ముఖ్యమంత్రా... అయితే ఏంటి?

అచ్చంగా ఈ మాట అనలేదు గానీ.. ఇంచుమించు ఇంతే తీవ్రంగా ధర్మాబాద్ కోర్టు మందలించింది. ముఖ్యమంత్రి అయినా సామాన్యుడు అయినా.. న్యాయస్థానం ముందు అందరూ ఒకటే అంటూ ఆగ్రహించింది. అక్టోబరు 15వ తేదీ నాటికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా కోర్టు ఎదుట హాజరు కావాల్సిందేనని.. కోర్టు తాజాగా ఆదేశించింది. ఇదే కేసులో చంద్రబాబు లాగానే వారంట్లు అందుకున్న తెరాస ఎమ్మెల్యేలు ముగ్గురూ.. బెయిల్ పొంది... జరిమానా కూడా కట్టేయడం గమనార్హం.

బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. 2010లో చంద్రబాబునాయుడు అప్పట్లో తెలుగుదేశం నాయకులందరినీ వెంటబెట్టుకుని అక్కడ నిసన ప్రదర్శన చేయడానికి వెళ్లారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి.. వెనక్కి తిప్పి పంపారు. అప్పట్లో వారందరిపై కేసు నమోదు అయింది. ఇన్నాళ్లుగా కేసులో ఉన్న నిందితులు ఎవ్వరూ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. మధ్యలోనే వారికి అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. ఇన్నాళ్లకు మరో పిటిషన్ ఒకటి.. దాఖలు కావడంతో కోర్టు ఇన్నాళ్లుగా వారంట్లను ఎందుకు అమలు చేయలేదంటూ.. మళ్లీ అరెస్టు వారంట్లు జారీచేసింది.

అక్కడినుంచి ఏపీలో రాజకీయ ప్రహసనం మొదలైంది. పురాతన కేసుకు సంబంధించి.. ఇప్పుడు వారంట్లు రావడాన్ని రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అచ్చంగా ఇది నరేంద్రమోడీ చేసిన కుట్రగా ఆయన అభివర్ణించారు. భాజపాను దుమ్మెత్తిపోయడానికి శతథా ప్రయత్నించారు. ఉత్తర తెలంగాణ కోసం పోరాడి, ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటూ కన్నీళ్లు కార్చి.. తెలంగాణ ఎన్నికల్లో మైలేజీ కోసం ప్రయత్నించారు. చివరికి కోర్టుకు హాజరు కాకపోతే ఇబ్బంది తప్పదని గ్రహించి.. తన తరఫు న్యాయవాదిని పంపి, రీకాల్ పిటిషన్ వేయించాలని అనుకున్నారు.

తీరా వాయిదా ఉన్న శుక్రవారం నాడు కోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించింది. చంద్రబాబు తరఫు న్యాయవాది కోర్టు ఎదుట తన వాదనలు చెప్పబోయినప్పుడు.. అసలు వారంట్లు అందుకున్న వారు ఎందుకు రాలేదంటూ.. ప్రశ్నించింది. ఈ సందర్భంగానే.. ముఖ్యమంత్రి అయినా సామాన్యుడు అయినా కోర్టు ముందు ఒకటే అంటూ వ్యాఖ్యానించింది.

చేసేది లేక, ముఖ్యమంత్రి రావడానికి గడువు కావాలని న్యాయవాది కోరడంతో.. అక్టోబరు 15 వతేదీకి కేసును వాయిదా వేసింది. చూడబోతే.. ఆ తేదీనాటికి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ముందు హాజరు కాక తప్పేలా లేదు.

Show comments