ఎమ్బీయస్‌: మనం ఎప్పుడు స్పందిస్తాం?

కేరళ వరదల సందర్భంగా విరాళాలు కూడా వరదలాగే వెల్లువెత్తుతున్నాయి. మన దేశంలోని యితర రాష్ట్రప్రజలే కాదు, ఎన్నారైలే కాదు, దుబాయి ప్రభుత్వం సైతం ముందుకు వచ్చింది. అది తీసుకోకపోవడానికి మన కారణాలు మనకు ఉండవచ్చు. కానీ గమనించవలసిన దేమిటంటే పరాయిదేశాన్ని కూడా కదలించింది అక్కడి విషాదం! విరాళాలు యిచ్చే దాతల్లో అనేకమందికి కేరళతో లావాదేవీలు లేవు, బంధువులు లేరు. కొంతమంది ఆ రాష్ట్రాన్ని చూసి ఉండకపోవచ్చు కూడా. అయినా స్పందిస్తున్నారంటే మానవత్వమే కారణం. చాలామంది డబ్బు యిస్తున్నారు, సరుకులు సేకరించి పంపుతున్నారు, కొందరు వాలంటీర్లుగా వెళ్లి సేవలందిస్తున్నారు. ఇదంతా మెచ్చుకోదగ్గది. ఈ మానవీయత కలకాలం ఉండాలి. ఇరుగుపొరుగు వారిపై కూడా ఉండాలి.

ఇటీవల సెల్‌ఫోన్లలో ఫోటోలు తీసే పిచ్చి ముదిరిన తర్వాత, ఏదైనా అఘాయిత్యం జరిగినా, ప్రమాదం జరిగినా సాయపడడం మానేసి, బాధితులను వీడియో తీస్తూ వాట్సాప్‌లలో పంపించే జనాభా పెరుగుతున్నారని విన్నప్పుడు మానవత్వానికి నూకలు చెల్లాయని భయం వేస్తూంటుంది. ఈ కేరళ ఉదంతంలో స్పందన చూసి, 'అమ్మయ్య, ఫర్వాలేదు, మానవత్వం బతికే ఉంది' అని భరోసా కలుగుతుంది. అయితే మనలోని స్పందించే హార్మోన్లు  యిలాటి విపత్తు వచ్చాక మాత్రమే పనిచేస్తున్నాయా అన్న సందేహం కలుగుతూంటుంది. ఇప్పుడీ కేరళ వరదలే ఉన్నాయి, యివి యీ వరదలు మనకు తెలిసున్న పాఠాన్నే మరోసారి చెప్పాయి. బడుద్ధాయి విద్యార్థుల్లా మనం పాఠాలు నేర్చుకోవడం లేదు. మొద్దు పిల్లాడిపై బెత్తం ప్రయోగించే ఉపాధ్యాయుళ్లా ప్రకృతి మధ్యమధ్యలో వీపు బద్దలు కొడుతోంది.

వరదలు వచ్చాక రిలీఫ్‌ ఆపరేషన్స్‌ ఎక్సలెంట్‌గా నడుస్తున్నాయి. నీటి మధ్య పుట్టి, నీటిలోనే పెరిగే కేరళీయులు యీ ఉపద్రవాన్ని మొక్కవోని ధైర్యంతో ఎదుర్కుంటున్నారు. అతి త్వరలో తమ రాష్ట్రాన్ని సాధారణ పరిస్థితికి తీసుకుని రాగల మొనగాళ్లు, ధైర్యవంతులు, కష్టజీవులు వాళ్లు. ఇదంతా ఒక యెత్తు కాగా, అసలెందుకు యీ వరదలు యింత నష్టాన్ని కలిగించగలిగాయి అన్నది మొదటి ప్రశ్న. నదులు, చెరువులు, కాలువలు, బ్యాక్‌వాటర్స్‌ల నెట్‌వర్క్‌ విస్తారంగా ఉండి, వాటర్‌ ట్రాన్స్‌పోర్టును కూడా నిర్వహిస్తూ, డ్రైనేజితో సహా యితరత్రా కూడా ఎడ్మినిస్ట్రేటివ్‌ పరామీటర్స్‌ ఎంతో ఉన్నతంగా ఉందని పేరుబడిన కేరళదే యీ గతి ఐతే యిలాటి దుస్థితి తక్కిన రాష్ట్రాలకు పడితే వాటి గతి ఏమిటన్నది మరో  ప్రశ్న.

ఈ విపత్తులో ప్రకృతి పాలెంత, మానవ తప్పిదాల పాలెంత అన్నది నిర్ధారించేందుకు ముందు గుర్తించవలసిన వాస్తవాలు - గత శతాబ్ద కాలంలో కనీ విని ఎరుగని పెను ఉత్పాతమిది. సాధారణ వర్షపాతం కంటె సుమారు 30% ఎక్కువ వర్షపాతం పడింది. జూన్‌ 1 నుంచి ఆగస్టు 15 లోపున 2088 మి.మీ.ల వర్షం పడింది. మొత్తం 14 జిల్లాల్లో 13 వరద నీటిలో తేలాయి. 2.5 లక్షల కంటె ఎక్కువమందిని తరలించవలసి వచ్చింది. రమారమి 400 మంది చనిపోయారు, చాలామంది జాడ  తెలియదు. ఇక మానవ తప్పిదాలకు వస్తే - బెంగుళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ కితం ఏడాది నివేదిక ప్రకారం కేరళలో 1973-2016 కాలంలో 9 లక్షల హెక్టార్ల అడవులు నాశనమయ్యాయి.

నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజన్సీ, ఇస్రో కలిసి చేసిన అధ్యయనంలో గత 90 ఏళ్లలో పడమటి కనుమలపై ఉన్న దాదాపు 34 వేల చ.కి.మీ.ల ప్రాంతంలో (అంటే మొత్తం ప్రాంతంలో 35%) అడవులు ధ్వంసమయ్యాయి.  ఆనకట్టల నిర్మాణానికి, యితర అవసరాలకు అడవులను యధేచ్ఛగా నాశనం చేస్తున్నారు. దీనికి తోడు అర్బనైజేషన్‌తో సహా అనేక పరిస్థితులు వర్షపాతపు ధోరణులను మార్చేశాయి. మాధవ్‌ గాడ్గీళ్‌ నేతృత్వాన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ (డబ్ల్యుజిఈఈపి) 2011లో ప్రభుత్వానికి యిచ్చిన 522 పేజీల నివేదిక పశ్చిమ కనుమలు మొత్తాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా (ఈఎస్‌ఏ) ప్రకటించమంది. మొత్తం 1.40 లక్షల కి.మీ.ల ప్రాంతాన్ని మూడు ఎకలాజికల్లీ సెన్సిటివ్‌ జోన్స్‌ (ఈఎస్‌జెడ్‌) గా విభజించింది. ఈఎస్‌జెడ్‌-1లో విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, గనుల తవ్వకం, క్వారీల తవ్వకం నియంత్రించాలి. భారీగా నీటిని నిలువ చేసే ఆనకట్టలు కట్టకూడదు అని చెప్పింది.

కేరళలోని అత్తిరప్పిలి, కర్ణాటకలోని గుండియా జలవిద్యుత్‌ ప్రాజెక్టులు ఆ జోన్‌-1లోకే వస్తాయిట. నివేదిక చేతికి వచ్చాక కేరళ ప్రభుత్వం 'ఇది పర్యావరణవేత్తల కోసం తయారైన నివేదిక కానీ అభివృద్ధికి, ఆర్థిక అభ్యున్నతకు దోహదపడదు.' అంటూ పక్కన పడేసింది. దాని సూచనలను అమలు చేయలేదు. కేంద్రం నివేదిక అమలులో సాధ్యాసాధ్యాలు పరిశీలించమంటూ కస్తూరీ రంగన్‌ కమిటీని వేస్తే అది 2013లో నివేదిక యిస్తూ పడమటి కనుమలు మొత్తం కాకపోయినా 37% ప్రాంతాన్ని ఈఎస్‌ఏగా ప్రకటించమని చెప్పింది. కానీ అదీ జరగలేదు. ఇప్పుడు కేరళకు నష్టం ఏ మేరకు కలిగిందో అంకెలు తేలితే ఎన్నేళ్ల ఆర్థికాభివృద్ధి తుడిచిపెట్టుకు పోయిందో తెలుస్తుంది. కర్మకాలి త్వరలో గోవా కూడా చేరితే ఆ అంకె యింకా పెరుగుతుంది.

కొండ ప్రాంతాలను ఎలా కాపాడుకోవాలో గాడ్గీళ్‌ కమిటీ చెప్పిన మాటలు ఎవరూ వినలేదు. క్వారీయింగ్‌ అనుమతించ వద్దని చెప్పినా బేఖాతరు చేశారు. కేరళ ఫారెస్టు రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ చేసిన అధ్యయనంలో చిన్నా, పెద్దా క్వారీలు 5924 ఉన్నాయట. ఇవి కాక కొండప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న యూనిట్లు 1500కు పైగా ఉన్నాయట. ఈ తవ్వకాల వలన మట్టి కదిలిపోయి, డొల్లగా మారి కొండ చరియలు విరిగి పడ్డాయి. తాగునీటి కొరత ఉందని కొన్ని చోట్ల కొండలు దొలిచి చెఱువులు చేశారట. దాంతోటి రాళ్లు కదిలిపోయాయి. టూరిజం పేరుతో అనేక కొండలను తొలిచి రిసార్టులు, రెస్టారెంట్లు వెలిశాయి. కొండలు విరిగి పడడంతో జననష్టం పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అటవీ భూములలో చెట్లను నరికేసి, ఎడాపెడా భవంతులు నిర్మించారు.

ఇప్పుడు తీవ్రంగా ప్రభావితమైన ఇడుక్కి జిల్లాలో 2011-16 మధ్య 20% అడవులు, మరో ప్రభావిత జిల్లా ఐన వాయనాడ్‌లో 11% అడవులు నాశనమయ్యాయి. అడవులు నాశనం కావడంతో మట్టి కొట్టుకుని పోయి డ్యామ్‌ రిజర్వాయర్లలో నిలిచిపోయింది. అక్కడ సిల్టింగ్‌ ఏర్పడడంతో డ్యామ్‌ స్టోరేజి లెవెల్‌ 22% వరకు తగ్గిపోయింది. నదీ గర్భాన్ని తవ్వుతూ యిళ్లు కట్టడంతో నీరు జనావాసాలలోకి వచ్చేసింది. వాటర్‌ జోన్లలో కూడా స్కై రైజ్‌ బిల్డింగులు రావడంతో పై నుంచి వస్తున్న ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం అసాధ్యమైంది. నదులపై జలవిద్యుత్‌ కేంద్రాలు నిర్మించడంతో వరదనీరు వేగంగా కిందికి వెళ్లలేక పోయింది. మొత్తంగా 14 జలవిద్యుత్‌ కేంద్రాలుంటే వేటిలోనూ సరైన ప్రమాణాలు పాటించలేదట.

ఇవన్నీ యివాళే మనకు తెలిసినవి కావు. పేపర్లో అప్పుడప్పుడు వార్తల్లా వస్తూనే ఉంటాయి. గాడ్గీళ్‌ నివేదిక అమలు చేయాలని కొందరు ఉద్యమకారులు నిరసన ప్రదర్శన చేశారని, వాళ్లను పోలీసులు చావగొట్టారని, ఎవరో కోర్టుకి వెళ్లి 'పిల్‌' వేశారనీ, ప్రభుత్వం కడుతున్న నిర్మాణాలు ఆపమని హైకోర్టు తీర్పు యిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లి ఆ తీర్పుపై స్టే తెచ్చుకుందని... యిలా చదువుతూనే ఉంటాం. ఫలానా రాష్ట్రంలో ఫలానా ప్రాజెక్టు కారణంగా అనేకమంది నిర్వాసితులయ్యారనీ, వాళ్లకు యిస్తానన్న భూమి యివ్వలేదని, కల్పిస్తానన్న ఉపాధి కల్పించలేదని, వాగ్దానం చేసిన పరిహారం యివ్వలేదని, పరిహారం యిచ్చిన సందర్భాల్లో కూడా నగదు యివ్వకుండా బాండ్లు యిచ్చారని, ఆకలి బాధలకు తట్టుకోలేక వారు యితర ప్రాంతాలకు వలస పోతున్నారనీ, ప్రాజెక్టు కారణంగా ఉన్న గూడు కూడా పోయిందని వారు వాపోయారనీ... యిలా అనేక సార్లు, అనేక రాష్ట్రాలలో జరిగే వాటి గురించి మనం పేపర్లో చదివి పక్కన పడేస్తాం. టీవీలో ఛానెల్‌ మార్చేస్తాం. మనం అప్పుడే ఎందుకు స్పందించటం లేదు అనేది తరచి చూసుకోవాలి.

వరదలు, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ప్రజలకు కొంపాగూడూ పోతేనే మనం డబ్బు పంపాలా? ప్రాజెక్టు కడుతున్నామనీ, సెజ్‌ కడుతున్నామనీ, మహానగరం కడుతున్నామనీ చెప్పి స్థలాలు లాక్కునే మానవ దౌష్ట్యాల చేత గూడు పోగొట్టుకున్నప్పుడు పంపకూడదా? మనమంతా కలిసి ఏదో చోట కొన్ని ఎకరాలు కొని, పోనీ మీరంతా వచ్చి యిక్కడ నివాసముండండి అనవచ్చుగా! 'మీరు స్థలాలిస్తే ఫ్యాక్టరీ కడతాం, మీ అందరికీ ఉద్యోగాలిస్తాం' అని ఏ ప్రైవేటు సంస్థో, ప్రైవేటు సంస్థతో భాగస్వామ్యం తీసుకున్న ప్రభుత్వమో గిరిజనులకు ఆశ చూపుతుంది. స్థలాలిస్తారు, ఫ్యాక్టరీ వెలుస్తుంది. బయటివాళ్లను పిలిపించి ఉద్యోగాలిస్తారు. అదేమిటంటే మీకు నైపుణ్యం లేదు, మమ్మల్నేం చేయమంటారు? అంటారు. తర్ఫీదు సంస్థ ఏదైనా పెట్టి వాళ్ల  నైపుణ్యం పెరగడానికి మనం ఎందుకు విరాళాలు పంపం? ఆ సంస్థేదో మనమే పెట్టాలన్న ఆలోచన ఎందుకు చేయం?

ఫ్యాక్టరీలు పెడతారు, అవి వదిలే వ్యర్థాల వలన వాతావరణ కాలుష్యం జరగకుండా ట్రీటుమెంటు ప్లాంట్లు పెట్టాలని, పొగ గొట్టాలు ఎత్తుగా ఉండాలని యిలాటివి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెడుతుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం అలాటివి ఏదీ చేయదు, అంతకంటె తనిఖీకి వచ్చిన అధికారులకు లంచాలిచ్చుకుంటూ పోతే చౌకలో పోతుంది కదాని వాళ్ల ఆలోచన. మా సూచనలు అమలు చేయడానికి వాళ్లు కొంత గడువు  అడిగారు, యిచ్చాం అని అధికారులు రాసుకుంటారు. అమలు చేసేదాకా ఫ్యాక్టరీ నడవకూడదు అని మాత్రం అనరు. ఇలా చెప్తూ ఏళ్లూ, పూళ్లూ గడిపేస్తారు. పరిసర ప్రాంతాల్లో బీదసాదలకు ఆరోగ్యాలు చెడిపోతాయి. వాళ్లు మందులకు ఖర్చులు పెట్టుకుని, పెట్టుకుని విసిగి, ఓ నాడు ఎవరో కొంతమంది పోగడి, ఫ్యాక్టరీ ఎదుట ప్రదర్శన చేస్తారు. పోలీసులు కేసులు పెట్టి వాళ్లను కోర్టుల చుట్టూ తిప్పుతారు. లాయర్లను పెట్టుకునే స్తోమత కూడా వాళ్ల కుండదు. వాళ్లకు ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనే మనకురాదు.

అంతెందుకు యీ మధ్య ట్యుటికొరిన్‌లో వేదాంతా వారి స్టెరిలైట్‌ ప్లాంటు గురించి పెద్ద ఆందోళన జరిగింది. పోలీసు కాల్పులు జరిగాయి. కొంతమంది చచ్చిపోయారు. అయ్యోపాపం అనుకుని ఊరుకున్నాం తప్ప వెళ్లి ఉద్యమంలో పాల్గొన్నామా? ఉద్యమకారులకు డబ్బు పంపామా? కాల్పుల్లో చచ్చిపోయినవాళ్లకు డబ్బులు పంపామా? కేసులు పోరాడడానికి వాళ్లకు వకీళ్లను ఏర్పాటు చేశామా? ఫలానా నదిపై ప్రాజెక్టు కడితే యిన్ని ఊళ్లు మునుగుతాయి అంటూ మేధా పాట్కర్‌ లాటి వాళ్లు దీక్షకు దిగగానే 'ఈ సోకాల్డ్‌ మేధావులకు, లెఫ్టిస్టులకు (అదేమిటో రైటిస్టులు వీటిలోకి దిగరు) వేరే పనే లేదురా బాబూ' అని విసుక్కుని పేజీ తిప్పేస్తాం. వాళ్ల వాదనలో ఒక్కోప్పుడు అతి ఉందని మనకూ తోస్తుంది. పోనీ కొంతమేరకైనా వాళ్లకు సాయం చేసి, వాళ్లతో పాటు చర్చలకు కూర్చుని యిరుపక్షాలూ కొంత మేరకు దిగివచ్చేలా ప్రయత్నం చేయాలని మాత్రం ఎప్పుడూ తోచదు.

ఏదైనా రాజకీయ పార్టీ ఉద్యమం చేపడితే యీ ప్రాజెక్టులు ఆగాలేమో కానీ, సాధారణ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమూ, ఏ మీడియా యిలాటి పర్యావరణ ఉద్యమాలకు మద్దతు యివ్వదు, సంతకాలు సేకరించదు, నిధులు సేకరించదు, మనం నిధులిస్తే మన ఫోటోలు వేయదు. ఓ రోజు జీతం సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు పంపమని సలహా యివ్వదు. ఎందుకంటే అలా చేస్తే ఆ ప్రాజెక్టు చేయపట్టిన ప్రభుత్వాన్నో, ప్రయివేటు సంస్థనో తప్పుపట్టాలి. వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్లు తోచగానే వీళ్లకు యాడ్స్‌ ఆపేస్తారు. అందువలన 'ఈ ప్రాజెక్టు వలన యింత నష్టం కలుగుతుంది అని ఉద్యమకారుడు ఫలానా అన్నారు' అనే వార్త లోపలి పేజీల్లో వేసి ఊరుకుంటారు. మహా అయితే ఆ ఉద్యమకారుడి వ్యాసం ఒకటి వేస్తారు, మర్నాడే దానికి కౌంటరుగా పాలకపక్షం వారి పిఆర్‌ఓ రాసిన వ్యాసం కూడా వేసేసి చేతులు దులిపేసుకుంటారు. ఇదిగో యిలాటి విపత్తు వచ్చాక మాత్రం మీడియా కూడా చెలరేగి విరాళాలు వసూలు చేస్తుంది.

ప్రభుత్వం విరాళాలకు ఐటి కన్సెషన్లు యిస్తుంది. ఎందుకు? వీటిల్లో ప్రకృతిని, దేవుణ్ని (యాక్డ్‌ ఆఫ్‌ గాడ్‌ అంటారుగా) విలన్‌గా చూపవచ్చు. నిజంగా ప్రకృతి విలనా? దాన్ని మనం ధ్వంసం చేస్తున్నాం. అందువలన అది తన సహజస్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ధ్వంసం చేసేవారికి వ్యతిరేకంగా ఉద్యమం చేసేవారికి నిధులు యివ్వాలని మనకు తోచదు. 'అలాటి సంస్థలు ఏవైనా ఉన్నాయని తెలియదు, తెలిస్తే యిద్దుము' అని కొందరనవచ్చు. వాటికి యాడ్స్‌ యిచ్చే స్తోమత ఉండదు కాబట్టి, వాళ్లు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి మీడియా వాటికి ప్రచారం కల్పించదు. మనమే వెతుక్కోవాలి. జేబురుమాలు కొనాలంటే గంటసేపు 'గూగులించే' మనకు దీని విషయంలోనూ కాస్త ఓపిక ఉండాలిగా! ఈ విలయం కేరళతో ఆగుతోందా? గోవా కూడా అక్రమ మైనింగులో ఆరితేరింది కాబట్టి, అక్కడా ముప్పు తప్పదంటున్నారు గాడ్గీళ్‌.

ఉత్తరాఖండ్‌లో గతంలో వరదలు వచ్చాయి. కారణాలు ఏమిటో పోస్టు మార్టెమ్‌లో తెలిసాయి. ప్రభుత్వాలు వాటిని సవరించాయా? సవరించడానికి ప్రజల నుంచి విరాళాలు అడిగాయా? అక్రమ నిర్మాణాలు తొలగించారా? ఇంకా ఎక్కువ జరిగాయా? స్థానికులు ఎవరైనా వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారా? వారికి ఆర్థిక, హార్దిక సహాయం కావాలా? - ఇవేవీ మనం పట్టించుకోం. ఈ ఏడాది మళ్లీ ఉత్తరాఖండ్‌ అస్తవ్యస్తమైంది. ఎందరో చిక్కుకుపోయారు. అప్పుడు మనం విరాళాలు పంపించి, వాళ్లు యిళ్లు చేరే ఏర్పాటు చేస్తాం. వాటి సంగతి సరే, మన అమరావతి ఉంది. రాజధాని కట్టాలని బాబు ప్రభుత్వం నిధులు అడిగింది, ఆంధ్రజ్యోతీ అడిగింది, ప్రభుత్వం యిటికలు అమ్మింది. అన్నిటికీ డబ్బులిచ్చాం, బాగానే ఉంది. కానీ అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో పర్యావరణం నాశనమవుతోంది. 'అక్కడ భూకంపం వచ్చే ప్రమాదం ఉంది,

నదీగర్భంలో నివాసాలు కడుతున్నారు, వరదలు వచ్చే ప్రమాదం ఉంది. మెత్తటి నేల ఉండే చోట బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఖర్చు పైగా రిస్కు. అంతకంటె పలనాడులో కడితే గట్టి నేల కదా. ఒకే చోటకి లక్షలాది జనాలను సమీకరించి, రిస్కు పెంచేబదులు, ప్రభుత్వ సంస్థలను వివిధ జిల్లాలకు వికేంద్రీకరణ చేసి, ఒకే చోట జనం పోగడకుండా చూడండి.' అని కొందరంటూంటే మనం వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నామా? నిధులిస్తున్నామా? భూములివ్వడానికి నిరాకరించిన రైతులతో భుజం కలుపుతున్నామా? ప్రభుత్వం వీళ్లందరినీ అభివృద్ధి నిరోధకులు, ప్రతిపక్ష సమర్థకులు అంటుంది. కేరళ ప్రభుత్వం కూడా గాడ్గీళ్‌ కమిటీ నివేదికను అలాగే అంది. ఇప్పుడు వరద బాధితులకై విరాళాలు అడుగుతోంది. రేపు ఆంధ్ర ప్రభుత్వమూ అదే చేస్తుంది అంటే అది అపశకునం పలికినట్లా? భవిష్యద్వాణా?

'ఆ నిపుణుల నివేదికలు పరిశీలించడం, తగు చర్యలు తీసుకోవడం, కాలుష్యాన్ని నివారించడం.. యివన్నీ ప్రభుత్వం చేయవలసిన పనులు, మనమెందుకు చెయ్యాలి?' అని మన నిష్క్రియాత్వాన్ని సమర్థించుకోవడం తప్పు. ఆ మాట కొస్తే వరదబాధితులను ఆదుకోవడం  మన బాధ్యతా? అదీ ప్రభుత్వందే! మనం పన్నులు కట్టడం లేదా? రేపు కేరళ వరద సెస్సు అని వేస్తే అదీ చచ్చినట్లు కడతాంగా! మరి యిప్పుడు మనం ఎందుకు డబ్బు యిస్తున్నాం? ఎందుకు వాలంటీర్లగా వెళుతున్నాం? అంటే ఎవడైనా సర్వనాశనం అయ్యేవరకూ మనం స్పందించమా? కాలువలోకి నీళ్లు బాగా వచ్చిపడ్డాయి. ఎవడో పిల్లవాడు దానిలో పడ్డాడు. వాణ్ని కాపాడినవాడికి మనం ప్రశంసలు కురిపిస్తాం, అవార్డులిస్తాం. ఆ కాలువలో నీళ్లు అధికంగా రాకుండా ముందుచూపుతో ఎవరైనా ఎగువ లాకులు ఏర్పాటు చేశారనుకోండి. అతణ్ని మనం గుర్తించనే గుర్తించం. చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి ముందుచూపు కొరవడి, విపత్తులు వస్తున్నాయని హెచ్చరించే చైతన్యవంతులు, ఉద్యమకారులను కూడా మనం గుర్తించం. ఓ నాలుగు రోజులు సెలవు పెట్టి వాళ్లు ఉద్యమం చేసే చోటికి వెళ్లి అక్కడి ప్రజలను జాగృతం చేసే ప్రయత్నం చేయం.

'అబ్బే, వాటికి టైమెక్కడుందండీ? ఫర్‌ మీ టైమ్‌ యీజ్‌ మనీ' అంటాం. అలా కూడబెట్టిన డబ్బును యీరోజు ఉదారంగా యిస్తున్నామే! గతానుభవాల దృష్ట్యా, దీనిలో సగానికి సగం దురుపయోగం అవుతుంది అని అనుకుంటూనే అందరం పంపుతున్నాం. 'మనం మంచి మనసుతో పంపాం, దీన్ని తినేస్తే ఆ పాపం వాడిదే. పైన దేవుడున్నాడు' అని మనకు మనమే సర్దిచెప్పుకుంటాం. ఎందుకంటే యిప్పుడు వచ్చిపడుతున్న ఉధృతంలో మనం అజాపజా అడిగితే జవాబు చెప్పే తీరిక ఎవరికీ ఉండదు. సాధారణ పరిస్థితుల్లో మనం ఖర్చు పెట్టే టైము కానీ, డబ్బు కానీ ఎలా వ్యయమౌతోందో చూసే వీలుంటుంది. కానీ అప్పుడు స్పందించం, యిప్పుడు మాత్రం ఊహూ స్పందిస్తాం. ఎందుకో గట్టిగా ఆలోచిద్దాం.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
mbsprasad@gmail.com

Show comments