ఇక రిటైరైతే గౌరవమేమో..!

ఏ రంగంలో పని చేసేవాళ్లు అయినా యాభై తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ లో కూడా అరవైకి దగ్గరపడిన వాళ్లను ఇంటికి పంపేస్తాయి. అయితే రాజకీయాల్లో మాత్రం అరవై దాటినవాళ్లు కూడా ఎక్కడలేని కష్టం పడుతూ ఉంటారు. మిగతా పనులు చేసేవాళ్లు తాము ముసలాళ్లం అయిపోయామనుకునే వయసులో.. రాజకీయాల్లో ఇంకా ఏదో సాధించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తమ వయసుకు కూడని కష్టంపడుతూ ఉంటారు.

రాజకీయాల్లోనూ, అధికారంలోనూ ఉన్న మహత్యం అదేనేమో! తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రజాదరణ కోల్పోయిన కొంతమంది కాంగ్రెస్ సీనియర్లను చూస్తే.. వీళ్లు ఇక రిటైర్మెంట్ ను ప్రకటిస్తే మంచిదేమో అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేసీఆర్ తో పోటీ ఛరిష్మా, సత్తా వీళ్లలో లేదని తేలిపోయింది.

జానారెడ్డినే తీసుకుంటే... ఎన్నికల్లో ఓడటం అనేది ఆయన స్థాయికి అవమానమే. కేవలం జానా అనేకాదు.. కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిన జీవన్, డీకే అరుణ, సర్వే లాంటివాళ్లు కూడా చిత్తుగా ఓడారు. వీళ్లలో కొందరికి మొన్నటి వరకూ ఎమ్మెల్యే అనే హోదా అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది.

ఓడిపోయినా రేవంత్ రెడ్డి లాంటివాళ్లు ఇంకా పోరాడొచ్చు. భవిష్యత్తు మీద ఆశలతో పని చేయవచ్చు. అయితే జానారెడ్డి, జీవన్ రెడ్డిలాంటి వాళ్లు మాత్రం ఇక గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందేమో. జానారెడ్డికి అయితే ఎలాగూ వారసుడు ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ ఎన్నికల్లోనే పోటీ చేయ  ప్రయత్నించాడు. పోటీచేసి ఉంటే ఓడిపోయేవాడేమో.

టికెట్ దక్కకపోవడం కూడా మేలే అయినట్టుగా ఉంది. ఇక జానా తప్పుకుని.. తను మొన్నటివరకూ ఎమ్మెల్యేగా ఉండిన నియోజకవర్గంలో తనయుడిని యాక్టివ్ చేసుకుంటే.. గౌరవంగా ఉంటుందేమో! పోవాల్సిన పరువు ఇప్పటికే పోయింది కదా!

Show comments