పవన్ కల్యాణ్ కి దారేది..?

చంద్రబాబు, జగన్.. గెలుపోటములు వీరికి కొత్త కావు. రేపు ఫలితాలు ఎలా ఉన్నా, ఎవరు అధికారంలోకి వచ్చినా ఇద్దరూ రాజకీయాల్లోనే ఉంటారు. ప్రస్తుతానికి వార్ వన్ సైడ్ అని తేలిందనుకోండి, అది వేరే సంగతి. కానీ పవన్ కల్యాణ్ పరిస్థితి వేరు. ఇప్పటికే సీజనల్ పొలిటీషియన్ గా పేరుంది. ప్రజారాజ్యం టైమ్ లోనూ అదే జరిగింది. 2014 ఎన్నికల టైమ్ లో కూడా ఇలా వచ్చి అలా వెళ్లారు. మరిప్పుడు ఆయనేం చేయాలి.

స్వయానా తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి తీసికట్టుగా ఉందని అంచనా. పవన్ ఏకంగా మూడో స్థానానికి పరిమితమవుతాడని అందరూ అంటున్నారు. సింగిల్ సీట్ దక్కినా జనసేన తరపున అసెంబ్లీలో పాగా వేసి ఏదో రాజకీయం చేయొచ్చు. ఎవరో ఒకరికి మద్దతు తెలిపి, సినీ గ్లామర్ తో నామినేటెడ్ పోస్టులు దొరకబుచ్చుకోవచ్చు. కానీ అది కూడా సాధ్యంకాదని తేలుతోంది. మరిప్పుడు పవన్ కల్యాణ్ ఏంచేయాలి. తాను మాటిచ్చినట్టు 25ఏళ్లు వేచిచూడాలా? లేక తనకు అలవాటైన పాత పనిలోనే పడాలా?

ఎన్నికల టైమ్ లో అంటే విరాళాలు వచ్చిపడతాయి కానీ, ఎన్నికలు అయిపోయాక పెట్టుబడి పెట్టడానికి ఎవరు మిగులుతారు. అందరి జేబులూ ఖాళీ. పవన్ కి అండగా నిలబడటానికి ఎవరూ ఉండరు కాబట్టి సినిమాలు చేసుకోవడమే మంచి ఆప్షన్. ఈపాటికే పవన్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పైగా ఆల్రెడీ తీసుకున్న అడ్వాన్సులు ఆయన వద్ద ఉండనే ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ లో కూడా వాటిని చూపించారు పవన్.

సినిమాల్లో ఉన్నప్పుడు తనను ఆరాధించిన ప్రజలే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వర్గాలుగా విడిపోయి కొందరు చీదరించుకునే పరిస్థితి వచ్చింది. ఈ అనుభవం కూడా ఉంది కాబట్టి పవన్ కల్యాణ్ రాజకీయాల కంటే సినిమాలే బెటరని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఈవీఎంలపై నెపం నెట్టినట్టు.. పవన్ కల్యాణ్ జనం మారరు, మారలేరు అనే నిందవేసి సినిమాల్లోకి వెళ్లిపోతారేమో. 

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!