రగులుతున్న అగ్నిపర్వతం

తెలంగాణ మంత్రివర్గంలో హరీష్ రావుకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే అయినా కొడుకుకి పట్టాభిషేకం చేయాలనుకుంటున్న కేసీఆర్ ఓ పద్ధతి ప్రకారమే మేనల్లుడిని దూరం పెడుతున్నాడన్నది జగమెరిగిన సత్యం. మేనమామ పొలిటికల్ గేమ్ కి బలికావడానకి హరీష్ అంత తెలివి తక్కువవాడేం కాదు. మంత్రివర్గంలో తన పేరు ఉండదని తెలిసినా అధికారిక ప్రకటన వరకూ వేచిచూశారు, చివరకు ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అతిథిగా హాజరయ్యారు. కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. చివరిగా తనకు అసంతృప్తి లేదని, పార్టీలో తాను సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.

ఈ స్టేట్ మెంట్ లోనే హరీష్ రాజకీయ చతురత కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల్ని పదేపదే ఖండిస్తూ, ప్రకటనలు ఇస్తూ మొత్తానికి టీఆర్ఎస్ లో ఏదో జరిగిపోతోందనే సంకేతాన్ని ఇస్తున్నారు హరీష్ రావు. ఎక్కడా వ్యతిరేక స్వరం వినిపించకుండా తన విధేయతను నిరూపించుకుంటూ సింపతీ పెంచుకుంటున్నారు. ఒకరకంగా కేసీఆర్ పై ఒత్తిడి పెరిగేట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో కొలువుదీరిన వారిలో ఏ ఒక్కరికంటే హరీష్ తక్కువ కాదు. తెలంగాణ పోరాటంలో ఉద్యోగస్తులను ఒక్కటి చేసిన ఘనత, వారందర్నీ టీఆర్ఎస్ కు దగ్గర చేసిన వ్యూహం హరీష్ రావుదే. అలాంటి హరీష్ రావుని పక్కనపెట్టి ఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసి, హరీష్ రావు చలవతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు మంత్రిపదవి ఇవ్వడం భావ్యమా.

టీఆర్ఎస్ పై కత్తులు దూసి, 2014లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి ఆ తర్వాత గోడదూకి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి దయాకర్, తలసాని శ్రీనివాస్ కి కూడా పదవులిచ్చి హరీష్ రావుని పక్కనపెట్టడం కరెక్టేనా. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతున్నాయి. మరోవైపు మంత్రవర్గంలో చోటుదక్కని మిగతా నేతలు కూడా హరీష్ కి మద్దతు తెలుపుతున్నారు. ఆయన అభిమానుల ఓదార్పు యాత్రలతో హరీష్ నివాసం కిటకిటలాడిపోతోంది.

తెరవెనక కేసీఆర్, కేటీఆర్ కలిసి ఈ వేడిని తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అన్నీ కళ్లముందు కనిపిస్తున్నాయి. చివరికి రాజ్ భవన్ లో కూడా హరీష్ రావు నేతల్ని పలకరిస్తున్నట్టు లేదు వ్యవహారం. నేతలే హరీష్ రావును ఓదారుస్తున్నట్టు కనిపించింది సీన్. చివరికి నిన్నరాత్రి కూడా సగానికిపైగా నేతలు హరీష్ రావు నివాసంలో కనిపించారు.

మొత్తమ్మీద ఏమీలేదంటూనే ఏదో జరుగుతోందనే సంకేతాన్ని ప్రజలకు ఇచ్చారు హరీష్ రావు. ఏదో ఒకరోజు ఈ అగ్నిపర్వతం బద్ధలవ్వక మానదు. హరీష్ మనసులో మాట బయటపడక తప్పదు.

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments