ఏం జరుగుతోంది? : ఒక అరెస్టు, ఒక కేసు, ఒక నోటీసు!

రాజకీయ ప్రత్యర్థులను నైతికంగా దెబ్బకొట్టడానికి ప్రస్తుతం తెలంగాణలో రాజ్యం చేస్తున్న ఆపద్ధర్మ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా? అధికారం చేతిలో ఉన్నది కదాని.. రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందా? వారిని ఇరుకున పెట్టి.. ప్రజల్లోనే వారి మీద ఒక అపనమ్మకం కలిగించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని లేదా పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నదా? తద్వారా మేం తలచుకుంటే.. ఇంకా పెద్ద ఇబ్బందే పెట్టగలం అని రాజకీయ ప్రత్యర్థులను హెచ్చరించడానికి సర్కారు ప్రయత్నిస్తున్నదా?

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంటే ఎవరికైనా ఇలాంటి అభిప్రాయాలే కలుగుతాయి. అవును మరి.. రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. కేసు గట్టిదే. ఇంకా బెయిల్ కూడా దొరకలేదు. నిన్నటికి నిన్న మరొక కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు. ఇవాళ మరొక కాంగ్రెసు తాజా మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు సర్వ్ చేశారు. ఇదంతా చూసినప్పుడు ఎవరికైనా సరే.. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదనే అభిప్రాయమే కలుగుతుంది.

తెలంగాణలోని కేసీఆర్ సర్కారు ప్రస్తుతం జరుగుతున్న ముందస్తు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఏపీ ముందస్తు ఎన్నికల చరిత్రలో అధికార పార్టీలు నెగ్గిన దాఖలాలు లేకపోయినా.. చరిత్రను తిరగరాయాలని వారు కలగంటున్నారు. వారి ఆశ సబబే కావొచ్చు. అందుకని.. ప్రజాదరణతో వారు మళ్లీ అధికారంలోకి రావాలి గానీ.. ప్రత్యర్థుల్ని భయపెట్టి కాదు కదా.. అని ప్రజలు అనుకుంటున్నారు.

మనుషుల అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేశారు. చాలా తీవ్రమైన కేసు అది. 2004 నాటి నేరం. ఆ ముందురోజు ఎవరో ఫిర్యాదు చేయగా మరురోజు పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కూడా రాలేదు. ఒక క్వారీ వ్యవహారానికి సంబంధించి బెదిరింపులకు పాల్పడ్డారంటూ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిపై నిన్న కేసు నమోదు అయింది.

ఇవాళ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. జూబ్లీ హిల్స్ సొసైటీలో స్థలాల కేటాయింపులో అక్రమాలకు సంబంధించిన కేసు అది. రేవంత్ పేరు కనపడగానే అందరూ ఓటుకు నోటు కేసు అనుకుంటారు గానీ.. ప్రభుత్వం ‘అలాంటివి కూడా మా వద్ద ఉన్నాయ్’ జాగ్రత్త అని హెచ్చరించినట్లుగా ఇవి కనిపిస్తున్నాయి.

ఇవి ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. అనుకోవాలన్నమాట.

RELATED ఐక్యరాజ్యసమితిలో ఆవు కథ చెప్పిన చంద్రబాబు