలోని లోనావాలాకి బ‌య‌ల్దేరారు. కొన్ని పోలీసు జీపులు, ఐదు మారుతీ వ్యాన్ల‌లో శివ‌సైనికులు. ముంబ‌య్ సిటీలో కొన్ని గంట‌లు వృథాగా తిరిగారు. ఎవ‌రైనా ఫాలో చేస్తూ వుంటే వాళ్ల‌ని త‌ప్పుదారి ప‌ట్టించేందుకు.

లోనావాలాలో రెండు పాత బంగ‌ళాలు. ఒక బంగ‌ళాలో బాల్‌ఠాక్రే, ఇంకో బంగ‌ళాలో పోలీస్ బ‌ల‌గాలు. అయితే పోలీసుల మీద లోప‌ల అనుమానం. ఆ రాత్రి బంగ‌ళా ముందు చ‌లి మంట‌కి వ‌ణుకుతూ నిద్ర‌పోకుండా కాప‌లా కాసిన వ్య‌క్తి నారాయ‌ణ్ రానే.

ఠాక్రే ఎవ‌రినీ న‌మ్మేవాడు కాదు. నారాయ‌ణ్ వ‌చ్చి అంతా ఓకే అంటేనే ఓకే. ఠాక్రే త‌న వెంట కేవ‌లం కొద్ది మంది అత్యంత న‌మ్మ‌క‌స్తులైన శివ‌సేన నాయ‌కుల్ని మాత్ర‌మే ఆ రోజు తీసుకెళ్లాడు. నారాయ‌ణ్ రానేకి ఠాక్రే ఏం చెప్పాడంటే ఎంత‌టి ప్ర‌మాదానికైనా సిద్ధంగా ఉండు.

అంత‌టి వీర విధేయుడు కూడా పార్టీని వ‌దిలి 2005లో వ‌చ్చేశాడు. పార్టీ కోసం దేన్నైనా త్యాగం చేయాల‌నే బాల్‌ఠాక్రే పుత్ర ప్రేమ‌ని వ‌దుకోలేక పోయాడు. ఇపుడు సేమ్ సీన్‌. ఉద్ధ‌వ్ పుత్ర ప్రేమ‌ని భ‌రించ‌లేక ఏక్‌నాథ్ షిండే పార్టీ నుంచి బ‌య‌టికెళ్లాడు.( ఈ వ్యాసం నారాయ‌ణ్ రానే ఆత్మ‌క‌థ NO HOLDS BARRED ఆధారం)

జీఆర్ మ‌హ‌ర్షి

Show comments