అలా అడగడం జగన్ నేరమా?

మాజీమంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చాలా సీనియర్ నాయకుడు. చాలామంది ఆయనను పెద్దమనిషిగా భావిస్తుంటారు. కానీ.. ఆయన కొన్నాళ్లుగా తన కూతురు, కొడుకు చిక్కుకున్న వివాదాల పుణ్యమాని వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వచ్చారు. వివాదాలను, విమర్శలను భరిస్తూ వచ్చారు. ఇప్పుడు స్వయంగా ఆయనే.. శాసనసభ ఫర్నిచర్, కంప్యూటర్లను కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వివాదం.. ఆయన చుట్టూ మరింతగా ముసురుకుంది. ఊపిరాడక.. నానా రకాలుగా.. తన తప్పులేదని బుకాయించడానికి ఆయన పాట్లు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

అధికార్లకు చెప్పే తీసుకువెళ్లానని అంటున్న కోడెల... ప్రభుత్వం మారిన తర్వాత.. వాటిని తిరిగి ఇచ్చేయడానికి అధికార్లకు లేఖ రాశానని, వారికి అందలేదేమోనని... ఇప్పుడు ఇచ్చేయడానికి లేదా డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని రెండు రోజులపాటు చెప్పారు. పరువు మరింతగా భ్రష్టు పడుతుండే సరికి ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తున్నారు. జగన్ మీద ఆరోపణలు తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

‘నేను స్పీకరుగా ఉన్నప్పుడు తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందిగా జగన్ నన్ను అడిగారు. అలా చేయలేదని ఇప్పుడు నా మీద బురద చల్లుతున్నారు’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదెలా ఉన్నదంటే.. ‘‘జగన్ నన్ను ఓ కాంట్రాక్టు అడిగాడు.. ఇవ్వలేదు కాబట్టి నా మీద బురద చల్లుతున్నాడు’’ అన్నట్లుగా ఉంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయమని అడగడం అనుచితమైన ఆబ్లిగేషన్ అన్నట్లుగా, వాటిని పట్టించుకోనందుకు కక్ష కట్టినట్టుగా కోడెల మాటలున్నాయి.

జగన్ అడిగి ఉండవచ్చు గాక.. అయితే అది ఆబ్లిగేషన్ కాదు. రాజ్యాంగాన్ని గౌరవించమని, చట్టాన్ని గౌరవించమని, విలువలు పాటించమని హితవు చెప్పడమే అవుతుంది. స్పీకరు బాధ్యతను ఆయనకు గుర్తు చేయడమే అవుతుంది. అలాంటి వైకాపా వినతికి కూడా వక్రభాష్యాలు చెబుతూ... తనమీద బురద చల్లుతున్నారని విలపించడం ఆయనను నవ్వులపాల్జేసేలా ఉంది.

అయినా ఫర్నిచర్ వివాదంలో ఎవరెందుకు ఆరోపణలు చేస్తున్నారనే గోల ఎందుకు? హైదరాబాదులో ఖాళీ చేసిన ఫర్నిచర్, కంప్యూటర్లను తన క్యాంపు ఆఫీసుకు తరలిస్తున్నట్లుగా అసెంబ్లీ రికార్డుల్లో నమోదు చేశారా? లేదా? చేయకపోతే.. కాజేసినట్టే.. చేసి ఉంటే, చేసినందువలన తన తప్పులేదని చెప్పవచ్చు. అంతే తప్ప.. ‘ప్రభుత్వం మారాక లేఖ రాశా- వారికి అందలేదు’ అంటే ప్రజలు నమ్మరు. నవ్వుకుంటారు.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?