మహా కూటమికి 150 స్థానాలు కావాలి!

అరె...! అదెలా సాధ్యం. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నది 119 స్థానాలు మాత్రమే కదా? వారంతా కలిసి 150 స్థానాలు కోరుకుంటే ఎక్కడినుంచి తెచ్చివ్వాలి..? అని ఆశ్చర్యపోతున్నారా? ఇవి పంచుకుంటున్న సీట్ల సంఖ్య కాదులెండి. కేవలం మహాకూటమిలో ఉండగల పార్టీలు కోరుకుంటున్న సీట్లు! పొత్తులు పెట్టుకోవడానికి పార్టీలు సూత్రప్రాయంగా సిద్ధంగానే ఉన్నప్పటికీ.. ఉన్న సీట్లను అన్ని పార్టీలూ పంచుకోవడంలో ప్రతిష్టంభన ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.

తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నిజానికి ఏ పార్టీలు ఎలా పొత్తులు పెట్టుకున్నప్పటికీ అందులో 7 స్థానాలను తీసేసి మిగిలిన వాటికి లెక్కవేసుకోవడం సహజం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోని 7 సీట్లలో సాధారణంగా మజ్లిస్ గెలుస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే వారు పంచుకోవాలి.

కూటమికి నేతృత్వం వహించేది తామే అనే భావనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ 90 స్థానాలకు పోటీచేయాలని గట్టిగా అనుకుంటోంది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ 36 సీట్లకు తగ్గకుండా బరిలోకి దిగాలనేది వారి ఆలోచన. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి మొత్తం 35 స్థానాల్లో తమకు అనుకూల పవనాలు ఉన్నట్లు లెక్క వేసుకున్నది.

కనీసం 20 సీట్లయినా కేటాయించకపోతే.. వారు కూటమిలో జట్టుకట్టడానికి ఒప్పుకోకపోవచ్చు. ఒంటరిగా అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగడానికైనా కోదండరాం సిద్ధంగానే ఉన్నారు. ఇక నాలుగో పార్టీ అయినా సీపీఐ కనీసం నాలుగైనా కేటాయించాలని పట్టుపట్టవచ్చు. ఈ ప్రకారం లెక్కవేస్తేనే 90+36+20+4=150  సీట్లు వారికి అవసరం అవుతాయి.

కనిష్టంగా లెక్క వేసుకుంటే.. తెదేపా గత ఎన్నికల్లోనే 15 స్థానాల్లో గెలిచింది. ఆ 15 కూడా ఇవ్వకపోతే అసలు ప్రతిపాదించడంలోనే అర్థముండదు. మిగిలిన తెజస, సీపీఐలకు కలిపి 10, 4 వంతున పంచుతారని లెక్కవేస్తే మాత్రమే... వాటి వాటా 29  స్థానాలు అవుతాయి. అప్పుడిక కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీచేయడం కుదురుతుంది. కానీ, ఇంత నీచమైన కేటాయింపులకు తెదేపా, తెజస, సీపీఐ ఒప్పుకుంటాయా అనేది ప్రశ్న.

36 సీట్ల కంటె తక్కువకు ఒప్పుకుంటే అది తమ పార్టీకి ఆత్మహత్యా సదృశం అవుతుందని తెదేపా నాయకులు అంటున్నారు. చంద్రబాబు మాత్రం.. పంతాలకు పోకుండా, ఏ పార్టీ గెలవగల స్థానాలను వారికి ఇచ్చేసేలాగా పొత్తులు పెట్టుకోవాలని సూచించారు. మరి.. ఎవరు ఎన్ని మెట్లు దిగుతారో.. పొత్తు బంధాలు ఎలా కుదురుతాయో చూడాలి.

RELATED రీమేక్ కు త్రివిక్రమ్ బై..?