జనసేన పార్టీలో అసలేం జరుగుతోంది.!

పార్టీకి వున్నదే ఒకే ఒక్క ఎమ్మెల్యే.. ఆయనేమో, వీలు చిక్కినప్పుడల్లా పార్టీతో విభేదిస్తూ, అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. అయినా, ఆయన్ని ఏమీ అనలేని పరిస్థితి. అలాగని, పార్టీలో ఆ ఎమ్మెల్యేకి అమితమైన గౌరవం దక్కుతోందా.? అంటే అదీ లేదాయె.! జనసేన పార్టీ గురించీ, ఆ పార్టీ ఎమ్మెల్యే గురించే ఇదంతా.! జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, కాకినాడలో అట్టహాసంగా 'రైతు సౌభాగ్య దీక్ష' చేపట్టారు. ఈ దీక్షకి జనసేన 'ఏకైక' ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ డుమ్మా కొట్టేశారు.

రాపాక వరప్రసాద్‌, తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం విదితమే. రాజోలు నుంచి కాకినాడ కూత వేటు దూరంలోనే వుంటుంది. కానీ, ఆయన అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతి వెళ్ళాలి కదా.! అదీ అసలు సమస్య. అలాగని ఆయన నిన్న మీడియా సాక్షిగా సెలవిచ్చారు. కానీ, అంతకు ముందే ఇంగ్లీషు మీడియం విషయమై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇంగ్లీషు మీడియం విషయమై జనసేన, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గత కొద్ది రోజులుగా దుమ్మెత్తి పోస్తోన్న విషయం విదితమే.

సరే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, రాపాక వరప్రసాద్‌ సంగతి పక్కన పెడదాం. విశాఖ లోక్‌సభకు పోటీ చేసిన జనసేన ముఖ్య నేత వివి లక్ష్మినారాయణ సంగతేంటి.? ఆయన రైతు సమస్యలపై గతంలో గట్టిగా గళం విప్పారు. ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ అప్పట్లో రైతుల వెంట తిరిగారు.. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అలాంటి లక్ష్మినారాయణ, రైతు సౌభాగ్య దీక్ష.. అంటూ అధినేత చేపట్టిన కార్యక్రమానికి డుమ్మా కొట్టడమేంటి.?

పోనీ, వేరే పనులున్నాయి కాబట్టి డుమ్మా కొట్టారనుకుందాం. కనీసం, లక్ష్మినారాయణ సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ కూడా 'రైతు సౌభాగ్య దీక్ష'పై వేయకపోవడమేంటో.! జనసేన పార్టీలోనే ఇంత గందరగోళం వుంటే.. ఆ పార్టీ చేపట్టే దీక్షలకి జనం నుంచి స్పందన ఇంకెలా వుంటుంది.? అభిమానులున్నారు.. అన్నీ చూసుకుంటారని అనుకుంటే.. ఇటీవలి ఎన్నికల్లో జనసేనకి వచ్చిన ఫలితాలు మళ్ళీ పునరావృతమవుతాయి.. కాదు కాదు, పరిస్థితి మరింత దిగజారిపోతుంది.

Show comments