అమ్మో.. అంత దోపిడీ సాధ్యమేనా?

చంద్రబాబునాయుడు ప్రభుత్వం హయాంలో చేపట్టిన, ప్లాన్ చేసిన చాలా ప్రాజెక్టుల విషయంలో విపరీతమైన అవినీతికి ఆస్కారం కల్పించారనే ఆరోపణలు అప్పటినుంచీ వినవస్తున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులకు సంబంధించి.. కూడా అనేక ఆరోపణలున్నాయి.

జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ అవినీతి బాగోతాలను ఒక్కొక్కటిగా చక్కబెట్టే ప్రయత్నం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా గమనించినప్పుడు.. ఒక సీనియర్ నాయకుడు చెబుతున్న మాటలు వింటే.. భారీ అవినీతి జరిగిఉంటుందని ఊహించగల వారికి కూడా గుండె ఆగిపోయేంత భయంకరమైన గణాంకాలు వెలుగుచూస్తున్నాయి.

వడ్డే శోభనాద్రీశ్వరరావు అంటే చాలా సీనియర్ నాయకుల్లో ఒకరు. ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడే అయినప్పటికీ.. చంద్రబాబు విధానాలతో విభేదించి.. చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నిర్ణయాల్లో లోపాలను ఎత్తిచూపుతూ గతంలో పలుమార్లు మీడియా ముందుకు వచ్చారు కూడా.

అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు ఒప్పందంనుంచి సింగపూర్ కన్సార్టియం పక్కకు తప్పుకున్న నేపథ్యంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు మరోమారు మీడియా ముందుకు వచ్చి.. కళ్లు చెదిరే విషయాలు వెల్లడించారు.

ఆయన చెప్పిన ప్రకారం.. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు కింద.. ఏపీ ప్రభుత్వం 1691 ఎకరాలను కేటాయిస్తుంది. ఆ స్థలంలో మౌలిక వసతుల కల్పన పేరుతో..  5600 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఇంతా చేస్తే సింగపూర్ సంస్థలు  రూ.300 కోట్ల పెట్టుబడులు మాత్రం పెడతాయి.

అయితే ఆ సంస్థలకు 36,045 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుతుందని ఆయన అంటున్నారు. మీరు చదువుతున్నది నిజమే.. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో పొందే లబ్ధి.. మూడువేలు కాదు.. ముప్ఫయ్యారువేల కోట్లరూపాయల మేర ఉంటుందట.

వడ్డే శోభనాద్రీశ్వరరావు మాటలు నిజమే అయితే గనుక.. ఈ స్టార్టప్ ప్రాజెక్టు ముసుగులో అతిపెద్ద దోపిడీకి కుట్ర జరిగినట్లే లెక్క. ఈ ఒప్పందం రద్దయిన వెంటనే.. జగన్మోహన రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో వెనక్కి తీసికెళ్లిపోతున్నారని..  ముంచేస్తున్నారని.. ఇలాచేస్తుంటే.. ఇక పారిశ్రామిక వేత్తలెవరూ మన రాష్ట్రంవైపు  కన్నెత్తి చూడరని విలపిస్తున్న వారందరికీ బహుశా ఈ 36045 కోట్లలో ఎంతో కొంత వాటా ఉంటుండవచ్చు.

Show comments