ఎమ్బీయస్‌: కశ్మీరీయులు కొత్తగా బావుకునే దేముంది?

కశ్మీరు యింత క్లిష్టమైన అంశంగా, కశ్మీరు నాయకులు కొరకరాని కొయ్యలుగా, కశ్మీరు ప్రజలకూ కేంద్రానికి మధ్య అడ్డుగోడలుగా మారారన్న సంగతి నాకూ, మీకూ తెలియగాలేనిది కేంద్రంలో ఉన్న నాయకులకు, అధికారులకు తెలియదా? వాళ్లు పరిష్కారమార్గాలు అన్వేషించకుండా ఉంటారా? నెహ్రూ హయాంలోనే ఓ ప్రయోగం, ఓ దుస్సాహసం చేసి చూశారు. తామిచ్చిన నిధులతో ఎదిగిపోతూ షేక్‌ అబ్దుల్లా కశ్మీర్‌కి రారాజుగా వెలిగిపోతున్నాడని, తాము తాత్కాలికం అనుకున్న ఆర్టికల్‌ 370 శాశ్వతమై పోయి, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి లేకుండా పోతోందని, కశ్మీరును భారత్‌లో అంతర్భాగం చేయడానికి శక్యం కాకుండా ఉందని గ్రహించిన నెహ్రూ షేక్‌కు ముకుతాడు వేయడానికి చూశారు.

షేక్‌ను ఎలాగోలా తప్పించినా అతని స్థానంలో తేవడానికి భారతీయ పార్టీలేవీ కశ్మీరులో లేవు. కాంగ్రెసు/కమ్యూనిస్టు/సోషలిస్టు కార్మికుల యూనియన్లు లేవు, కర్షక సంఘాలు లేవు. స్వాతంత్య్రోద్యమం జరిగిన 50, 60 ఏళ్లు కశ్మీరును పట్టించుకోకుండా ఉండి, యిప్పుడు తగుదునమ్మా నంటూ వచ్చి నాయకులమంటే ఒప్పుతుందా? అందుకని షేక్‌ అనుచరుల్లోనే ఒకడైన, ఉపముఖ్యమంత్రిగా పని చేస్తున్న బక్షీ గులామ్‌ మహమ్మద్‌ను దువ్వి, లోబరుచుకున్నారు. అతను నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి)లో కుట్ర చేసి, షేక్‌ను 1953 ఆగస్టులో పదవీభ్రష్టుణ్ని చేశాడు. దానికి గవర్నరుగా ఉన్న కరణ్‌ సింగ్‌ పూర్తిగా సహకరించాడు. షేక్‌కు అసెంబ్లీలో మద్దతు ఉన్నా, కాబినెట్‌లో మద్దతు లేదంటూ గవర్నరు అతన్ని తొలగించాడు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకో నివ్వలేదు. నెహ్రూ ప్రభుత్వమే అతని చేత యీ పని చేయించింది. అసెంబ్లీని సంప్రదించనక్కర లేదంటూ, సర్వంసహా అధికారాలు తీసుకోవచ్చనంటూ యివాళ అమిత్‌ షా 'కాంగ్రెసు కూడా యిదే పని చేసింది' అంటూ ఉటంకిస్తున్న ఘట్టం యిదే. 

ఇలాటి అప్రజాస్వామిక చర్యతో పాటు కశ్మీరు స్వాతంత్య్రం కోసం భారతప్రభుత్వంపై కుట్ర చేశాడంటూ అతని మీద, 22 మంది సహచరుల మీద ''కశ్మీరు కుట్ర'' పేరుతో కేసు బనాయించి షేక్‌ను అరెస్టు చేయించారు. కశ్మీరుకి దూరంగా ఊటీలో 2 నెలలు పెట్టి, ఆ తర్వాత కొడైకానల్‌లో 11 ఏళ్ల పాటు గృహనిర్బంధంలో పెట్టారు. చివరకు 1964 ఏప్రిల్‌లో ఆరోపణలన్నీ ఉపసంహరించుకుని విడిచి పెట్టారు. ఎందుకలా? అంటే నెహ్రూకి అతనితో అవసరం పడింది. యుద్ధం అనర్థదాయకమంటూ శాంతిమంత్రం పఠిస్తూ వచ్చిన నెహ్రూని చైనా తన దాడితో నివ్వెరపోయేట్లు చేసింది. దానితో ఖిన్నుడైన నెహ్రూ కనీసం పాకిస్తాన్‌తో నైనా రాజీ పడదామనుకున్నాడు. పాక్‌, భారత్‌ సత్సంబంధాలు మెరుగుపడాలంటే కశ్మీరు సమస్య పరిష్కరింపబడి తీరాలి. దానికి మంచి మధ్యవర్తి కావాలి. 1964లో షేక్‌ను విడుదల చేసిన నెహ్రూ అతన్ని పాకిస్తాన్‌ వెళ్లి అధ్యక్షుడు ఆయూబ్‌ ఖాన్‌తో మాట్లాడి, అతన్ని దిల్లీలో చర్చలకు వచ్చేట్లా ఒప్పించమని కోరాడు. షేక్‌ సరేనంటూ పాక్‌ వెళ్లి మాట్లాడి ఆయూబ్‌తో చర్చించాడు. జూన్‌లో దిల్లీ వస్తానని ఆయూబ్‌ ఒప్పుకున్నాడు కూడా. అయితే యింతలోనే మే 27న నెహ్రూ మరణించాడు. దాంతో చర్చలు జరగలేదు. కశ్మీరు సమస్య అపరిష్కృతంగానే ఉండిపోయింది. 

ఖైదు నుండి విడుదలైనా షేక్‌ను 1968 వరకు బయటకు రానీయలేదు. అతని ప్లెబిసైట్‌ ఫ్రంట్‌ను నిషేధించారు. ఎందుకంటే వాళ్లను ఎన్నికలలో పోటీ చేయనిస్తే వాళ్లే గెలుస్తారని భయం కేంద్రానికి! నిజానికి అక్రమంగా గద్దె నెక్కినా బక్షీ పాలన (1953 నుండి 1964) బాగా సాగింది. కశ్మీరును అనేక రంగాల్లో తీర్చిదిద్దిన ఘనత అతనిదే. కేంద్రం తనను కూర్చోబెట్టినా, ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో 'ఎక్కడైనా బావ కానీ వంగతోట వద్ద కాదు' అన్నట్టే ఉన్నాడు. తమ హక్కులు ఏవీ పోనీయలేదు. ఎందుకంటే అవి ఏ మాత్రం తగ్గినా ప్రజలకు ఆందోళన కలుగుతుందని భయం. ఆ ఆందోళనను సొమ్ము చేసుకోవడానికి షేక్‌ అబ్దుల్లా అనుచరులు ''ప్లెబిసైట్‌ ఫ్రంట్‌'' పేర పార్టీ పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇన్ని చేసినా షేక్‌ పాప్యులారిటీని కశ్మీరులో తగ్గించలేక పోయారు. అతను 1975లో మళ్లీ ముఖ్యమంత్రి కావడమే కాదు, అతని మనుమడు ఒమర్‌ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. 

కేంద్ర బలగాల సాయంతో కశ్మీరును కైవసం చేసుకుందామని చూస్తున్న మోదీ ప్రభుత్వం యీ విషయాలను గ్రహించాలి. కశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసేముందు అక్కడి అసెంబ్లీ మనోగతం తెలుసుకోకుండా, పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. అవి సక్రమమా, అక్రమమా అనేది కోర్టులు తేలుస్తాయి. ఆ చర్య వలన సత్ఫలితాలు కలుగుతాయా లేదా అన్నదే మన బెంగ. మోదీ-అమిత్‌ రాష్ట్ర అభివృద్ధికి ఆర్టికల్‌ 370 ఒక్కటే అడ్డుగా ఉందని, అది తీసేయడం వలన అక్కడ స్వర్గం వెలుస్తుందని మనను ఊదరగొడుతున్నారు. పరిశ్రమలు వచ్చేస్తాయిట, ఉద్యోగాలు వచ్చేస్తాయట, విద్యాహక్కు, టూరిజం వృద్ధి, యింకా ఎన్నో, ఎన్నో...! శాంతిభద్రతలు నెలకొల్పలేక పోతే యివేమీ జరగవు. అది ఎలా సాధిస్తారనేదే అందరినీ దొలిచివేస్తున్న ప్రశ్న.

నిన్న మోదీ 'కొత్త కశ్మీర్‌' గురించి అత్యుత్సాహంగా మాట్లాడారు. కశ్మీరీయులకు కొత్తగా ఏదో ఒరగబోతోందన్న బిల్డప్‌ యిచ్చారు. ఇలాటి బిల్డప్‌ ప్రత్యేక హోదా యిస్తానన్నపుడు ఆంధ్రలోనూ యిచ్చారు. ప్యాకేజీ వేలం వేసినప్పుడు బిహార్‌లోనూ యిచ్చారు. స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటించినపుడు గతంలో కశ్మీర్‌లోనూ యిచ్చారు. నోట్ల రద్దు సమయంలో అయితే చెప్పనే అక్కరలేదు, నల్లధనం సమసిపోతుంది, దొంగనోట్లు అచ్చేయడం మానేస్తారు, డబ్బున్నవాళ్లు బ్యాంకుల ముందు, పేదల గుడిసెల ముందు క్యూలు కడతారు, కశ్మీరులో ఉగ్రవాదం ఆగిపోయింది... యిలా ఎన్నెన్నో! అవి ఎంతవరకు నెరవేరాయో మనం చూశాం. ఇది ఎలా పరిణమించబోతోందో త్వరలో చూడబోతాం. కశ్మీర్‌ ఉగ్రవాదానికి, అవినీతికి, కుటుంబవాదానికి అన్నిటికీ మూలకారణం 370, 35ఎ మాత్రమేనట. ఉగ్రవాదం హైదరాబాదులో ఉంది, కేరళలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. అక్కడంతా 370 ఉందా? కుటుంబవాదం కాంగ్రెసులోనే కాదు, దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల్లో ఉంది. అవినీతి సంగతి చెప్పనే అక్కరలేదు. హెచ్చుతగ్గులతో అన్ని రాష్ట్రాలలో ఉంది. మరి అక్కడంతా 35ఎ ఉందా? జాతీయ సగటు అక్షరాస్యత శాతం కంటె తక్కువ శాతం 11 రాష్ట్రాలలో ఉంది. మరి అక్కడ విద్యా హక్కు ఉండి ఏం బావుకున్నారు?

ఇక అభివృద్ధి గురించి - 370 సాధారణ కశ్మీరీని ఆర్థికంగా ఎలా ప్రభావితం చేస్తుంది? కశ్మీరీ యువతి కశ్మీరేతరుణ్ని పెళ్లి చేసుకోవడం, ప్రత్యేక పతాకం వగైరాలు ఉపాధిని కల్పించవు. 370 కారణంగా పరాయివాళ్లు భూమి కొనుక్కోలేక పోవడం చేత పరిశ్రమలు రాక, వాళ్లు అభివృద్ధి చెందటం లేదు అన్నదే ముఖ్యమైన పాయింటుగా చెప్తున్నారు. కేరళలో 370 లేదు, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయా? ఆంధ్రలో లేదు, అక్కడ వస్తున్నాయా? పారిశ్రామిక రంగంలో వెనకబడిన అనేక రాష్ట్రాల్లో 370 అడ్డం వచ్చిందా? ప్రగతి రావాలంటే అనేకం సమకూడాలి. భూమి కొనగలిగితే చాలదు. మధ్యప్రదేశ్‌లో బోల్డంత చోటు ఉంది. నిక్షేపంలా వెళ్లి కొనుక్కోవచ్చు. అక్కడ పరిశ్రమలు వచ్చిపడుతున్నాయా? పరిశ్రమ రావాలంటే ముడిసరుకుల లభ్యత, రవాణా సౌకర్యాలు, నిపుణులైన కార్మికులు, సమ్మెలు, బందులు లేని వాతావరణం, సమర్థులైన మేనేజర్లు, యిబ్బంది పెట్టని స్థానిక యంత్రాంగం, అనుకూలమైన రాజకీయ వాతావరణం.. యిలా ఎన్నో వుండాలి. కశ్మీరులో విద్యాహక్కు చట్టమే లేదు, అక్షరరాస్యత అతి తక్కువగా వుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌ లేవు, అని చెపుతూనే స్థానికులకు ఉద్యోగాలు వచ్చేస్తాయంటే ఎలా ఒప్పుతుంది?  

అయినా ఏ పారిశ్రామిక వేత్త భూమిని సరైన రేటుకి కొంటున్నాడు? ఉద్యోగాలు కల్పిస్తామంటే అవసరానికి మించి అనేక రెట్లు భూమిని కేటాయింప చేసుకుని, ఏళ్లూ పూళ్లయినా ఫ్యాక్టరీలు కట్టడం లేదు. కశ్మీరులో మాత్రం వెంటనే కట్టేస్తారా? అసలే అక్కడ పచ్చదనం ఎక్కువ. పర్యావరణ రీత్యా అనేక అడ్డంకులు వస్తాయి. ఆ తర్వాత లైసెన్సులు, పర్మిట్లు, ఆర్థికమాంద్యం అంటూ సాగదీస్తారు. ఇన్నాళ్లూ పరిశ్రమలు రాకపోవడానికి యిదే కారణమా? నాకు తెలియక అడుగుతాను, రాష్ట్ర ప్రభుత్వం బయటివాళ్లకు లీజుకి యివ్వకూడదని 370లో ఉందా? ఉద్యోగాలు కల్పిస్తామన్నా లీజుకి యివ్వలేదా? కశ్మీరులో యిప్పుడు ప్రభుత్వ సంస్థలు పెడతారట, నీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ ప్రాజెక్టులు కడతారట. ఇన్నాళ్లూ ఎందుకు చేయలేకపోయారు? 370 అడ్డు వచ్చిందా? నా భయమేమిటంటే అక్కడ, మన అమరావతిలా, రియల్‌ ఎస్టేటు యాక్టివిటీ తప్ప మరేమీ జరగదని. పోనీ రైతులు, భూమి యజమానులు బాగుపడతారు అనుకుందామన్నా, వాళ్లకు సరైన రేటు దక్కుతుందో లేదో సందేహం. కేంద్ర బలగాలు తుపాకీ గురి పెట్టి ఫలానా రేటుకి అమ్ముతావా లేదా, ఉగ్రవాదిగా ముద్రేసి జైల్లో తోయమంటావా అంటే రైతులేం చేయగలరు? 

బయటివాళ్లు వచ్చి భూములు కొన్నపుడు సాధారణంగా ఏమవుతుందంటే స్థానికులు అప్పటి మార్కెట్‌ రేటుకే అమ్మేసుకుంటారు. కొన్నవాళ్లు కొన్నేళ్ల పాటు ఎంతో శ్రమించి, అక్కడ బంగారం పండించి, ఆ స్థలం మార్కెట్‌ విలువ పెంచుతారు. అప్పుడు పాత యజమానులకు కడుపులో కెలుకుతుంది. మమ్మల్ని ఏమార్చి, మా దగ్గర్నుంచి చౌకగా కొట్టేశారు అనే ఫీలింగు కలుగుతుంది. ఇక అక్కణ్నుంచి బయటి నుంచి వచ్చినవాళ్లు వెళ్లిపోవాలి అనే డిమాండ్‌ వస్తుంది, ఉద్యమాలు ఊపిరి పోసుకుంటాయి. తెలంగాణతో సహా ఎన్నో చోట్ల యిది చూశాం. ఇవాళ కశ్మీరులో సరైన మార్కెట్‌ రేటుకి అమ్ముకున్నవాళ్లు కూడా రేపు యిలాటి ఉద్యమకారులు కాబోరని గ్యారంటీ లేదు. ఇక టూరిజం గురించి మోదీ మాట్లాడుతూ కశ్మీరులో షూటింగులు చేసుకోవడానికి హిందీ, తెలుగు, తమిళ పరిశ్రమలు వెళ్లాలన్నారు. పాపం ఆయనకు తెలియదు, మనవాళ్లు కశ్మీరు ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే దాటేశారు. ఇప్పుడు అన్నీ ఫారిన్‌ లొకేషన్లే. అనేక విదేశాలు చౌకగా సకల సౌకర్యాలు అందిస్తున్నాయి. బజెట్‌ లేకపోతే రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎలాగూ ఉంది. గ్రాఫిక్స్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. షూటింగుకి వెళ్లమని ఏ భోజపురి చిత్రపరిశ్రమకో పిలుపు నివ్వాల్సింది. 

ఇక 370 ఎత్తేశాం కాబట్టి కలిగే లాభాలంటూ చెప్పినవి చాలా ట్రీవియల్‌గా ఉన్నాయి. పారిశుధ్య కార్మికుల సంరక్షణ చట్టం, కార్మికుల కనీస వేతన చట్టం, రాష్ట్ర పోలీసులకు కేంద్ర ఉద్యోగులతో సమాన వేతనాలు, ప్లస్‌ ఎల్టీసీ వగైరా ఎలవెన్సులు, ఎస్సీఎస్టీ చట్టం (తక్కిన రాష్ట్రాలలో శిక్షలు పడే సందర్భాలు తక్కువ అని గోల పెడుతున్నారు, కశ్మీరు దళిత వ్యతిరేక సంఘటనలు రిపోర్టు అయ్యాయా?), మైనారిటీల రక్షణ చట్టం (దేశమంతా దాని అమలూ ఘోరంగా ఉంది, కశ్మీరులో మైనారిటీల నందరినీ తరిమివేశారు కాబట్టి, దీనివలన లాభపడేవారెందరో మరి). ఎస్సీఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు అమలవుతాయని చెప్తున్నారు. ఆ రిజర్వేషన్లు మాకు కావాలి అని సంబంధిత వర్గాల వారు ఎప్పుడైనా కశ్మీరు ప్రభుత్వాన్ని అడిగారా? ఆందోళనలు చేపట్టారా? ఎన్నికలలో అంశంగా చేసుకున్నారా? నా దృష్టిలో యివేమీ ముఖ్యం కాదు. జస్ట్‌ పెరిఫరల్‌ అంతే. ఉగ్రవాదం అణచగలగాలి. అది స్థానికుల సహకారం లేనిదే సాధ్యం కాదు. 

మావోయిస్టు సమస్య లాగానే యిదీ! స్థానికుల సహకారం ఉన్నచోట దాన్ని అదుపులోకి తేగలిగాం. లేని చోట యింకా తంటాలు పడుతున్నాం. ఉగ్రవాదం అణచడం అగ్రదేశాల వలననే కావటం లేదు. మనమూ దశాబ్దాలుగా దానితో వేగుతున్నాం. 370 ఎత్తేసినంత మాత్రాన ఉగ్రవాదం మాయం కాదు, ముఖ్యంగా అటు పాకిస్తాన్‌ ఎగదోస్తూ ఉండగా! కశ్మీరుపై పాక్‌కు ఎప్పుడూ కన్ను ఉంది. అసలు మనకు కశ్మీరు వచ్చినదే, పాక్‌ కారణంగా. హరి సింగ్‌ విడిగా, స్వతంత్ర రాజ్యంగా ఉంటానన్నాడు. అయితే 1947లోనే పాక్‌ సైన్యం ఫష్టూన్‌ గిరిజనుల పేరుతో దాడి చేసింది. దాంతో హరి సింగ్‌ భయపడి, భారత్‌తో ఒప్పందం చేసుకున్నాడు. పాక్‌ న్యాయంగా ప్రవర్తించి ఉంటే మనవైపు వచ్చేవాడే కాదు. ఇప్పుడు పిఓకె గురించి కూడా మన వాళ్లు ధైర్యంగా మాట్లాడేస్తున్నారు. అది కూడా స్వాధీనం చేసేసుకుంటారట. అది అంత సులభం కాదు.

పిఒకె అనేది ఒక చారిత్రక వాస్తవం. అది 72 ఏళ్ల క్రితం, 1947 లో ఏర్పడింది. మనవైపు కశ్మీరు జనాభా 69 లక్షలైతే, దాని జనాభా 45 లక్షలు. కశ్మీరు రాజుకే చెందిన గిల్గిత్‌, బాల్టిస్తాన్‌ ఆక్రమించిన పాక్‌ (దానిలో కొంత చైనాకు ధారాదత్తం చేసింది కూడా) అక్కడివాళ్లకు పాక్‌ పార్లమెంటులో సభ్యత్వం యిచ్చింది కానీ, పిఓకె వాళ్లకు యివ్వలేదు. 'అది ఆజాద్‌ కశ్మీర్‌, దానికి విడిగా ప్రధాని ఉన్నాడు, మా ప్రమేయం ఏమీ లేదు' అని బిల్డప్‌ యివ్వడానికి! 1947 నుంచి పాక్‌ కశ్మీర్‌ అగ్గి రగిలిస్తూనే ఉంది. అక్కడ అశాంతికి దోహదపడుతూనే ఉంది. రకరకాల సంస్థల ద్వారా (వాటి పేర్లు యిక్కడ యివ్వటం లేదు), ఉగ్రవాదానికి (వాళ్ల కార్యకలాపాల జాబితా యివ్వటం లేదు) ఊపిరి పోస్తూ ఉంది. కశ్మీరు ఉగ్రవాదులు పాక్‌లో తర్ఫీదు అయి, నేపాల్‌ ద్వారా ఇండియాలోకి హాయిగా వచ్చేస్తున్నారు. రోజంతా పాక్‌ టీవీ ప్రసారాలు చూస్తూ ప్రభావితమైన కశ్మీరీలు వారు తమ కోసం పోరాడుతున్నారనే భావనలో పడుతున్నారు. అక్షరాస్యత తక్కువగా ఉన్నపుడు మతమౌఢ్యం కూడా ఎక్కువ ఉంటుంది.

ఇప్పుడు పిఓకెను స్వాధీనం చేసుకోవాలని అంటే ఆజాద్‌ కశ్మీర్‌నేనా, లేక గిల్గిత్‌,  బాల్టిస్తాన్‌ను కూడానా? అలా అయితే చైనాతో కూడా పేచీ పెట్టుకోవాలి. ఇన్నాళ్ల నుంచి ఏమీ చేయలేక పోయాం. నిజానికి పాక్‌ను అణచగలిగితే కశ్మీరే కాదు, అనేకానేక సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. కానీ అణచగలమా? మోదీకి ఆ సామర్థ్యం ఉందని 2014లో అందరూ నమ్మారు. మన్‌మోహన్‌ అయితే బాత్‌రూమ్‌లో రెయిన్‌ కోటు వేసుకుని స్నానం చేసే పిరికివాడు, మోదీ అయితే మొనగాడు, పొరుగుదేశాలకు బుద్ధి చెప్పి, భారత్‌ ప్రతిష్ఠను ఎక్కడికో తీసుకుపోతాడు అని అనుకున్నారు. ఐదేళ్లయింది. గతంలో ఎలా ఉందో యిప్పుడూ అలాగే  ఉంది. దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాక్‌ నిర్భయంగా పేచీలు పెడుతూనే ఉంది. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసి దాని పడగ మీద కొట్టేశాం అనుకున్నాం. మళ్లీ మళ్లీ అది పడగ ఎత్తుతూనే ఉంది. ఉగ్రవాద, మిలటరీ కార్యకలాపాలు ఏమీ ఆపలేదు. పాక్‌లో ప్రజాస్వామ్యం నెలకొనేవరకు, మిలటరీ ప్రాబల్యం తగ్గేవరకు మనతో ఘర్షణ ఆగదు. నా తరంలో అది జరగదు.

భారత్‌-పాక్‌ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగేందుకు అవకాశాలు తక్కువ. కానీ యుద్ధవాతావరణం మేన్‌టేన్‌ చేయడం యిరు దేశాల పాలకులకు లాభదాయం. ప్రస్తుతం ఇమ్రాన్‌ అప్పులు అందక ఆర్థిక యిబ్బందుల్లో ఉన్నాడు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ కశ్మీరు అంశం అంది వచ్చింది. ఇక చెలరేగుతాడు. పాక్‌ ప్రజలను మరింత భగ్గుమనిపిస్తాడు. త్యాగాలకు సిద్ధపడైనా భారత్‌కు బుద్ధి చెప్పాలంటాడు. పాక్‌కు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా పైకి ఏం చెప్పినా, అఫ్గనిస్తాన్‌నుంచి తన సైన్యాల ఉపసంహరణకు అమెరికాకు పాక్‌ సాయం కావాలి. ఇప్పుడు కశ్మీరులో మనం చేస్తున్నదాన్ని సద్దాం హుస్సేన్‌ సొంత పౌరులైన కుర్దులపై చేసిన దాడిగా పాక్‌ చిత్రీకరిస్తే ఔననే దేశాలు కూడా ఉండవచ్చు. 

తక్కిన దేశాలు ఏమనుకుంటే మన కెందుకు అనుకుందాం. కానీ అంతిమంగా గెలుస్తామా? పిఓకెలో మళ్లీ మన జండా పాతుతామా? అనేదే ప్రశ్న. గెలుపుకి కావలసినది స్థానికుల మద్దతు. అంటే మన కశ్మీరులో ఉన్నవాళ్లు సహకరిస్తేనే పిఓకెని గెలవగలం. మన వైపు కశ్మీరీయులకు యీ విషయంలో గల అభిప్రాయం ఏమిటి? నేను 1980లో వెళ్లినపుడు శ్రీనగర్‌ నుంచి పహల్‌గావో, గుల్మర్గో వెళ్లేటప్పుడు బస్‌ డ్రైవర్‌ను అడిగాను - పిఓకె దగ్గరేట కదా, ఎక్కడుంది? అని. అతను తెల్లబోయినట్లు చూశాడు. అప్పుడు 'పాక్‌ వాళ్లు ఆక్రమించి తమ వద్ద పెట్టుకున్న భూభాగం' అని వివరంగా చెప్పాను. అప్పుడతను ''ఆజాద్‌ కశ్మీరా? అదిగో ఆ కనబడుతున్నదే!'' అన్నాడు. నేను తెల్లబోయాను. అతను పాక్‌ వాళ్ల లాగ 'ఆజాద్‌..' అంటాడేమిట్రా అని. సగటు కశ్మీరీ దృష్టిలో 'మొత్తమంతా ఒకటే కశ్మీరు, దానిలో కొంత భాగం స్వతంత్రంగా ఉంది, మేము మాత్రం ఇండియా అధీనంలో ఉన్నాం' అనే! 1980 నాటికి కశ్మీరులో గొడవలేమీ ప్రారంభం కాలేదు. అప్పుడే అలా ఉంటే, యిప్పుడెలా తయారై ఉంటుందో ఊహించవచ్చు. ఈ పాక్‌, భారత్‌ బయటకు పోతే మనం ఈస్ట్‌, వెస్ట్‌ జర్మనీల్లా కలిసిపోవచ్చు అని అనుకుంటున్నారేమో!

ఇలాటి వాళ్ల ఊతంతో మనం పిఓకె గెలవగలమా? ఒకవేళ గెలిచినా నిలుపుకోగలమా? మోదీ తలపెట్టినది పెద్ద ఆపరేషన్‌. ఆపరేషన్‌ చేసేముందు పేషంటు సుగర్‌, బిపి, మానసిక బాలన్స్‌ నార్మల్‌ స్థితికి తెచ్చి అప్పుడు ఆపరేషన్‌ చేస్తారు. అలాగే కశ్మీరులో సామాజిక పరిస్థితిని సాధారణ స్థాయికి తెచ్చి, వారి సహకారంతోనే 370 రద్దు, పిఓకెపై దాడి వగైరాలు తలపెట్టాలి. మన ప్రభుత్వం తేగలిగిన మార్పులన్నీ జమ్మూలోనే! లదాఖ్‌లాగే జమ్మూను విడగొట్టి దాన్ని బాగు చేసి ఉంటే సరిపోయేది. అలా ఎందుకు చేయలేదు? ఎందుకంటే జమ్మూ చేతిలో ఉంది కాబట్టి దాని ద్వారా కశ్మీరును అదుపులోకి తీసుకుందామని చూస్తున్నారు. రేపుమర్నాడు పార్లమెంటులో చట్టం చేసి జమ్మూలో అసెంబ్లీ స్థానాలను కశ్మీరు కంటె ఎక్కువగా పెంచేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. అప్పుడు జమ్మూవాళ్లు ఏమనుకుంటే అది కశ్మీరులో కూడా అమలవుతుంది.

అదే జరిగితే కశ్మీరీయులు మనకు మానసికంగా మరింత దూరమవుతారు. నేను రాస్తూ వచ్చినది చదివితే కశ్మీరీయులకు, మనకు మధ్య ఎంత అగాధం ఉందో, అది ఎందుకు వచ్చిందో అర్థమౌతుంది. ఇది ఎవరూ విప్పలేని చిక్కుముడి. ఏ భారతీయ నాయకుడూ కశ్మీరీయులకు దగ్గరగా వెళ్లి ఆత్మీయంగా వ్యవహరించలేదు. వారి విశ్వాసాన్ని చూరగొనలేదు. కశ్మీరు నాయకుల ద్వారా మేనేజ్‌ చేద్దామని చూసి యింతదాకా తీసుకుని వచ్చారు. 370 రద్దు వలన ఏ ఉపద్రవమూ రాదని మీరూ నేనూ అనుకోవచ్చు. కానీ అక్షరాస్యత తక్కువ ఉండి, నిరంతరం పాక్‌ టీవీల ప్రచారప్రభావంలో ఉన్న కశ్మీరులో భయాలు ఎలా ఉన్నాయో మరి! నేను ముందే రాసినట్లు, ఆర్టికల్‌ 370 రద్దు యింత నాటకీయంగా చేయకుండా, ఏవైనా సామాజిక సంస్థల ద్వారా కొన్నేళ్ల పాటు కృషి చేసి వుంటే వ్యవహారం సానుకూల పడేది. అది జరగలేదు.

ఒకసారి మోదీ నిర్ణయం తీసేసుకున్నాక, దాన్ని సమర్థించడానికి సోషల్‌ మీడియా యాక్టివ్‌ అయిపోతుంది. కశ్మీరు కన్య ఇండియన్‌ పౌరుణ్ని చేసుకుంటే హక్కులు కోల్పోతుందట, పాక్‌ పౌరుణ్ని చేసుకుంటే కోల్పోదట - అనేది రౌండ్లు కొడుతోంది. దీనిలో రెండో భాగం తప్పని కొందరు ధృవీకరించారు. పిఓకెలో ఉన్న కశ్మీరు యువకుణ్ని చేసుకుంటే కోల్పోదు - అనుకుంటే అది అఫీషియల్‌గా పాక్‌ భూభాగం కాదు. ఇక మొదటి భాగం గురించి - గతంలో యిది ఉన్నమాట వాస్తవమే కానీ 2002లో జమ్మూ, కశ్మీరు హైకోర్టు ఓ కేసులో యిచ్చిన తీర్పు తర్వాత కాదు. ఆ తీర్పు ప్రకారం ఆమెకు ఆస్తిలో హక్కు వగైరాలు నిలుస్తాయి. ఆమె ద్వంద్వ పౌరసత్వం కొనసాగుతుంది కానీ ఆమె పిల్లలకు మాత్రం తండ్రి పౌరసత్వమే వస్తుంది.

మోదీ యీ రోజు కొత్త ఉపాయంతో ముందుకు వెళ్లటం లేదు. ప్రభుత్వాన్ని కేంద్రం అధీనంలోకి తీసుకోవడం చాలా సార్లు చేశారు. 1965 నుంచి ఇప్పటివరకు మొత్తం 10 ఏళ్లు రాష్ట్రపతి పాలనే నడిచింది. గత 35 ఏళ్లగా ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్ర బలగాలను దింపి రాజ్యం చేద్దామని చూస్తున్నారు. సాధారణ ప్రజ వారి ఉనికితో విసిగిపోయారు. మూడు రోజులు కర్ఫ్యూ పెడితేనే మనకు పిచ్చెక్కిపోతుంది. అలాటిది దశాబ్దాల తరబడి అలాటి వాతావరణంలో బతికిన వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పుట్టాక, బయటకు వెళ్లి ఆడుకోవడం ఎరగని తరానికి 35 ఏళ్లు వచ్చాయి. పిల్లలు బయటకు వెళ్లలేరు, బయటకు వెళ్లిన మొగుళ్లు యింటికి వచ్చేదాకా భరోసా లేదు. ఇక మహిళలకు మనస్థిమితం ఉంటుందా? ఇవన్నీ వైవాహిక జీవితంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. వాళ్లకు శాంతి కావాలి, అతిథులు కావాలి, ఆదాయం కావాలి. ఇవన్నీ కేంద్ర బలగాలు యివ్వగలవా?

బలం చూపించి ఎవరూ ఏ ప్రాంతపు ప్రజలనూ గెలవలేరు. అమెరికా వియత్నాంలో ఓడిపోయింది, ఇరాక్‌లో సద్దాంను చంపగలిగింది కానీ ఇరాకీయులను లొంగదీయలేక పోయింది. రష్యా అఫ్గనిస్తాన్‌పై దాడి చేసి, చేతులు కాల్చుకుంది. ఇలా అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. అవన్నీ పరదేశపు దాడులు, కశ్మీరు మన ప్రాంతమే అని వాదించవచ్చు. 'మనది' అనే ఫీలింగు యిరుపక్షాలా ఉండాలి. కశ్మీరీయుల్లో కొందరు భారత వ్యతిరేకులు,  చాలా భాగం మంది ఉదాసీనులు. ఎలాగైనా భారత్‌తో కలిసిపోవాలి అని చొక్కా చింపుకునేవాళ్లు కనబడటం లేదు. భారత్‌పై ప్రేమ పుట్టకుండా కశ్మీరు నాయకులు అడ్డుగోడల్లా నిలబడ్డారు యిన్నాళ్లూ. ఇప్పుడు మోదీ చర్యను వాళ్లు దురాక్రమణగానే చిత్రీకరిస్తారు. దాంతో తటస్థులు కూడా పబ్లిగ్గా తమ అభిప్రాయం వ్యక్తం చేయరు. అది మనం అర్థం చేసుకోవాలి. అంగీకరించాలి.

కశ్మీరనేది ఎన్నో ఏళ్లగా చిక్కులు పడిన దారం. ఎవరైనా ఓపిగ్గా చిక్కులు తీస్తూ వస్తే కొంత బాగుపడవచ్చు. ఆ ఓపిక గత పాలకులకూ లేదు, ప్రస్తుతం మోదీ-అమిత్‌లకూ లేదు. అందువలన గతంలో వాళ్లు ప్రయత్నించి, విఫలమైన బలప్రయోగంతోనే మళ్లీ ప్రయోగం చేస్తున్నారు. ఇలాటివి నెగ్గిన దాఖలాలు చరిత్రలో లేవు. ఇదీ నెగ్గేదాకా నమ్మకం పెట్టుకోకపోవడం శ్రేయస్కరం. ఇది నిరాశావాదం కాదు, వాస్తవ దృక్పథం.  మరి కశ్మీరుతో డీల్‌ చేయడమెలా? (ఫోటో - మోదీ, ఇమ్రాన్‌) (సశేషం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2019)
mbsprasad@gmail.com