వెబ్ సైట్ల బొమ్మలు కాలుస్తా?

సినిమా జనాలు విమర్శలను అస్సలు తట్టుకోలేకపోతున్నారు. మీరు గొప్పోళ్లు అంటే మీడియా గొప్పది. అప్పుడు పెద్ద పెద్ద ప్రకటనల్లో మీడియాల పేర్లు రాసుకుంటూ, ఇంత రేటింగ్ అంత రేటింగ్ అంటూ హడావుడి చేస్తారు. అప్పుడు మీడియా అంటే చాలా ముద్దు. అదే కనుక తీసిన సినిమా బాలేదు అంటే, అసలు సమీక్ష రాయడం వచ్చా.. సినిమా తీసి చూపించమను, దారిన పోయే దానయ్యలు, సినిమాలు వదిలేస్తా, వెబ్ సైట్లు మూసేస్తారా అంటూ ఇలా ఎవరికి తోచిన మాటలు వాళ్లు విసురుతారు.

అక్కడికి కార్ల సమీక్షలు రాసేవాడు కార్లు తయారు చేస్తాడు, మొబైళ్ల రివ్వూలు రాసేవాళ్లు మొబైళ్లు తయారు చేస్తారు అన్నట్లు. హోటళ్లకు వెళ్లే ప్రతివాడికీ వంట రావాలన్నట్లుగా మాట్లాడతారు. 
ఈ బ్యాండ్ మేళం వ్యవహారంలో మరో దర్శకుడు తోడయినట్లు గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఈ మధ్య విడుదలైన ఓ పెద్ద సినిమాకు కాస్త నెగిటివ్ సమీక్షలు వచ్చాయి. కారణం సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్ల సంగతి అలా వుంచితే, సరైన కథలేదు, లాజిక్ లు వదిలేయడం కాదు, అస్సలు కలికంలోకి కూడా లేకుండా చేసారు.

అందువల్ల ప్రతి ఒక్క వెబ్ సైట్ ఆ సినిమాను విమర్శించాయి. సహజంగా రేటింగ్ ల సినిమాలు కొన్ని వుంటాయి. కమర్షియల్ సినిమాలు కొన్ని వుంటాయి. ఈ తేడాను దర్శకులు చూసుకోవాలి. తాము తీసిన సినిమా ఏ జోనర్ నో చూసుకుని, తమకు తాము సమాధానం చెప్పుకోవాలి.

అయితే ఈ సినిమా దర్శకుడు  మాత్రం సన్నిహితుల దగ్గర వెబ్ సైట్లపై మండి పడ్డట్లు వినికిడి. 'ఈ దీపావళికి బాణా సంచాకు వెబ్ సైట్ల పేర్లు పెట్టి కాలుస్తాను. అవి కాలుతుంటే వీడియోలు తీసి, ఆ వెబ్ సైట్లకు పంపిస్తా' అని కాస్త ఘాటుగా కామెంట్ లు చేసినట్లు తెలుస్తోంది. ఈ నావెల్ అయిడియాలు ఏవో సినిమాల్లో పెడితే బాగుంటుంది. కొత్తగా వుందని జనం ఫీలవుతారు. అంతేకానీ కోపతాపాలు ఎందుకు పనికి వస్తాయి?

Show comments