వ్యతిరేకత బయటపడుతుందా.. సర్దుకుపోతారా..?

వైసీపీలో ఎప్పుడూ ఎక్కడా వ్యతిరేకత అనేది బయటకు రాలేదు, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో తొలిసారిగా అది బయటపడింది. వెంటనే సర్దుబాటు చేసినా, ఎక్కడో ఏదో చిన్న అనుమానం. పైకి సర్దుబాటు చేసుకున్నట్టు కనిపించినా మనసులో వారికి బాధ ఉండే ఉంటుంది. 

అలా బాధలో ఉన్న మాజీలందరికీ ఇటీవల పార్టీ పదవులిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా, ఇన్ చార్జ్ లుగా నియమించారు. ఆ తర్వాత ఇప్పుడు అందర్నీ కలిపి మీటింగ్ పెడుతున్నారు. ఈనెల 27న తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సాయంత్రం మూడున్నర గంటలకు ఈ భేటీకి మహూర్తం. మరి ఈ సమావేశంలో ఏం జరుగుతుంది. మిగిలిపోయిన వ్యతిరేకత బయటపడుతుందా లేదా అంతా కలిసే ఉన్నామన్న సంకేతం బయటకు వెళ్తుందా..?

మీటింగ్ ఎందుకు..?

ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే టైమ్ ఉంది. ప్రతిపక్షాలు బలం పుంజుకుంటున్నాయన్న అనుమానం లేదు కానీ.. ప్రభుత్వం తరపున చేసిన దాన్ని చెప్పుకోడానికి మాత్రం ఈమాత్రం సమయం కావాలి. హామీ ఇచ్చినవి, ఇవ్వనివి.. అన్నిటినీ నెరవేర్చారు జగన్, వాటిని జనంలోకి తీసుకెళ్లాలంటూ ఇటీవలే వైసీఎల్పీ మీటింగ్ లో హితబోధ చేశారు. 

ప్రజల్లోకి ఎమ్మెల్యేలు వెళ్లే ఆ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుల బాధ్యత ఎంతవరకు, వారిపై పార్టీ ఇన్ చార్జ్ ల బాధ్యత ఏంటి..? వీరితో జిల్లా ఇన్ చార్జి మంత్రులు ఎలా సమన్వయం చేసుకోవాలి అనే విషయంపై మీటింగ్ పెడుతున్నారు జగన్. వచ్చే ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలని హితబోధ చేయబోతున్నారు.

మంత్రి పదవులు కోల్పోయినవారికి జిల్లా ఇన్ చార్జ్ లుగా పదవులిచ్చినా వారంతా లోలోపల మథనపడుతున్నారనే సమాచారం ఉంది. ఇప్పుడంతా ఒకేచోట చేరబోతున్నారు. మరి ఈ టైమ్ లో అసంతృప్తి బయటపడుతుందా. పోనీ ఈ మీటింగ్ కు రాకుండా ఎవరైనా డుమ్మా కొడితే, వారు అసంతృప్తితో రగిలిపోతున్నట్టేనా..? కానీ ఇలాంటివన్నీ ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు పార్టీ నేతలు.

జగన్ ఉన్నంతవరకు పార్టీలో వ్యతిరేకత అనేది ఉండదని చెబుతున్నారు. జగన్ అందరివాడు అని, పదవులు రానివారంతా ఇప్పటికే జగన్ కు జై కొట్టేశారని, ఇకపై అలాంటి అసంతృప్తి బయటపడే అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తమ్మీద ఈనెల 27న జరిగే మీటింగ్ లో ఎలాంటి సంచలనాలు జరగకపోయినా.. రాబోయే ఎన్నికలకు మాత్రం అది జగన్ పూరించే శంఖారావంగానే భావించాల్సి ఉంటుంది. 

Show comments